ఉప ఎన్నిక‌ల వేళ బాబుకు ఈసీ షాక్‌

Update: 2017-07-28 09:22 GMT
కొన్ని విష‌యాల్లో అన‌వ‌స‌ర జోక్యం.. మోతాదుకు మించిన అత్యుత్సాహం దెబ్బ తీస్తుంది. ఏ విష‌యానికి ఎంత ప్రాధాన్య‌త ఇవ్వాలో అంతే ఇవ్వాలే త‌ప్పించి.. అంత‌కు మించి ఇస్తే లేనిపోని త‌ల‌నొప్పులు గ్యారెంటీ. అత్యున్న‌త స్థానాల్లో ఉన్న వారు వ్య‌క్తిగ‌త ప్ర‌తిష్ఠ‌ల‌కు పోకుండా ఉండ‌టం మంచిది. అందులోకి ఉప ఎన్నిక‌ల్లాంటి వాటి విష‌యంలో గుంభ‌నంగా వ్య‌వ‌హ‌రిస్తూ చేయాల్సింది చేయాలే త‌ప్పించి బ‌జారున ప‌డిన‌ట్లుగా బ‌య‌ట‌ప‌డితే మొద‌టికే మోసం వ‌చ్చే అవ‌కాశం ఉంది.

బీహార్ పీఠాన్ని ఎలా అయినా సొంతం చేసుకోవాల‌నుకున్న మోడీ.. అమిత్ షా ద్వ‌యం ఎంత జాగ్ర‌త్త‌గా పావులు క‌దిపారో చూస్తే ఇట్టే తెలుస్తోంది. బీహార్ ఎపిసోడ్ మేధావులు.. ప్ర‌జాస్వామ్య‌వాదులు.. సీనియ‌ర్ రాజ‌కీయ విశ్లేష‌కులు తీవ్ర‌స్థాయిలో త‌ప్పు ప‌ట్టినా.. సాధార‌ణ ప్ర‌జానీకం నుంచి మాత్రం అంత‌గా వ్య‌తిరేక‌త రాలేదు. ఇదే మోడీ త‌ర‌హా రాజ‌కీయంగా చెప్పాలి.

తాను అనుకున్న‌ది అనుకున్న‌ట్లుగా చేయ‌టానికి ఏం చేయాలో అది చేసే మోడీ.. కొన్నిసార్లు అడ్డ‌గోలుగా నిర్ణ‌యాలు తీసుకోవ‌టానికైనా వెనుకాడ‌రు. అదే స‌మ‌యంలో త‌న చేతికి మ‌ట్టి అంట‌కుండా జాగ్ర‌త్త ప‌డ‌తారు. అలాంటి తెలివితేట‌లు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ద‌గ్గ‌ర ఉన్న‌ట్లుగా అస్స‌లు క‌నిపించ‌వు.

తానంత సీనియ‌ర్ రాజ‌కీయ అధినేత ఎవ‌రూ ఉండరంటూ త‌ర‌చూ కోత‌లు కోసే చంద్ర‌బాబు.. నంద్యాల ఉప ఎన్నిక సంద‌ర్భంగా ఎంత‌లా దిగ‌జారిపోతున్నారో ఇటీవ‌ల వ‌స్తున్న‌ క‌థ‌నాలు చెప్పేస్తున్నాయి. ఏం చేసి అయినా నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించాల‌న్న‌ట్లుగా ఆయ‌న వ్య‌వ‌హ‌రిస్తున్నారు. మైనార్టీ నేత‌ల‌కైతే టార్గెట్ విధిస్తున్న‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి.

ఇదిలా ఉంటే.. తాజాగా కేంద్ర ఎన్నిక‌ల సంఘం బాబుకు ఊహించ‌ని షాక్ ఇచ్చింది. నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో ఓట‌ర్ల‌ను జ‌న‌వ‌రి 1 - 2017 వ‌ర‌కు ఎవ‌రైతే ఉన్నారో వారికి మాత్ర‌మే ఓటుహ‌క్కు క‌ల్పిస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. జ‌న‌వ‌రి 1 - 2017 త‌ర్వాత ఓట‌ర్ల జాబితాలోకి త‌మ పేర్లు న‌మోదు చేసుకున్న వారికి ఉప ఎన్నిక‌ల్లో ఓటుహ‌క్కు క‌ల్పించ‌లేమ‌ని తేల్చి చెప్పింది.

కేంద్ర ఎన్నిక‌ల సంఘం తీసుకున్న ఈ నిర్ణ‌యం బాబుకు షాక్ ఎందుకంటే.. ఇటీవ‌ల కాలంలో దాదాపు 15వేల‌కు పైగా ఓట‌ర్ల‌ను ఓట‌ర్ల జాబితాలో చేర్పించిన‌ట్లుగా ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో కేంద్ర ఎన్నిక‌ల సంఘం తీసుకున్న నిర్ణ‌యం బాబుకు క‌రెంటు షాక్ మాదిరి మారుతుంద‌న్న వాద‌న‌ను రాజ‌కీయ వ‌ర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. భూమా నాగిరెడ్డి అకాల మ‌ర‌ణంతో జ‌రుగుతున్న ఈ ఉప ఎన్నిక వ‌చ్చే నెల 23న జ‌ర‌గ‌నుంది. పోలింగ్ జ‌రిగిన ఐదు రోజుల అనంత‌రం.. అంటే ఆగ‌స్టు 28న ఫ‌లితాలు వెల్ల‌డి కానున్నాయి.
Tags:    

Similar News