హైద‌రాబాద్‌ కు ఇవాంకా..ట్రంప్ టీంలో మంత్రి ఊస్ట్‌

Update: 2017-12-03 08:41 GMT
అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్  ట్రంప్ త‌న‌య ఇవాంకా ట్రంప్ హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న అగ్ర‌రాజ్యంలోని పాల‌క‌వ‌ర్గంలో కుదుపుల‌కు కార‌ణ‌మ‌వుతోంది. హైద‌రాబాద్ వేదిక‌గా సాగిన గ్లోబ‌ల్ ఎంట‌ర్‌ ప్రెన్యూర్‌ షిప్ స‌మ్మిట్‌ లో పాల్గొనేందుకు హాజ‌ర‌య్యే అమెరికా బృందానికి ఇవాంకా ట్రంప్‌ నాయ‌క‌త్వం వ‌హించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఆమె నాయ‌క‌త్వంపై విదేశాంగ మంత్రి రెక్స్‌ టిల్లర్‌ సన్ విబేధించారు. ఆమెతో వెళ్లే అధికారుల బృందంలో కోత‌లు విధించారు. ఈ పరిణామం వైట్‌ హౌస్‌ లో లుక‌లుక‌ల‌కు కార‌ణంగా మారింది.

దీంతో విదేశాంగ మంత్రి టిల్ల‌ర్‌ స‌న్‌ ను మార్చాలని ట్రంప్‌ ప్రభుత్వం భావిస్తోందని అమెరికా మీడియా కోడై కూసింది. టిల్ల‌ర్‌ స‌న్ స్థానంలో సీఐఎ డైరెక్టర్‌ మైక్‌ పాంపియోను నియమించాలని యోచిస్తున్నట్లు ట్రంప్‌ ప్రభుత్వ సీనియర్‌ అధికారుల‌ను ఉటంకిస్తూ ఆ దేశ మీడియా వివ‌రించింది. సీఐఎ డైరెక్టర్‌ గా పాంపియో స్థానంలో రిపబ్లికన్‌ సెనెటర్‌ టామ్‌ కాటన్‌ నియమితులవుతారని పేర్కొంది. ఈ మేరకు వైట్‌ హౌస్‌ ఒక ప్రణాళికను రూపొందించిందంటూ మొదటగా న్యూయార్క్‌ టైమ్స్‌ పేర్కొంది. అయితే ఈ పునర్వ్వవస్థీకరణకు ట్రంప్‌ ఇంకా తుది ఆమోద ముద్ర వేశారా లేదా అనేది తెలియరాలేదని, టిల్లర్‌ సన్‌ ను మార్చడానికి సంబంధించి ప్రణాళికను అభివృద్ధిపరిచిన వైట్‌ హౌస్‌ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ జాన్‌ కెల్లీ - ఇతర అధికారులతో కూడా దీనిపై సవివరంగా చర్చించారని తెలిపింది. గత కొద్ది మాసాలుగా టిల్లర్‌ సన్‌ మార్పుపై అనేక ఊహాగానాలు వినవస్తున్నాయి. ప్రస్తుతం ఐక్యరాజ్య సమితిలో అమెరికా రాయబారిగా వున్న నిక్కీ హేలీ ఆస్థానంలో నియమితులు కావచ్చని వార్తలు వచ్చాయి. కానీ ఈలోగా పాంపియో పేరు తెరపైకి వచ్చింది. జాతీయభద్రతకు సంబంధించిన అంశాల్లో ఆయన ట్రంప్‌ విశ్వాసాన్ని చూరగొన్నారు.

కాగా, విదేశాంగ మంత్రిగా రెక్స్‌ టిల్లర్‌ సన్‌ కు ఉద్వాసన చెప్పనున్నారని ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ స్పందించారు. మీడియా వార్తలన్నీ బూటకమని వ్యాఖ్యానించారు. కొన్ని అంశాలపై ఇరువురుకు భిన్నమైన అభిప్రాయాలు ఉన్నప్పటికీ ఇద్దరం కలిసి బాగా పనిచేస్తున్నామని ట్రంప్‌ ట్వీట్‌ చేశారు. `రెక్స్‌ టిల్లర్‌ సన్‌ ను నేను తొలగిస్తున్నానని లేదా ఆయనే వైదొలగుతున్నారని మీడియా ఊహాగానాలు చేస్తోంది. కానీ ఇది బూటకపు వార్త. మేమిద్దరం చక్కగా కలిసి పనిచేస్తున్నాం. అమెరికాకు ఆయనంటే చాలా గౌరవం ఉంది`అని ట్విట్టర్‌ లో ట్రంప్‌ పేర్కొన్నారు. ట్రంపే స్వయంగా ట్విట్టర్‌ లో స్పష్టం చేయడంతో దీనిపై గందరగోళం పరిష్కారమైంది. రెక్స్‌ ఇక్కడే ఉంటారని ట్రంప్‌ పేర్కొన్న నేపథ్యంలో వైట్‌ హౌస్‌ పత్రికా కార్యదర్శి సారా శాండర్స్‌ మాట్లాడుతూ మంత్రిమండలిలో ఎలాంటి మార్పులుండబోవని చెప్పారు.
Tags:    

Similar News