చైనా లోన్ యాప్ లపై ఈడీ కొరడా

Update: 2022-09-18 02:30 GMT
చైనా నియంత్రిత లోన్ యాప్ లపై కేంద్రం కొరఢా ఝలిపించింది. దేశంలోని ప్రజలపై పడి దోచుకుంటూ వారి మాన ప్రాణాలు తీస్తున్న వారిపై ప్రతాపం చూపిస్తోంది. రోజురోజుకు   లోన్ యాప్ ల ఆగడాలు పెరిగిపోతున్నాయి. కొందరు చనిపోతున్నా.. బాధితుల సంఖ్య పెరిగిపోతున్నా లోన్ యాప్ ల తీరు మాత్రం మారడం లేదు. సైబరాబాద్ సైబర్ క్రైమ్ పరిధిలో వందల కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు.  వివిధ యాప్ లు, కంపెనీలు.. తమ వద్ద డబ్బులు తీసుకున్న కస్టమర్లను నానా బూతులు తిడుతూ ఫోన్ లో బెదిరిస్తున్నారని బాధితులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంట్లోని మహిళలకు ఫోన్ చేసి అసభ్య పదజాలంతో రుణాల ప్రతినిధులు మాట్లాడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫోన్ లోని కాంటాక్టులను ట్రేస్ చేసి అందరికీ మెసేజ్ లు పంపి పరువు తీస్తున్నారని ఫిర్యాదు చేశారు.

 నెల్లూరు జిల్లాలో లోన్ యాప్ ఆగడాలు శృతిమించిపోయాయి. ఏకంగా వైసీపీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డితోపాటు పలువురు వైసీపీ కీలక నేతలకు ఈ లోన్ యాప్ నిర్వాహకులు షాకిచ్చారు. తనకు ఎదురైన లోన్ యాప్ ఆగడాలపై మంత్రి కాకాణి పోలీసులకు ఫిర్యాదు చేసి పట్టించిన వైనం మరిచిపోకముందే వైసీపీకే చెందిన మాజీ మంత్రి అనిల్ కుమార్ ను సైతం  లోన్ యాప్ మాఫియా తీవ్రంగా బెదిరించడం కలకలం రేపుతోంది.  అనిల్ కు కాల్ చేసి అశోక్ అనే వ్యక్తి 8 లక్షలు రుణం తీసుకున్నాడని.. ఆయన మీ బావమరిదిగా సంతకం చేసి మీ పేరు, ఫోన్ నంబర్ ఇచ్చాడని బ్యాంకు నుంచి ఓ లేడీ ఫోన్ చేసి దబాయించింది.

ప్రజాప్రతినిధులను సైతం బెదిరించేస్థాయికి దిగిన ఈ లోన్ యాప్స్ అన్ని మెజార్టీ చైనా నియంత్రణలోనే ఉన్నాయని కేంద్రం నిగ్గు తేల్చింది. ఈ లోన్ యాప్ లపై కేంద్రం కొరఢా ఝలిపించింది. విచారణలో బాగంగా రూ.46.67 కోట్ల నిధులను స్తంభింపచేసినట్లు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం వెల్లడించింది.  ఈజ్ బజ్, రోజర్ పే, క్యాష్ ఫ్రీ, పేటీఎంల ఆన్ లైన్ పేమెంట్ గేట్ వే ఖాతాల్లో వ్యాపార సంస్థలు ఉంచిన ఈ సొమ్మును నిలిపివేసినట్లు తెలిపింది.

ఇటీవల ఈడీ అధికారులు చైనా నియంత్రిత ఇన్వెస్ట్ మెంట్ టోకెన్ యాప్ పై దాడులు నిర్వహించారు. మనీలాండరింగ్ చట్టం కింద చర్యలు తీసుకున్నారు. ఈనెల మొదట్లో బెంగళూరులోని రోజర్ పే, పేటీఎం , క్యాష్ ఫ్రీ సముదాయాల్లో సోదాలు చేశారు. ఆ తర్వాత ఈనెల 14న  యాప్ ఆధారిత టోకెన్ హెచ్.పీజెడ్, దాని అనుబంధ సంస్థల్లో మనీలాండరింగ్ కేసు విచారణలో భాగంగా ఢిల్లీ, ముంబై, ఘజియాబాద్, లక్నో, గయాలో బహుళ సముదాయాల్లో సోదాలు నిర్వహించారు.

విచారణలో భాగంగా హైదరాబాద్, బెంగళూరు,  ఢిల్లీ, గురుగ్రామ్, ముంబై, ఫుణే, చెన్నై, జైపూర్, జోధ్ పూర్ లలో బ్యాంకులు,పేమెంట్ గేట్ వేలకు చెందిన 16 చోట్ల తనిఖీలు నిర్వహించినట్టు ఈడీ ఒక ప్రకటనలో పేర్కొంది.

చైనా లోన్ యాప్ లతోపాటు పెట్టుబడులు స్వీకరించిన ఇన్వెస్ట్ మెంట్ టోకెన్ లపై ఈడీ తనిఖీలు నిర్వహించింది. గురుగ్రామ్ కు చెందిన ఎంఎస్ జిలియన్ కన్సల్టెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పెట్టుబడులు స్వీకరించడంలో కీలక పాత్ర పోషించినట్టు అధికారులు గుర్తించారు.

ఈడీ ఫ్రీజ్ చేసిన సొమ్ము తమ కంపెనీది కాదని పేటీఎం వివరణ ఇచ్చింది. నిబంధనలకు అనుగుణంగానే నగదు రహిత లావాదేవీలు జరిగినట్టు క్యాష్ ఫ్రీ తెలిపింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News