వైఎస్సార్సీపీ ఎంపీ ఇంట్లో ఈడీ సోదాలు.. కేసీఆర్ కూతురికి నోటీసులు!

Update: 2022-09-16 09:47 GMT
ఢిల్లీ మ‌ద్యం పాల‌సీలో జ‌రిగిన కుంభ‌కోణానికి సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) దూకుడు పెంచింది. ఇటీవ‌ల దేశ‌వ్యాప్తంగా ప‌లు ప్రాంతాల్లో సోదాలు నిర్వ‌హించ‌గా ఇప్పుడు మ‌రోసారి దేశ‌వ్యాప్తంగా 40 చోట్ల సాదాలు నిర్వ‌హిస్తోంది.

వైఎస్సార్సీపీ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల‌రెడ్డికి చెందిన ఢిల్లీ నివాసంలో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఢిల్లీలోని లోథీ రోడ్డులో 95వ నంబ‌ర్ నివాసంలో ఉంటున్న మాగుంట ఇంట్లో సోదాలు నిర్వ‌హించారు. దీంతోపాటు నెల్లూరు న‌గ‌రంలో రాయాజీ వీధిలో ఉన్న ఆయ‌న నివాసంలోనూ సోదాలు జ‌రుగుతున్నాయి. ఈ సంద‌ర్భంగా మాగుంట ఇంట్లోకి ఎవ‌రినీ రానీయ‌కుండా పోలీసులు భారీ భ‌ద్ర‌త చేప‌ట్టారు.

ఢిల్లీ, నెల్లూరుల్లోనే కాకుండా హైద‌రాబాద్‌, బెంగ‌ళూరు, చెన్నైలోని ప‌లు ప్రాంతాల్లోనూ ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్‌లో 25 బృందాలతో ఈడీ తనిఖీలు చేపట్టింది. అభినవ్‌రెడ్డి, అభిషేక్‌, ప్రేమ్‌సాగర్‌రావు, అరుణ్ పిళ్ళై ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. హైద‌రాబాద్ న‌గ‌రంలోని రాయ‌దుర్గం, దోమ‌ల‌గూడ స‌హా ప‌లు ప్రాంతాల్లో ఈడీ అధికారుల సోదాలు కొన‌సాగుతున్నాయి. దోమలగూడ శ్రీసాయికృష్ణా రెసిడెన్సీలో ఉన్న గోరంట్ల అసోసియేట్స్‌ కార్యాలయంలో ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.

ఢిల్లీ మ‌ద్యం స్కామ్‌కు సంబంధించి ఈడీ అధికారులు ఇప్పటికే హైదరాబాద్‌లో రెండుసార్లు తనిఖీలు నిర్వహించిన సంగ‌తి తెలిసిందే. గతంలో కోకాపేట్‌లోని రామచంద్ర పిళ్లై నివాసం, నానక్‌రామ్‌గూడలోని రామ‌చంద్ర పిళ్లైకు చెందిన‌ రాబిన్‌ డిస్టలరీస్‌ కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. రాబిన్‌ డిస్టలరీస్‌, రాబిన్‌ డిస్ట్రిబ్యూషన్స్‌ ఎల్‌.ఎల్‌.పి. పేరుతో రామచంద్ర పిళ్ల్లై కంపెనీలు నిర్వహిస్తున్న సంగ‌తి విదిత‌మే. తన సంస్థలో అభిషేక్‌ బోయిన్‌పల్లి, గండ్ర ప్రేమ్‌సాగర్‌రావును డైరెక్టర్లుగా ఆయన రామ‌చంద్ర పిళ్లై పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే మరోసారి హైదరాబాద్‌లో ఈడీ సోదాలకు శ్రీకారం చుట్టింది. కాగా.. గతంలోనూ అభిషేక్ బోయిన‌ప‌ల్లి... ఎమ్మెల్సీ క‌విత పీఏగా ప‌నిచేయ‌డం గ‌మ‌నార్హం.

కాగా తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కుమార్తె, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత ప‌ర్స‌న‌ల్ ఆడిట‌ర్ గోరంట్ల బుచ్చిబాబు ఇంట్లో ఈడీ సోదాలు నిర్వ‌హించింది. అలాగే క‌విత‌కు ఈడీ నోటీసులు జారీ చేసింద‌ని తెలుస్తోంది. గ‌తంలో క‌విత పీఏ ఇంట్లో ఈడీ సోదాలు నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. క‌విత ప‌ర్స‌న‌ల్ ఆడిట‌ర్‌.. హైదరాబాద్‌ దోమలగూడలోని అరవింద్ నగర్ శ్రీ సాయికృష్ణ రెసిడెన్సీలో నివాస‌ముంటున్నారు. నలుగురు ఈడీ అధికారుల నేతృత్వంలోని ఈడీ అధికారుల బృందం సాయి కృష్ణా రెసిడెన్సీలోని మొదటి అంతస్తులో ఉంటున్న‌ చార్టెడ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబు( నివాసంలో త‌నిఖీలు నిర్వ‌హిస్తోంది. బుచ్చిబాబు గతంలో కవితకు అకౌంటెంట్‌గా కూడా ప‌నిచేశారని చెబుతున్నారు.

అలాగే.. గచ్చిబౌలిలో అభినవ్ రెడ్డి నివాసంలో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. కాగా.. దేశవ్యాప్తంగా 40కి పైగా ప్రాంతాల్లో ఈడీ దాడులు నిర్వహిస్తోంది. ఢిల్లీ, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ప‌లు ప్రాంతాల్లో దాడులు చేప‌ట్టింది.

కాగా ఢిల్లీ మ‌ద్యం పాల‌సీలో ఎలాంటి అక్ర‌మాలు చోటు చేసుకోలేద‌ని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత‌, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చెబుతున్నారు. త‌మ‌ను ల‌క్ష్యంగా చేసుకోవ‌డానికే బీజేపీ ప్ర‌భుత్వం కేంద్ర సంస్థ‌ల‌ను దుర్వినియోగం చేస్తోంద‌ని ఆరోపించారు. త‌మ పార్టీకి ప్ర‌జ‌ల నుంచి వ‌స్తున్న మ‌ద్ద‌తును చూసి ఓర్వలేక ఇలాంటి ప‌నుల‌కు దిగుతోంద‌ని విమ‌ర్శించారు.  

కాగా ఢిల్లీ మ‌ద్యం స్కామ్ కేసులో సీబీఐ ఆగస్టు 19న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఐఏఎస్ అధికారి, ఢిల్లీ మాజీ ఎక్సైజ్ కమిషనర్ అరవ గోపీ కృష్ణ నివాసాలతో పాటు ఏడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 19 ప్రాంతాల్లో దాడులు నిర్వహించిన సంగ‌తి తెలిసిందే.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News