కొడాలి నాని తిట్లకు ఒక లెక్కుందా?

Update: 2022-01-25 05:51 GMT
తెలుగు రాష్ట్రాల రాజకీయాలు అంతకంతకూ దిగజారిపోతున్నాయన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. గతం సంగతిని పక్కన పెడితే.. వర్తమానంలో మాత్రం ఈ పరిస్థితి చాలా దారుణంగా ఉందన్న మాట వినిపిస్తోంది.

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కొందరు నేతల నోటి నుంచి వచ్చే మాటలు మంట పుట్టించేలా ఉండటమే కాదు.. కనీస మర్యాద అన్నది లేకుండా రాజకీయ ప్రత్యర్థులను ఉద్దేశించి ఎంత మాట పడితే అంత మాట అనేయటం కనిపిస్తుంది. తెలంగాణతో పోలిస్తే.. ఏపీకి చెందిన నేతలు రెండు ఆకులు ఎక్కువే తిన్నట్లుగా కనిపిస్తాయి వారి మాటల్ని చూస్తే.

సంక్రాంతి సందర్భంగా గుడివాడలో నిర్వహించినట్లుగా ఆరోపణలు ఉన్న మంత్రి కొడాలి నానికి చెందిన కె కన్వెన్షన్ క్యాసినో ఎపిసోడ్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనంగా మారింది. ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ఫోటోలు.. వీడియోలు ఇప్పటికే హల్ చల్ చేశాయి. అయితే.. అవన్నీ తప్పుడు వీడియోలుగా కొడాలి నాని కొట్టి పారేస్తున్నారు. కె కన్వెన్షన్ సెంటర్ కు నిజనిర్దారణ కమిటీ అంటూ టీడీపీ అధినేత ప్రకటనపై కొడాలి నాని మరింతగా చెలరేగిపోయారు. బోలెడన్ని అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వైనంపై టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతూ.. అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. కొడాలి నాని వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చేందుకు సోమవారం ఉదయం  టీడీపీ నేత బుద్దా వెంకన్న ప్రెస్ మీట్ పెట్టిన వైనం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాటలు వైరల్ గా మారాయి. అన్నింటికి మించి.. షర్మిల ఏపీలో పార్టీ పెడితే మొదట ఆ పార్టీలో చేరేది మంత్రి కొడాలి నానినే అని.. అప్పుడు కూడా ఇప్పుడు చంద్రబాబును తిట్టినట్లే.. జగన్ ను తిట్టటం ఖాయమంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అనుకున్నట్లుగానే.. బుద్దా వెంకన్నను పోలీసులు అదుపులోకి తీసుకోవటం తెలిసిందే.

ఇదిలా ఉంటే బుద్దా వెంకన్న చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొడాలి రియాక్టు అయ్యారు. ఆయన చేసిన ప్రతి వ్యాఖ్యకు కౌంటర్ ఇచ్చిన కొడాలి నాని.. ఎప్పటిలానే చెలరేగిపోయారు. ఇన్ని మాటలు మాట్లాడిన కొడాలి.. బుద్దా వెంకన్న ప్రస్తావించిన షర్మిల పార్టీలో చేరే అంశానికి మాత్రం స్పందించకపోవటం గమనార్హం. ఇదంతా చూసినప్పుడు.. కొడాలి నాని విరుచుకుపడే వ్యాఖ్యల్లోనూ లెక్క ఉందని.. ఉత్తినే మాట్లాడటం లేదన్న విషయం అర్థమవుతుంది.

తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టే కొడాలి మాటలన్నీ ఆవేశంతో చేసేవి కావని... తన అనుకున్నట్టు  లెక్కగానే చేస్తున్నారంటున్నారు. ఒకవేళ కొడాలికి లెక్క తెలీకుంటే.. బుద్దా వెంకన్న ప్రస్తావించిన షర్మిల పార్టీ అంశంపైనా మాట్లాడేవారని.. అదేమీ మాట్లాడకుండా మిగిలిన విషయాల్ని మాత్రమే మాట్లాడారంటే.. తన విరుచుకుపడే మాటలన్ని లెక్కగానే ఆయన తిడుతున్నట్లుగా పరిగణలోకి తీసుకోవాలన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News