కిమ్‌కు త‌న కారును చూపించిన ట్రంప్‌!

Update: 2018-06-13 04:34 GMT
ఉన్న‌ది ఉన్న‌ట్లుగా మాట్లాడితే.. ఇద్ద‌రు ప్ర‌ముఖ మూర్ఖులు.. మొండివాళ్లు.. విప‌రీత‌మైన ప‌వ‌ర్ ఉన్నోళ్లు.. త‌మ‌కున్న అధికారంతో ప్ర‌పంచాన్ని క్ష‌ణాల్లో ప్ర‌భావితం చేసేటోళ్లు.. అన్నింటికి మించి నీ అంతు చూస్తానంటే.. నీ అంతు చూస్తానంటూ ఇష్టారాజ్యంగా మాట్లాడుకున్న ఇద్ద‌రు సామ‌ర‌స్యంగా.. స్నేహ‌పూర్వ‌కంగా క‌ల‌వ‌టం.. మాట్లాడ‌టం సాధ్య‌మేనా? అంటే.. సాధ్యం కాద‌నే చెబుతారు.

తామ‌నుకుంటే ఏదైనా సాధ్య‌మేన‌న్న విష‌యాన్ని ప్ర‌పంచానికి చెప్పాల‌నుకున్నారో ఏమో కానీ.. అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్‌.. ఉత్త‌ర కొరియా అధ్య‌క్షుడు కిమ్ జోంగ్ ఉన్‌ లు ఇద్ద‌రూ భేటీ అయ్యారు. వీరి భేటీతో యావ‌త్ ప్ర‌పంచం ఆస‌క్తిక‌రంగా చూసింది. వీరేం మాట్లాడుకుంటారు?  వీరి చ‌ర్చ‌ల ప‌ర్య‌వ‌సానాలు ఎలా ఉంటాయి?  ఈ భేటీతో ఇరు దేశాల మ‌ధ్య సంబంధాలు ఎలా ఉండ‌నున్నాయి? అన్న ప్ర‌శ్న‌ల‌తో పాటు.. బోలెడన్ని అనుమానాల మ‌ధ్య వీరిద్ద‌రి మ‌ధ్య చారిత్ర‌క భేటీ సాగింది. ఈ స‌మావేశంతో ఏదో అద్భుతం ఆవిష్కృతం అవుతుంద‌న్న అంచ‌నాల్ని ప‌లువురు వ్య‌క్తం చేసినా.. అలాంటిదేమీ ఉండ‌దన్న‌ట్లే చివ‌రికి తేలింది. అద్భుత నిర్ణ‌యాల వ‌ర‌కూ ఎందుకు?  అస‌లు ఈ రెండు భిన్న ధ్రువాలు క‌ల‌వ‌ట‌మే గొప్ప‌.. అదే ఒక అద్భుతం.. ఫ‌లితాల గురించి ప‌ట్టించుకోవ‌ద్ద‌న్న‌ట్లుగా వీరి స‌మావేశం ముగిసింది.

నామ‌మాత్రంగా కుదిరిన ఒప్పందాలు మిన‌హాలు ఈ స‌మావేశం సాధించిందేమీ లేదు. ఈ మీటింగ్ కోసం సింగ‌పూర్ ప్ర‌భుత్వం రూ.100 కోట్ల వ‌ర‌కూ ఖ‌ర్చు చేసింది. ప్ర‌పంచ వ్యాప్తంగా 2500 మంది మీడియా ప్ర‌తినిధులు ఈ ఈవెంట్‌ ను క‌వ‌ర్ చేసేందుకు సింగ‌పూర్ వెళ్లారు. ఇలా చెప్పుకుంటే ట్రంప్‌.. కిమ్ భేటీ సంద‌ర్భంగా విశేషాల‌కు కొద‌వ‌లేద‌నే చెప్పాలి.

దాదాపు నాలుగు గంట‌ల పాటు సాగిన ఈ భేటీలో ఆస‌క్తిక‌ర అంశాల్ని చూస్తే..

+ ట్రంప్‌.. కిమ్ మ‌ధ్య భేటీలో పాల్గొనేందుకు ఉత్త‌ర‌కొరియా అధ్య‌క్షుడు తొలుత మీటింగ్ హాల్‌ కు వ‌చ్చారు. ఇదో గొప్ప విజ‌యంగా అమెరిక‌న్లు కొంద‌రు అభివ‌ర్ణిస్తే.. ఉత్త‌ర కొరియా సంప్ర‌దాయం ప్ర‌కారం ఎక్క‌డైనా.. ఏదైనా స‌మావేశానికి వ‌య‌సులో చిన్నోళ్లు స‌భ‌కు ముందుగా రావ‌టం అల‌వాటు. అది వారికిచ్చే గౌర‌వంగా భావిస్తారు. పెద్ద‌ల మీద త‌మ‌కున్న గౌర‌వాన్ని కిమ్ ప్ర‌ద‌ర్శించిన‌ట్లుగా కిమ్ వ‌ర్గీయులు వివ‌ర‌ణ ఇస్తున్నారు.

+ కిమ్ తో స‌మావేశానికి మీటింగ్ ప్రారంభానికి ముందు.. కేవ‌లం 60 సెక‌న్ల ముందు మాత్ర‌మే వ‌చ్చారు. ఇరువురు దేశాధినేత‌లు త‌మ దేశ జాతీయ ప‌తాకాల ఎదుట నిల‌బ‌డి ఒక‌రికొక‌రు 13 సెక‌న్ల పాటు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు.

+ మీటింగ్ సంద‌ర్భంగా అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ ను తొలుత ఉత్త‌ర కొరియా అధ్యక్షుడు కిమ్ ప‌లుక‌రించారు. ప్రెసిడెంట్.. మిమ్మ‌ల్ని క‌ల‌వ‌టం బాగుంద‌ని కిమ్ మొద‌ట మాట్లాడ‌గా.. ఇది నా గౌర‌వం.. మీతో అద్భుత‌మైన సంబంధం ఉంటుంద‌ని భావిస్తున్నా.. అందులో ఎలాంటి సందేహం అక్క‌ర్లేద‌ని ట్రంప్ వ్యాఖ్యానించారు.

+ ట్రంప్.. కిమ్ స‌మావేశానికి వేదిక‌గా ఉప‌యోగించిన ప్రాంతంతో పాటు.. మీటింగ్ సంద‌ర్భంగా ఉప‌యోగించిన టేబుల్‌కు 80 ఏళ్ల చ‌రిత్ర ఉంది. సింగ‌పూర్ సుప్రీంకోర్టు చీఫ్ జ‌స్టిస్ ఉప‌యోగించిన టేబుల్‌ను ఈ చారిత్ర‌క భేటీ కోసం వాడారు.

+ ట్రంప్‌.. కిమ్ భేటీ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన విందులో భారీ ఎత్తున వంట‌కాల్ని వండి వ‌ర్చారు.  మెనూ చూస్తే.. ప్రాన్స్ కాక్‌టెయిల్‌, గ్రీన్‌ మ్యాంగో కిరాబు, కొరియన్‌ వంటకాలు, అవకాడో సలాడ్‌, డార్క్‌ చాక్లెట్‌ టార్లెట్‌ గనచీ, హగెన్‌-డస్‌ వెనీలా ఐస్‌క్రీం, పేస్ట్రీతో పాటు వివిధ వంటకాలను ప్రత్యేకంగా సిద్ధం చేశారు. దీనికి సంబంధించిన మెనూని శ్వేతసౌధం విడుదల చేసింది.

* తొలిసారిగా ట్రంప్‌-కిమ్‌ భేటీ సంద‌ర్భంగా వారిరువురు మీడియా ఎదుట ఫోటోల‌కు ఫోజులిచ్చారు. ఇవి.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. ఫోటోల‌కు ఫోజులిచ్చే క్ర‌మంలో త‌మ ఇద్ద‌రిని స‌న్న‌గా.. అందంగా ఉండేలా ఫోటోలు తీయాలంటూ ట్రంప్ జోక్ చేశారు. అయితే.. దీన్ని కిమ్ అర్థం చేసుకోలేక‌పోయారు.
స‌ద‌స్సు సంద‌ర్భంగా ట్రంప్ ఎరుపు రంగు టై ధ‌రించ‌టం కిమ్ ప‌ట్ల చూపించిన గౌర‌వంగా ఉత్త‌ర కొరియా మీడియా విశ్లేషించింది. ఉత్త‌ర‌కొరియ‌న్లు ఎరుపు రంగును ఎక్కువ‌గా వినియోగిస్తార‌ని.. దీనికి త‌గ్గ‌ట్లే  ట్రంప్ ఎరుపు రంగు టై ధ‌రించిన‌ట్లుగా పేర్కొంది.

+ ఇరువురు అధినేత‌ల ఏకాంత చ‌ర్చ‌ల‌కు ముందు కిమ్ భుజం మీద ట్రంప్ చెయ్యేసి స్నేహ‌బంధాన్ని ప్ర‌ద‌ర్శిస్తే.. మీడియా స‌మావేశం త‌ర్వాత కిమ్ ట్రంప్ వీపు మీద చెయ్యేసి తీసుకెళ్లారు.

+ శాంతితో ఇరు దేశాలకు క‌లిగే ప్రయోజనాలపై కిమ్‌కు ట్రంప్‌ హాలీవుడ్‌ సినిమా తరహాలో ఓ వీడియో చూపించారు. ‘ఇద్దరు వ్యక్తులు, ఇద్దరు నాయకులు, ఒక లక్ష్యం’ పేరిట దానిని ప్రదర్శించారు. హాలీవుడ్‌ యాక్షన్‌ సినిమాలు ‘ఇన్‌ ఏ వరల్డ్‌’, ‘వన్‌ మ్యాన్‌, వన్‌ చాయిస్‌’ తరహాలో ఆ వీడియోను రూపొందించారు. అందులో ట్రంప్‌, కిమ్‌ ఇద్దరే హీరోలు. గతంలో ఎన్నడూ లేనంత సంపదను కూడబెట్టే కొరియా హీరోగా కిమ్‌ను అందులో అభివర్ణించారు.

+ శిఖరాగ్ర తీర్మానంపై సంతకానికి ట్రంప్ సిగ్నేచ‌ర్ తో డిజైన్ చేసిన రెండు ఖరీదైన పెన్నులు తీసుకొచ్చారు. అయితే.. కొత్త మిత్రుడు తీసుకొచ్చిన పెన్నును కిమ్ వాడ‌లేదు. తాను చేయాల్సిన సంత‌కాల కోసం త‌న సోద‌రి ఇచ్చిన బాల్ పాయింట్ పెన్నును వినియోగించారే కానీ.. ట్రంప్ తెచ్చిన పెన్నును వాడ‌క‌పోవ‌టం గ‌మ‌నార్హం. ట్రంప్ సిగ్నేచ‌ర్ ఉన్న పెన్నును తాను వాడ‌ట‌మా? అన్న‌ట్లు కిమ్ వ్య‌వ‌హ‌రించారు.

+ కిమ్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన లిమోజీన్‌ కారు ‘ద బీస్ట్‌’ను చూపించారు. దాని ప్రత్యేకతలను వివరించారు. సదస్సు ముగిసిన తర్వాత కిమ్‌ - ట్రంప్‌ లు హోటల్‌ ప్రాంగణంలో  తిరిగారు. ఈ సందర్భంగా - అమెరికా అధ్యక్షుడి లీమోజీన్‌ కారును ట్రంప్ తానే స్వ‌యంగా కిమ్‌ కు చూపించారు. రూ.10 కోట్ల విలువైన ఈ ఎనిమిది టన్నుల బుల్లెట్‌ ప్రూఫ్‌ కారులోకి వెళ్లి కిమ్‌ పరిశీలించారు. కారు విశేషాల్ని ట్రంప్‌ చెబుతుంటే కిమ్‌ నవ్వుతూ నిలుచున్నారు.
Tags:    

Similar News