రోజాపై నిషేధంలో కొత్త డిమాండ్‌

Update: 2017-03-09 06:08 GMT
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ల‌క్ష్యంగా సాగుతున్న అధికార తెలుగుదేశం పార్టీ ఈ విష‌యంలో ఆస‌క్తిక‌ర‌మైన డిమాండ్లు చేస్తోంది.   తెలుగుదేశం పార్టీ అధికార ప్ర‌తినిధి - ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ ప్రతిష్టను దిగజారుస్తున్న ఎమ్మెల్యే రోజాను శాసనసభకు రాకుండా జీవితకాల నిషేధం విధించాలని కోరారు. టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స‌భ‌లో ఆమె ప్ర‌వ‌ర్త‌న స‌రిగా లేద‌న్నారు. 2016 సెప్టెంబర్‌ 2న స్పీకర్‌ కు రాసిన లేఖలో క్షమాపణ చెప్పటానికి అంగీకరించారని, తాజాగా అసెంబ్లీ లాబీలో 'తాను ఏ తప్పూ చేయలేదు.. ఎవరికీ క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు' అని మాట మార్చారని డొక్కా వివ‌రించారు.

రోజా తన ప్రవర్తనకు కచ్చితంగా క్షమాపణ చెబితేనే ఆమెను సభకు అనుమతించాలని డొక్కా డిమాండ్ చేశారు. ఆమె మాట‌మార్చిన తీరును స‌భ గ‌మ‌నించాల‌ని కోరారు. సభా హక్కుల కమిటీ నివేదికలో సైతం ఈ విష‌యాల‌ను పొందుప‌ర్చాల‌ని ఆయ‌న సూచించారు. స్పీకర్ సైతం స‌రైన‌ నిర్ణయం తీసుకోవాల‌న్నారు. స‌భ గౌర‌వం మంట‌గ‌ల్పేలా వ్య‌వ‌హ‌రిస్తున్న రోజాను అసెంబ్లీకి దూరంగా ఉంచ‌డ‌మే మేల‌ని మాణిక్య వ‌ర‌ప్ర‌సాద్ తెలిపారు. కాగా, ఆది నుండి నూతన రాజధాని అమరావతి ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వైసీపీ ప్రవర్తిస్తోంద‌ని డొక్కా మాణిక్య‌ప్ర‌సాద్ అన్నారు. రాజధాని రైతుల విందు భోజనానికి రాకుండా వైఎస్‌ జగన్‌ - మొదటి శాసనసభను అవమానిస్తూ రోజా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. దళితులకు టీడీపీ సముచిత స్థానం కల్పిస్తుందని, ముఖ్యమంత్రి తనపై నమ్మకముంచి అప్పగించిన బాధ్యతను సద్వినియోగం చేసుకుంటానని ఆరోపించారు.

కాగా, రోజాపై మరో ఏడాదిపాటు సస్పెన్షన్ విధించాలన్న ఆలోచనపై తెలుగుదేశం పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని చ‌ర్చ సాగుతోంది. ప‌లువురు మంత్రులు, సీనియర్లు మాత్రం రోజా వ్యవహారాన్ని ఇంతటితో ముగిస్తే మంచిదన్న అభిప్రాయంతో ఉన్నారని పార్టీ వ‌ర్గాలు అంటున్నాయి. ఇప్పటికే ఆమెకు విపరీతమైన ప్రచారాన్ని మనమే ఇచ్చామని, మళ్లీ మరో ఏడాది స‌స్పెన్ష‌న్ పొడ‌గింపు అంటే రోజాకు ఉచిత ప్రచారం ఇచ్చి మనమే ఎదురు అస్త్రాలు అందిస్తున్న వారం అవుతామ‌ని వారు పేర్కొంటున్నారు. ఇప్పటికే ఆమెకు మహిళలల్లో బోలెడంత సానుభూతి తెచ్చిపెట్టామని, అది సరిపోక మళ్లీ మరో ఏడాది సస్పెండ్ చేయ‌డం ఏమిట‌ని పేర్కొంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News