అమ‌రావ‌తితో అష్ట‌క‌ష్టాలు త‌ప్పవంటున్నారు

Update: 2017-07-04 06:16 GMT
న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణం కోసం స్థ‌లం ఎంపిక చేసిన తీరుపై మ‌రోమారు వివాదం మైద‌లైంది. ప్రఖ్యాత రామన్ మెగెసెసే అవార్డు గ్రహీత - వాటర్‌ మెన్ ఆఫ్ ఇండియా అవార్డు స్వీకర్త రాజేంద్రసింగ్ తాజాగా చేసిన వ్యాఖ్య‌లు ఇందుకు నిద‌ర్శ‌నం. సామాజిక ఉద్యమవేత్త బొలిశెట్టి సత్యనారాయణ - రాజధాని ప్రాంత రైతు హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక కన్వీనర్ అనుమోలు గాంధీ - హైకోర్టు న్యాయవాది సిరిపురపు ఫ్రాన్సిస్‌ లతో కలిసి ఆయన సోమవారం నదీతీరాన వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించి రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. రాజధాని నిర్మాణానికి తామెవరం వ్యితిరేకం కాదని, అయితే నదీ తీరాన భారీ కట్టడాల నిర్మాణాల వల్ల భవిష్యత్తులో తమ తమ ప్రాంతాలు ముంపుకు గురికావచ్చనే భయాందోళనను ఈ సందర్భంగా రైతులు వ్యక్తం చేశారు.

రైతుల‌తో ముఖాముఖి అనంతరం రాజేంద్రసింగ్ మాట్లాడుతూ రాజధాని నిర్మాణానికి తాము కూడా వ్యతిరేకం కాదన్నారు. కృష్ణానదీ తీరాన రాజధాని నిర్మాణం ఏ మాత్రం తగదని అన్నారు.  అయితే రెండు కిమీ వెనక్కి లేదా పక్కకి జరుపుకుంటే అన్ని విధాలుగా శ్రేయస్కరమన్నారు. 217 చ.కి.మీ మేర నదీ తీరాన విలువైన భూములను - పంటలను ధ్వంసం చేస్తూ భారీ కట్టడాలు నిర్మించడం భావితరాలకు - వాతావరణ సమతుల్యతకు - ముఖ్యంగా నదీ పరిరక్షణకు ఏ మాత్రం మంచిది కాదన్నారు. రాజధాని నిర్మాణాలలో పాటించాల్సిన విధివిధానాలను పాటించడంలేదని స్పష్టమ వుతోందని తెలిపారు. కృష్ణానది పరిరక్షణకు ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదని చెప్పారు. నదికి దూరంగా నిర్మాణాలు జరగాల్సి ఉండగా ప్రభుత్వం ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని అన్నారు. పూడిక తీస్తున్నామంటూ నదిని నాశనం చేస్తున్నారని, ఇది ఎంతమాత్రం మంచిది కాదన్నారు. ఇసుకను ఇష్టారాజ్యంగా తోడేస్తూ పర్యావరణానికి ముప్పు కలిగిస్తున్నా ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తుండడం దారుణమన్నారు. మూడు పంటలు పండే భూములను రాజధాని నిర్మాణానికి వినియోగించడం సరైంది కాదన్నారు. డబ్బుకు ఇచ్చే విలువ అన్నం పెట్టే భూములు - నదులకు లేదా? అని ప్రశ్నించారు.

కేంద్ర ప్రభుత్వానికి అంతా తెలుసని, అయినా ప్రధాని మోడీ,  మంత్రి వెంకయ్యనాయుడు రాజధానిలో శంకుస్థాపన శిలాఫలకాలు వేసుకుంటూ పోతున్నారని రాజేంద్ర సింగ్‌ విమర్శించారు. నిబంధనలు పాటించకుండా అమరావతి రాజధాని నిర్మాణం జరిపితే ఒక్క గుంటూరు జిల్లాయే కాకుండా యావద్దేశానికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. స్థానికులైన బొలిశెట్టి సత్యనారాయణ జాతీయ హరిత ట్రిబ్యునల్‌ లో రెండేళ్లుగా న్యాయ పోరాటం చేస్తున్నారని, అయితే ప్రభుత్వం ఎప్పటికప్పుడు తప్పుడు నివేదికలతో న్యాయస్థానాలనే తప్పుదోవ పట్టిస్తూ వస్తున్నదన్నారు. ఇందుకోసం ఫోర్జరీ డాక్యుమెంట్లను కూడా సృష్టిస్తున్నారని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. నదీతీర పరిరక్షణ కోసం ఆగస్టు 1వ తేదీ నుంచి 15 తేదీ వరకు నది రక్షణ యాత్రను నిర్వహిస్తున్నామని ఈ యాత్రకు తాను నాయకత్వం వహిస్తున్నట్లు చెప్పారు. ఈ యాత్ర ఒకటో తేదీ విజయవాడలో ప్రారంభమై 15 తేదీ కర్నాటక, బీజాపూర్‌లో ముగుస్తుందన్నారు. అదే ప్రదేశంలో 16 - 17 - 18 తేదీల్లో ‘నదుల రక్షణ-నదులపై జరుగుతున్న అక్రమ కట్టడాలు’ అంశంపై సెమినార్ జరుగుతుందన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News