డ్రైవర్ బాబు అంత్యక్రియలకు ఇంత ఆగమాగం ఏంది సారూ?

Update: 2019-11-02 11:40 GMT
పోరాడి సాధించుకున్న తెలంగాణలో తమ భవిష్యత్తుకు తిరుగులేదన్న భావన తెలంగాణవాదుల్లో ఉండేది. అందుకు భిన్నంగా ఇటీవల పరిణామాలు చోటు చేసుకుంటున్నాయన్న ఆవేదనను వ్యక్తమవుతోంది. హైదరాబాద్ లోని సరూర్ నగర్ స్టేడియంలో సకలజనుల సమరభేరి సభకు హాజరైన కరీంనగర్ డిపో డ్రైవర్ బాబు గుండెపోటుతో మరణించటం తెలిసిందే. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆర్టీసీ జేఏసీ నేతలు.. విపక్షాలు.. సమ్మెపై ప్రభుత్వం స్పందించేంతవరకూ అంత్యక్రియలు నిర్వహించమని తేల్చి చెప్పటం తెలిసిందే.

కోదండరాం.. తమ్మినేని వీరభద్రం.. చాడ వెంకటరెడ్డి.. మంద కృష్ణ మాదిగ.. జీవన్ రెడ్డి.. పొన్నం ప్రభాకర్.. శ్రీధర్ బాబు తదితరులు డ్రైవర్ బాబు ఇంటికి చేరుకున్నారు. అఖిలపక్ష నేతలు ఇంతమంది వచ్చినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వ్యక్తం కాకపోవటంపై విస్మయం వ్యక్తమవుతోంది.

అనుకోని రీతిలో ఒకరు మరణించి.. అంత్యక్రియలు జరగకుండా ఆపితే.. చిన్నపాటి ప్రయత్నం కూడా ప్రభుత్వం నుంచి లేకపోవటం ఏమిటన్న ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. మధ్యాహ్న సమయానికి డ్రైవర్ బాబు భౌతికకాయం నుంచి దుర్వాసన రావటంతో ఎంపీ బండి సంజయ్ తదితరులు కుటుంబ సభ్యులతో మాట్లాడి అంత్యక్రియలకు సిద్ధమయ్యారు. అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు మినహా మిగిలిన వారిని అనుమతించమంటూ పెద్ద ఎత్తున పోలీసు బలగాలు చేరుకున్నాయి.

అంత్యక్రియలను శాంతియుతంగా నిర్వహిస్తామని జేఏసీ నేతలు.. ఎంపీ బండిసంజయ్ పోలీసులకు చెప్పారు. అంతిమయాత్రకు వారంతా ముందుండి నడిపించారు. యాత్రలో దాదాపు మూడు వేలకు పైనే జనసమూహం రావటంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరును నిరసన వ్యక్తమైంది. దీంతో వారిని అదుపు చేసేందుకు పోలీసులు విపరీతంగా ప్రయాస పడాల్సి వచ్చింది.

ఈ సందర్భంగా తోపులాట.. ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. మధ్యాహ్నం వేళలో మొదలైన అంతిమయాత్రను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. మరో మార్గం నుంచి అంతిమయాత్రను జరిపే ప్రయత్నం చేయగా.. పోలీసులు అందుకు ఒప్పుకోలేదు. చివరకు అంత్యక్రియలకు బాబు కుటుంబ సభ్యులను మాత్రమే అనుమతించారు. విషాదకర రీతిలో మరణించిన వేళలో.. శాంతియుతంగా అంత్యక్రియలకు సైతం అనుమతి ఇవ్వని పోలీసుల తీరును నేతలు.. ఆర్టీసీ జేఏసీ నేతలు తప్పు పడుతున్నారు. అంతిమయాత్రను సైతం ఇంత ఆగం చేయాల్సిన అవసరం ఉందా? అని ప్రశ్నిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంత నిర్బందాన్ని తాము చూడలేదంటూ పలువురు వ్యాఖ్యానించటం గమనార్హం. మరీ.. మాటలన్ని సీఎం కేసీఆర్ వరకూ వెళుతున్నాయా?
Tags:    

Similar News