నందకుమార్ తో ఈడీ గేమ్.. రోహిత్ రెడ్డి ఏం చెప్పాడు?

Update: 2022-12-26 10:13 GMT
దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని ఎన్ ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో రోహిత్ రెడ్డిని ఈడీ అధికారులు విచారించటం.. తాజాగా మరోసారి విచారిస్తున్న సంగతి తెలిసిందే. విచారణను ఎదుర్కొని బయటకు వచ్చిన రోహిత్ రెడ్డి ఈడీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈడీ విచారణకు తాను పూర్తిగా సహకరించానని.. కానీ తనను ఏదోలా ఇబ్బందికి గురి చేస్తున్నారన్నారు. తనను విచారిస్తున్న అధికారులు.. ఏ కేసులో విచారిస్తున్న విషయాన్ని తెలపలేదన్నారు. తాను అడిగిన తర్వాతే చెప్పారన్నారు. బీజేపీ నేతల బండారాన్ని తాను బయటపెట్టినందుకే తనను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లుగా చెప్పిన రోహిత్ రెడ్డి సరికొత్త వాదనను వినిపించారు.

ఈ వ్యవహారంలో కీలకమైన నందకుమార్ సాయంతో తనను ఇరికించాలని అధికారులు భావిస్తున్నట్లుగా చెప్పారు. తనను లొంగదీసుకునేందుకు ఈడీ విచారణ జరిపినట్లుగా ఆరోపించిన రోహిత్ రెడ్డి.. తన తొలిరోజు విచారణ గురించి చెప్పుకొచ్చారు.

దాదాపు ఆరు గంట లపాటు తనను విచారించిన ఈడీ అధికారులు.. తనను ఏ కేసులో భాగంగా విచారణ జరుపుతున్న విషయాన్ని ఎందుకు చెప్పటం లేదు? అని ప్రశ్నించారు.

ఫిర్యాదు చేసిన తనను విచారిస్తున్న ఈడీ అధికారులు నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని ఎందుకు విచారించటం లేదు? అని ప్రశ్నించారు. నందకుమార్ తో మాస్టర్ ప్లాన్ వేస్తున్నారని.. అతనితో స్టేట్ మెంట్ తారుమారు చేయబోతున్నట్లుగా ఆరరోపించారు.

తాను ఈడీ కుట్రల్ని భగ్నం  చేస్తానని చెప్పిన రోహిత్ రెడ్డి.. ఈడీ నోటీసుల మీద తాను సోమవారం హైకోర్టులోరిట్ వేయనున్నట్లు చెప్పారు. ఈ వ్యవహారంలో బీజేపీ అగ్రనేతలను విచారణకు ఎందుకు పిలవటం లేదని.. వారెందుకు రావటం లేదని ప్రశ్నించారు. ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్ లో కీలకంగా మారిన రోహిత్ రెడ్డి నోటి నుంచి వచ్చిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News