ట్రంప్ మాటల్లో.. హిల్లరీ భయాలు

Update: 2016-09-17 08:12 GMT
అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఎంత పోటాపోటీగా సాగుతున్నాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్య కాలంలో జరిగిన ఎన్నికల్లో ఎప్పుడూ లేని విధంగా రిపబ్లికన్ల అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ దుడుకు వైఖరి.. ఆయన కంపు మాటలు తరచూ వివాదాస్పదం కావటం తెలిసిందే. తన ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్ అంటే అంతెత్తు ఎగిరిపడే ట్రంప్ తాజాగా మరోసారి ఆమెపై ఫైర్ అయ్యారు.

హిల్లరీకి చాలా భయమని.. ఆమె అంగరక్షకులు లేకుండా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని విమర్శించారు. ఆమె చుట్టూ ఉండే అంగరక్షకులు ఒక్కసారి ఆయుధాలు పక్కన పెట్టించి చూస్తే.. ఏం జరుగుతుందో అర్థమవుతుందని వ్యాఖ్యానించారు. హిల్లరీ ఎక్కడికి వెళ్లినా అధునాతన ఆయుధాలు ఉన్న సెక్యూరిటీని కుప్పలు తెప్పలుగా వినియోగిస్తారని విమర్శించారు.

హిల్లరీ చుట్టూ నిత్యం పెద్ద ఎత్తున అత్యాధునికి ఆయుధాలు ఉన్న సెక్యూరిటీ ఉంటాని.. వీరితో పాటు సీక్రెట్ సర్వీసు ఏజెంట్లు.. యూనిఫాం లేని అంగరక్షకులు.. అండర్ కవర్లో ఉండే వారంతా ఆమె చుట్టూ ఉంటారని.. ఇదంతా చూస్తేనే ఆమె ఎలాంటి పరిస్థితుల్లో తిరుగుతున్నారో ఇట్టే అర్థమవుతుందని  చెప్పారు. ఆమె పరిస్థితి ఏమిటో ప్రతిఒక్కరూ అర్థం చేసుకోవచ్చని.. ఆమెకు దమ్ముంటే తనకు రక్షణ కల్పించే సెక్యూరిటీని ఆయుధాలు ఒక్కసారి పక్కన పడేయాలని కోరాలని.. అప్పుడేం జరుగుతుందో తెలుస్తుందన్నారు. దమ్ముంటే ఆమె ఆయుధాలు లేకుండా స్వేచ్ఛగా తిరగగలరా? అంటూ సవాల్ విసిరారు. ఒక్క హిల్లరీనే కాదు.. మరే కీలక నేత సైతం ప్రస్తుతం ఉన్న రోజుల్లో స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితి. ఆ విషయాన్ని ట్రంప్ మరిచిపోయి ఇలా నోరుపారేసుకోవటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Tags:    

Similar News