సెటిల్మెంట్లు చేస్తానంటున్న ట్రంప్

Update: 2016-12-29 22:30 GMT
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్‌ ట్రంప్ తనదైన శైలిలో అంతర్జాతీయ వివాదాల్లో జోక్యం చేసుకుంటున్నారు. ఈ దఫా ఏకంగా ఆయన ఐక్యరాజ్యసమితినే టార్గెట్ చేశారు. పాలస్తీనా భూ భాగంపై సెటిల్మెంట్ల నిర్మాణాన్ని తక్షణమే ఆపాలంటూ ఐరాస భద్రతా మండలి ఇజ్రాయిల్‌ ను కోరుతూ ఏకగ్రీవంగా తీర్మానం చేసిన నాలుగు రోజులకే  బాహాటంగా ఇజ్రాయిల్ దేశానికి ట్రంప్ మద్దతు పలికారు. మండలి తీర్మానంపై అధైర్యపడొద్దని, తాను వచ్చే నెలలో పదవి చేపట్టగానే మధ్య ప్రాచ్యంలో ఇజ్రాయిల్‌ ఆధిపత్యానికి ఎలాంటి ఢోకా లేకుండా చూస్తానని ట్రంప్‌ సోషల్‌ మీడియాలో ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్ తన స్టైల్ ఎలా ఉంటుందో చెప్పకనే చెప్పారు.

ట్రంప్ తన తాజా ట్వీట్ లో తాను జనవరి 20న కొత్త అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశాక ఇజ్రాయిల్‌ కు పూర్తి అండగా అమెరికా ఉంటుందని భ‌రోసా ఇచ్చారు. అంతవరకు నిబ్బరంగా ఉండాలని, ఇతరుల కన్నా తామే అధికుల మన్న భావన చెదరకుండా చూసుకోవాలని ఆయన ఇజ్రాయిల్‌ ప్రధాని నెతన్యాహును కోరారు. గత శుక్రవారం ఇజ్రాయిల్‌ దురాక్రమణను ఖండిస్తూ భద్రతా మండలి 14-0 ఓట్ల తేడాతో ఏకగ్రీవంగా తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. ఈ తీర్మానాన్ని ఒబామా ప్రభుత్వం వీటో చేయడానికి నిరాకరించడం, ఓటింగ్‌ కు అమెరికా గైర్హాజరు కావడాన్ని ట్రంప్‌ ఇంతకుముందే విమర్శించారు. తాను అధికారం చేపట్టాక ఐక్యరాజ్యసమితి ఇలా వుండదని ట్వీట్‌ చేశారు. ఇప్పుడు మరింత దూకుడుగా ఈ వ్యాఖ్యలు చేశారు.అంతర్జాతీయ వ్యవహరాలపై ట్రంప్‌ ఇష్టానుసారంగా ప్రకటనలు చేయడం మానుకోవాలని విమర్శకులు వ్యాఖ్యానించారు.

ఇదిలాఉండ‌గా... ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు లంచాల బాగోతానికి సంబంధించి రహస్యంగా జరిపిన దర్యాప్తులో ఇజ్రాయిల్‌ పోలీసులు కొన్ని కీలక పత్రాలు సంపాదించారని స్థానిక మీడియా తన వార్తా కథనాలలో వెల్లడించింది. ఈ పత్రాలలోని సమాచారం ఆధారంగా పూర్తి స్థాయి క్రిమినల్‌ దర్యాప్తునకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నట్లు ఈ పత్రిక తెలిపింది. ఈ మేరకు అటార్నీ జనరల్‌ అవి చారు మెండెల్‌ బ్లిట్‌ కు వారు విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల్లోనే అధికారులు దర్యాప్తు ప్రారంభించనున్నారని ప్రభుత్వ వర్గాలను ఉటం కిస్తూ టైమ్స్‌ ఆఫ్‌ ఇజ్రాయిల్‌ పత్రిక వెల్లడిం చింది. ప్రధానిపై వెలుగు చూసిన అవినీతి ఆరోపణలపై స్పెషల్‌ పోలీస్‌ యూనిట్‌ లహావ్‌ 433 గత జూన్‌ లో ప్రారంభించిన రహస్య దర్యాప్తులో ఈ పత్రాలు బయటపడ్డాయని ఈ పత్రిక వివరించింది. ఈ దర్యాప్తునకు ఇజ్రాయిల్‌ పోలీస్‌ చీఫ్‌ రోణి అల్సీచ్‌ అనుమతినిచ్చారని, అయితే దర్యాప్తు వివరాలు మీడియాకు లీక్‌ కాకుండా జాగ్రత్తపడాలని హెచ్చరించినట్లు తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News