హైదరాబాద్ డబుల్ డెక్కర్ వైజాగ్ కి వెళ్లిపోతోంది?

Update: 2016-06-07 06:48 GMT
రైల్వే అధికారుల ప్రణాళిక లోపం హైదరాబాదీయులకు శాపంగా మారనుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక కొత్త రైలు రావటం కష్టమే. గడిచిన రెండు రైల్వే బడ్జెట్లను చూస్తే గతంలో మాదిరి కొత్త రైళ్లు ప్రకటించని పరిస్థితి. ఈ నేపథ్యంలో కొత్త రైళ్లు రాకపోవటం తర్వాత సంగతి.. ఉన్న రైళ్లు చేజారితే జరిగే నష్టమే ఎక్కువ. తాజాగా హైదరాబాదీయులకు ఇలాంటి నష్టమే వాటిల్లనుంది. కాచిగూడ.. తిరుపతి మధ్య వారానికి రెండు రోజులు నడిచే డబుల్ డెక్కర్ ట్రైన్.. మరో రెండు రోజులు కాచిగూడ నుంచి గుంటూరు మధ్య నడుస్తోంది.

ఈ డబుల్ డెక్కర్ ట్రైన్ కోసం వివిధ రాష్ట్రాలు లాబీయింగ్ చేసినా.. వారికి దక్కకుండా హైదరాబాద్ కు చేజిక్కించుకోవటానికి చాలానే కష్టపడాల్సి వచ్చింది. అలాంటి ఈ ట్రైన్ ఇప్పుడు శాశ్వితంగా వైజాగ్ కు తరలివెళ్లిపోనుంది. ఎందుకిలా? అంటే.. రైల్వే అధికారుల నిర్లక్ష్యంగా చెప్పాలి. ఇటీవల పెరిగిన రద్దీ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి విజయవాడ.. విశాఖపట్నం రూట్లలో నడిచే రైళ్లు మొత్తం కిక్కిరిపోతున్నాయి. వెయిటింగ్ లిస్ట్ నెల ముందు నుంచే భారీగా ఉంటున్న పరిస్థితి.

ఇదిలా ఉంటే.. బిజీగా ఉన్న రూట్లను వదిలేసి.. కాచిగూడ నుంచి తిరుపతి మధ్యన.. కాచిగూడ నుంచి గుంటూరు మధ్యన డబుల్ డెక్కర్ ట్రైన్ ను నడపటంతో అక్యూపెన్సీ ఏమాత్రం ఉండటం లేదు. దీంతో.. ఏ మాత్రం రద్దీ లేని ఈ ట్రైన్ ను ఈ రూట్ల నుంచి తప్పించి వైజాగ్ కు తరలించాలని అధికారులు నిర్ణయించారు. వైజాగ్.. విజయవాడ.. తిరుపతి మధ్యన ఈ డబుల్ డెక్కర్ ట్రైన్ ను నడపాలన్న ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చారు. అయితే..ఈ విషయం బయటకు వస్తే ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో ఈ నెల 12 నుంచి 30 వరకు తాత్కాలికంగా సర్వీసుల్ని రద్దు చేసినట్లుగా దక్షిణ మధ్య రైల్వే ప్రకటించినట్లు తెలుస్తోంది.

అన్నింటికి రక్షగా నిలిచే సాంకేతిక కారణాల బూచిని చూపించి.. ఈ రైలును వైజాగ్ తరలించాలన్నది అధికారుల భావనగా చెబుతున్నారు. అక్కడ ట్రయల్ రన్ నిర్వహించిన తర్వాత.. పర్మినెంట్ గా ఈ ట్రైన్ ను షిఫ్ట్ చేయాలన్నది రైల్వే అధికారుల ఆలోచనగా తెలుస్తోంది. అదే జరిగితే ఒక ట్రైన్ హైదరాబాదీయులకు మిస్ అయినట్లే.
Tags:    

Similar News