అమ్మ మృతిపై మ‌రింత అనుమానం పెరిగేలా..!

Update: 2018-07-07 04:46 GMT
త‌మిళ‌నాడు అమ్మ‌.. దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత మృతిపై వెల్లువెత్తుతున్న అనుమానాలు మ‌రింత బ‌ల‌ప‌డేలా తాజా ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. రోజుకో మ‌లుపు తిరుగుతున్న జ‌య అనారోగ్యం.. మృతికి సంబందించిన విచార‌ణ‌లో కీల‌క సాక్షి అయిన ఈసీజీ ఆప‌రేటర్ ఆర్ముగ‌స్వామి సాక్ష్యం ఇప్పుడు కొత్త అనుమానాల‌కు తావిచ్చేలా మారింది.

కొద్ది రోజుల క్రితం అమ్మ డ్రైవ‌ర్ చెప్పిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి. అమ్మ‌ను అప‌స్మార‌క స్థితిలోనే ఇంటి నుంచి అపోలోకు త‌ర‌లించిన‌ట్లుగా చెప్పారు. ఇదిలా ఉంటే.. అపోలోకు చెందిన ఈసీజీ ఆప‌రేట‌ర్ మాట‌లు.. రికార్డుల‌కు స‌రిపోవ‌టం లేదు.

అమ్మ మృతికి సంబంధించిన నోట్ చేసిన ఫైల్ ప్ర‌కారం అమ్మ 2016 డిసెంబ‌రు 4న సాయంత్రం 4 గంట‌ల ప్రాంతంలో గుండెపోటు వ‌చ్చిన‌ట్లుగా పేర్కొన్నారు. అమ్మ‌కు గుండెపోటు వ‌చ్చిన‌ట్లు డిసెంబ‌రు 4 సాయంత్రం నాలుగు గంట‌లకు త‌న‌కు ఫోన్ కాల్ వ‌చ్చింద‌ని.. అప్పుడే ఆమె ప‌రిస్థితి విష‌మించింద‌ని డ‌యాబెటాల‌జిస్ట్ జ‌య‌శ్రీ‌గోపాల్ పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే.. ఈసీజీ టెక్నిషియ‌న్ అర్ముగ స్వామి చెప్పిన దాని ప్ర‌కారం అమ్మ‌కు డిసెంబ‌రు 4 తేదీన సాయంత్రం3.50 గంట‌ల స‌మ‌యంలో తాను ఈసీజీ చెక్ చేసిన‌ట్లు చెప్పారు. ఈసీజీ చేసిన ప‌దినిమిషాల‌కే గుండెపోటు వ‌చ్చిన‌ట్లుగా న‌మోదు కావ‌టంపై అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. తాను ఈసీజీ ప‌రీక్ష‌లు చేసినట్లుగా టెక్నిషియ‌న్ చెప్పిన ప‌ది నిమిషాల వ్య‌వ‌ధిలోనే గుండెపోటు వ‌చ్చిన‌ట్లుగా రికార్డులు ఉన్నాయి. ఆ త‌ర్వాత రోజే అమ్మ మ‌ర‌ణించిన‌ట్లుగా ప్ర‌క‌టించ‌టం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News