ట్రంప్ లో ఫస్ట్రేషన్ పీక్స్ కు చేరిపోతోందిగా..

Update: 2020-03-24 11:00 GMT
చైనాకు చుక్కలు చూపించిన కరోనా వైరస్.. ఇప్పుడు ప్రపంచం మొత్తానికి పాకేసింది. రష్యా.. నార్త్ కొరియా లాంటి కొన్ని దేశాలకు మినహా మిగిలిన అన్ని దేశాల్లోనూ కరోనా వ్యాప్తి అంతకంతకూ ఎక్కువ అవుతోంది. ఈ వైరస్ విషయంలో మొదట్నించి.. తన వేలును చైనా వైపు చూపిస్తున్న ట్రంప్.. కరోనా వ్యాప్తి అమెరికాలో కంట్రోల్ చేసే విషయంలో ఫెయిల్ అయ్యారని చెప్పాలి.

ట్రంప్ ఫోకస్ అంతా చైనా మీద ఉంటే.. కరోనా వైరస్ మాత్రం అమెరికన్లలో ఎంట్రీ ఇచ్చేసి.. తన పని తాను చేసుకుంటూ పోతోంది. దీంతో.. చూస్తున్నంతనే న్యూయార్క్ లాంటి మహానగరం ఇప్పుడు కరోనా బారిన పడి విలవిలలాడిపోతోంది. అమెరికా లాంటి దేశంలో కరోనా వ్యాప్తి ఇంత వేగంగా ఉండటాన్ని పలువురు జీర్ణించుకోలేకపోతున్నారు. అమెరికన్లలో అత్యధికులు క్రమశిక్షణతో పాటు.. బాధ్యతగా ఉంటారన్న పేరుంది. అలాంటి దేశంలోనూ కరోనా విస్తరిస్తున్న తీరు.. బయటకు వస్తున్న గణాంకాలు భయపెట్టేలా ఉన్నాయి.

ఇదిలా ఉంటే.. కరోనా ప్రభావం ప్రజల ఆరోగ్యం మీద కంటే.. దేశ ఆర్థిక స్థితి మీద ఎక్కువ ప్రభావం చూపటం.. ఈ వ్యవహారం నెలల తరబడి సాగే ప్రమాదం పొంచి ఉండటంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు చిరాకు తెప్పిస్తోంది. కరోనా కట్టడికి అవసరమైన క్వారంటైన్ లాంటి పరిష్కారాలతో సమస్య తీవ్రత అంతకంతకూ పెరగటం.. వీటి కారణంగా ఆర్థిక వ్యవస్థ దారుణంగా మారటాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే ఆర్థిక అంశాలు.. కరోనాతో కలిగే నష్టం గురించి ఒక పది రోజులు అస్సలు ఆలోచించకూడదన్న ఆలోచనలో ట్రంప్ ఉన్నారు. తాజాగా ఆయన అదే విషయాన్ని చెబుతున్నారు.

కరోనా సమస్య కంటే దాని పరిష్కారం మరింత దారుణంగా మారే పరిస్థితిని మనం తెచ్చుకోకూడదన్న ట్రంప్.. పదిహేను రోజుల గడువు తర్వాత తామేం చేయాలన్న నిర్ణయాన్ని తీసుకుందామని.. ఆ లోపు మాత్రం అమెరికన్ల ఎవరికి వారు ఇళ్లకే పరిమితం కావాలన్నారు. ట్రంప్ చెప్పిన రెండు వారాల్లో ఇప్పటికే వారం గడిచిపోయింది. ఇప్పటికే కరోనాపై ఏమేం చేయాలి? ఎలాంటి నియంత్రణచర్యలు చేపట్టాలి? విధించాల్సిన పరిమితుల్ని ఇప్పటికే విధించారు. దీంతో.. రానున్న వారంలో పరిస్థితుల్లో మార్పు రానున్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అయితే.. ఆయన అనుకున్నట్లు మార్పులు వస్తాయా? అన్నది ప్రశ్న. దీనికి సమాధానం కాస్త వెయిట్ చేయాల్సిందే. కానీ.. తాజాగా ట్రంప్ చేస్తున్న ట్వీట్ చూసినప్పుడు.. ఆయనలో కరోనా ఫస్ట్రేషన్ అంతకంతకూ పెరిగిపోతుందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News