గాంధీలో కొట్టుకున్న డాక్టర్లు

Update: 2021-04-27 15:33 GMT
గాంధీ మెడికల్ కాలేజీలో డాక్టర్లు కొట్టుకున్న సంఘటన చర్చనీయాంశమైంది. పరీక్ష కేంద్రంలోనే ఎగ్జామినర్ నేనంటే నేను అంటూ ఇద్దరు డాక్టర్లు కొట్టేసుకున్నారు.  వైద్య విద్యార్థులు వీరి కొట్టుకోవడం చూసి అవాక్కయ్యారు.  కాలేజీ అధికారులు రంగంలోకి దిగి ఇద్దరు వైద్యులను సముదాయించి సమస్యను ఇంతటితో పరిష్కరించారు.

ఆర్గోపెడిక్ విభాగం పరీక్షల ఇంటర్నల్ ఎగ్జామినర్ గా ప్రొఫెసర్ రవీందర్ కుమార్ ను నియమిస్తూ ఈనెల 24న రిజిస్ట్రార్ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ప్రొఫెసర్ బి.వాల్యాను ఎగ్జామినర్ గా నియమిస్తున్నట్టు ఈనెల 26న మరో నియామక ఉత్తర్వులు జారీ చేశారు.ఇలా అధికారులు ముందుగా చూసుకోకుండా రెండు నియామక ఉత్తర్వులు జారీ చేయడమే ఈ గొడవకు కారణమని సమాచారం.  

గాంధీ మెడికల్ కాలేజీలో వైద్య విద్యార్థులు పరీక్షకు వచ్చారు. ఈ సమయంలో ఎగ్జామినర్ నేనంటే నేను అని వైద్యులు వాగ్వాదానికి దిగారు. ఎగ్జామినర్ ఎవరో తెలియక విద్యార్థులు అయోమయంలో పడ్డారు. పరీక్షలకు ప్రిపేర్ అయిన విద్యార్థులు వీరి గొడవ చూసి మండిపడ్డారు. తాము చదివింది గుర్తుండాలా? లేదా అని ఇద్దరు వైద్యులను నిలదీశారు.

అయితే 8 రోజులు జరిగే ఈ పరీక్షల్లో నాలుగు రోజులకు ఒకరు.. మరో నాలుగు రోజులకు మరొకరు ఎగ్జామినర్ గా ఉంటారని కాలేజీ ప్రిన్సిపల్ ప్రకటించడంతో వివాదం సద్దు మణిగింది. అయితే ఈ వైద్యుల మధ్య రెండేళ్లుగా విభేదాలు కొనసాగుతున్నట్లు కాలేజీలో చర్చించుకుంటున్నారు.
Tags:    

Similar News