టాప్ త్రీకి చేరుకున్న మోడీ

Update: 2017-10-05 09:55 GMT
ప్ర‌పంచం ఇప్పుడు మారిపోయింది.  ఆమ‌ధ్య వ‌ర‌కూ మీడియా ప్రాధాన్య‌త ఎంతో ఎక్కువ‌గా ఉండేది. ఇప్పుడు అది కాస్తా మారిపోయింది. సోష‌ల్ మీడియా ఎంట్రీతో లెక్క‌ల‌న్నీ మారిపోయాయి. వార్త‌ల విధాన‌మే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఫేమ‌స్ అయ్యే విష‌యంలోనూ మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. ట్విట్ట‌ర్‌.. ఫేస్ బుక్ ప్ర‌పంచాన్ని ప్ర‌భావితం చేసే ప‌రిస్థితికి చేరుకున్నాయి.

మొన‌గాడు లాంటి మీడియా సంస్థ‌లు సైతం వాట్స‌ప్‌.. ఫేస్ బుక్‌.. ట్విట్ట‌ర్ ముందు త‌ల వంచుకోవ‌టం మిన‌హా మ‌రో మార్గం లేని ప‌రిస్థితి నెల‌కొంది. ఇదిలా ఉంటే.. ప్ర‌పంచాన్ని ప్ర‌భావితం చేసే సోష‌ల్ మీడియాలో కీల‌క‌మైన ట్విట్ట‌ర్  విష‌యానికి వ‌స్తే.. ఆ సంస్థ టాప్ టెన్ ప్ర‌జాద‌ర‌ణ ఉన్న ఖాతాల వివ‌రాల్ని వెల్ల‌డించింది.

ఇందులో ప్ర‌పంచానికి పెద్ద‌న్న.. అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్య‌ధిక ఫాలోయ‌ర్లు ఉన్న నేత‌గా ఆవిర్భ‌వించారు. ఆయ‌న‌కు 3.97 కోట్ల మంది ఫాలోయ‌ర్లు ఉండ‌గా.. త‌ర్వాతి స్థానంలో రాజ‌కీయాల‌తో ఏమాత్రం సంబంధం లేని పోప్ ఫ్రాన్సిస్ నిలిచారు. ట్రంప్‌కు.. పోప్‌కు మ‌ధ్య ఫాలోయ‌ర్ల వ్య‌త్యాసం కేవ‌లం రెండు ల‌క్ష‌ల మంది కావ‌టం విశేషం.

ఇదిలా ఉంటే.. ట్వి్ట్ట‌ర్లో అత్య‌ధిక ప్ర‌జాద‌ర‌ణ క‌లిగి.. ఫాలోయ‌ర్లు ఉన్న టాప్ త్రీ ప్లేస్ లో భార‌త ప్ర‌ధాని మోడీ నిలిచారు. ఆయ‌న‌కు 3.48 కోట్ల మంది ఫాలోయ‌ర్లు ఉన్నారు. ఇదిలా ఉండ‌గా.. ట్విట్ట‌ర్‌లో అత్య‌ధిక జ‌నాద‌ర‌ణ ఉన్న మ‌హిళా రాజ‌కీయ నాయ‌కుల్లో సుష్మా స్వరాజ్‌కు ద‌క్క‌టం విశేషం. ప్ర‌పంచంలో సుష్మ మిన‌హా మ‌రే మ‌హిళా నేత సైతం ట్విట్ట‌ర్ టాప్ టెన్ లో లేక‌పోవ‌టం గ‌మ‌నార్హం. తాజాగా ట్విట్ట‌ర్ టాప్ టెన్ జాబితాను విడుద‌ల చేసింది. మ‌రో ఆస‌క్తిక‌ర‌మై  విష‌యం ఏమిటంటే.. పీఎంవో ఇండియా ట్విట్ట‌ర్ ఖాతా కంటే ప్రెసిడెంట్ ట్రంప్‌.. వైట్ హౌస్ ఖాతాలు వెనుక‌బ‌డి ఉండ‌టం గ‌మ‌నార్హం. టాప్ టెన్  జాబితాలో ట్రంప్‌.. పోప్ మిన‌హాయిస్తే.. మిగిలిన వారంతా ఆసియా దేశాల‌కు చెందిన వారే కావ‌టం మ‌రో విశేషంగా చెప్పాలి.
Tags:    

Similar News