ట్రంప్ మర్యాదగా మాట్లాడినా వార్తే

Update: 2017-02-07 09:43 GMT
అమెరికా అధ్యక్షుడంటే ప్రపంచానికి పెద్దన్న లాంటోడు. అలాంటి పదవిలో ఉండే వ్యక్తికి లభించే గౌరవాభిమానాలు భారీగా ఉంటాయి. అయితే.. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణస్వీకారం చేశారో.. అందుకు రివర్స్ పరిస్థితి అయ్యింది.కంపు నోరు ట్రంప్ అన్న పేరున్నఆయన.. తనకున్న పేరుకు తగ్గట్లే వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా ఇష్టారాజ్యంగా మాట్లాడటం నిత్య సంచలనంగా మారింది.

అతగాడి వివాదాస్పద వైఖరి ఎంతవరకూ వెళ్లిందంటే..  ట్రంప్ మర్యాదగా మాట్లాడినా అదోవిశేషంగా.. ఆసక్తికర వార్తగా మారుతోంది. తాజాగా అలాంటి ఉదంతమే చోటు చేసుకుంది. ఈ మధ్యన అమెరికాకు మంచి దోస్త్ అయిన ఆస్ట్రేలియా ప్రధానికి ఫోన్ చేసిన ట్రంప్.. మాటల మధ్యలో తన విధానాల్ని తప్పు పట్టిన ప్రధానిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడటమే కాదు.. మధ్యలోనే ఫోన్ కట్ చేసిన వైనం ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

తాజాగా అందుకు భిన్నమైన పరిస్థితి. ఆస్ట్రేలియా పక్కనే ఉండే న్యూజిలాండ్ ప్రధానికి ట్రంప్ ఫోన్ చేయటం.. చాలా మర్యాదగా మాట్లాడటం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సోమవారం న్యూజిలాండ్ ప్రధానికి ఫోన్ చేసిన ట్రంప్.. దాదాపు పావు గంటకు పైనే మాట్లాడారని.. ఇరువురి మధ్యా గౌరవప్రదంగా.. సామరస్య వాతావరణంతో ఫోన్ టాక్ జరిగినట్లుగా చెబుతున్నారు.

శరణార్థులపై నిషేధం విధించాలన్న ట్రంప్ నిర్ణయంతో తాను ఏకీభవించలేదని న్యూజిలాండ్ ప్రధాని బిల్ ఇంగ్లీష్ చెబుతున్నారు. ఇరువురు దేశాధినేతల మధ్య పలు అంశాలపై మాట్లాడుకున్నారని.. చైనా.. ఉత్తర కొరియా దేశాల విషయంపైనా ఇరువురు మాట్లాడుకున్నట్లుగా చెబుతున్నారు. మొత్తానికి ట్రంప్ మర్యాదగా మాట్లాడటం కూడా ఒక విశేషంగా మారిపోవటం గమనార్హం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News