మెగా బద్రర్స్ ను ఆ డాక్టర్ అన్ని మాటలన్నారా?

Update: 2016-11-08 14:19 GMT
తెలుగు సినిమా రంగాన్ని ఏలేసిన మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లో పెద్ద ఎత్తున విమర్శలు మూటగట్టుకున్నసంగతి తెలిసిందే.  రాజకీయాల్లో ఆయన అనుసరించిన విధానాల్ని సమర్థించే వారికి తగ్గట్లే తప్పు పట్టేవారూ ఉన్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. చిరంజీవి తమ్ముడు..జనసేన అధినేత పవన్ కల్యాణ్ తొలుత అన్న పెట్టిన పార్టీలో ఉన్నా.. తర్వాత రాజకీయంగా ఆయనకు దూరంగా ఉన్నారు. రాజకీయంగా విభేదించి సొంతంగా జనసేన పార్టీ పెట్టుకున్న పవన్ ఏపీ ప్రయోజనాల కోసం.. ప్రత్యేక హోదా కోసం పోరాడేందుకు వ్యూహ రచన చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ప్రముఖ సెక్సాలజిస్ట్ డాక్టర్ సమరం మెగాబ్రదర్స్ పై సంచలన వ్యాఖ్యలు చేయటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రాజకీయంగా చిరంజీవిని విమర్శించే అవకాశం ఉన్నా.. పవన్ కల్యాణ్ ను తీవ్రస్థాయిలో విరుచుకుపడే వారు లేరనే చెప్పాలి. అందుకు భిన్నంగా తాజాగా విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సమరం.. మెగా బ్రదర్స్ పై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

కాపులంతా చిరంజీవి వెనుక ఉన్నప్పుడే ఆయన ఏమీ చేయలేకపోయారని.. కొత్త వాళ్లను.. అభిమానులను రాజకీయాల్లో ప్రోత్సహిస్తారని అనుకుంటే ఆయన జంప్ జిలానీలకు ఓడిపోయారని మండిపడ్డారు. ప్రజారాజ్యం తరఫున నిజాయితీపరులకు టిక్కెట్లు ఇస్తారని ఆశిస్తే.. అందుకు భిన్నంగా రూ.3 కోట్ల నుంచి రూ.5 కోట్లు వసూలు చేసేందుకు సిద్ధపడినట్లుగా తీవ్ర ఆరోపణలు చేశారు. చిరంజీవి వల్ల కానిది పవన్ వల్ల ఏమవుతుందన్న వ్యాఖ్య చేసిన ఆయన.. జనసేన పార్టీ అంటేనే ఏమీ అర్థం కాకుండా పోయిందన్నారు. అభిమానులు ఈలలు వేయటానికి.. గోల చేయటానికి పనికి వస్తారే కానీ ఓట్లు వేయటానికి పనికిరారంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సమరం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. దీనిపై మెగా బ్రదర్స్ స్పందిస్తారో.. లేక వారి ఫాలోవర్స్ రియాక్ట్ అవుతారో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News