డాక్టర్ను మరో డాక్టర్ తుపాకీతో కాల్చేశాడు

Update: 2016-02-09 04:27 GMT
హైదరాబాద్ మహానగరంలో సంచలన ఘటన చోటు చేసుకుంది. నిత్యం రద్దీగా ఉండే హిమాయత్ నగర్ లో తుపాకీ కాల్పుల ఘటన కలకలాన్ని రేపింది. ఈ కాల్పుల ఘటనలో బాధితుడు.. బాధ్యులు వైద్యులు కావటం గమనార్హం. స్థానికంగా తీవ్ర సంచలనాన్ని రేపిన ఈ ఉదంతంలోకి వెళితే..

చైతన్యపురికి చెందిన సాయి నికిత్ ఆసుపత్రి యజమాని.. డాక్టర్ శశికుమార్.. మాదాపూర్ కి చెందిన డాక్టర్ ఉదయ్ కుమార్.. మాదాపూర్ కి చెందిన మరో డాక్టర్ సాయికుమార్ లు మూడేళ్ల క్రితం మాదాపూర్ లో లారెల్ ఆసుపత్రిని రూ.15కోట్లతో షురూ చేశారు. ఈ ఆసుపత్రి నిర్మాణానికి కొంత మొత్తాన్ని ఎన్నారైల నుంచి అప్పుగా తీసుకొని జనవరి 1, 2016 నుంచి మొదలు పెట్టారు.

అయితే.. డాక్టర్ ఉదయ్ కుమార్ తన భాగస్వామి అయిన శశికుమార్ కు చెప్పకుండా మరొకరికి పార్టనర్ షిప్ ఇచ్చారు. దీంతో వీరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ ఇష్యూ గురించి మాట్లాడుకునేందుకు ముగ్గురు డాక్టర్లు హోటల్ కు వెళ్లారు. అక్కడ బిజీగా ఉండటంతో ముగ్గురు హిమాయత్ నగర్ లోని ఒక అపార్ట్ మెంట్ దగ్గర ఆగారు. వీరి మధ్య మాటలు పెరిగి గొడవగా మారింది. ఈ సమయంలో డాక్టర్ శశికుమార్ తన దగ్గరున్న లైసెన్స్ రివాల్వర్ తో డాక్టర్ ఉదయ్ మీద ఒక రౌండ్ కాల్పులు జరిపారు. ఈ దాడి నుంచి తప్పించుకున్న ఉదయ్ కుమార్ కు చెవి దగ్గర గాయమైంది. తమ దాడి విఫలం కావటంతో డాక్టర్లు సాయి.. శశిలు పారిపోగా.. గాయంతో ఉన్న ఉదయ్ ఆటోలో ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకుంటున్నారు. డాక్టర్లు అయి ఉండే.. ఇలా తుపాకీలతో కాల్చుకోవటం సంచలనంగా మారింది.
Tags:    

Similar News