లెక్క‌లు తేల్చేందుకు 28 గంట‌లు అవ‌స‌ర‌మా?

Update: 2018-12-09 04:02 GMT
ఇవాళ‌.. రేపు టెక్నాల‌జీ ఎంత‌గా పెరిగిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. అలాంటి వేళ కూడా రోజుల త‌ర‌బ‌డి ఇష్యూల్ని సాగ‌తీయ‌టం దేనికి నిద‌ర్శ‌నం. ఎలాంటి త‌ప్పుల‌కు అవ‌కాశం ఇవ్వ‌కుండా.. విమ‌ర్శ‌ల వేళ్లు ఎత్తి చూపే ఛాన్స్ లేకుండా చేయాల్సిన తెలంగాణ ఎన్నిక‌ల సంఘం.. అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రించింద‌న్న వాద‌న పెద్ద ఎత్తున వినిపిస్తోంది. తెలంగాణ‌లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించి కీల‌క‌మైన పోలింగ్ వివ‌రాల్ని ఫైన‌ల్ చేసేందుకు పెద్ద ఎత్తున స‌మ‌యం తీసుకోవ‌టం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

119 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలో జ‌రిగిన పోలింగ్ శాతాన్ని లెక్క క‌ట్ట‌టానికి 28 గంట‌ల స‌మ‌యం ప‌డుతుందా? అన్న‌ది ప్ర‌శ్న‌గా మారింది. విచిత్ర‌మైన విష‌యం ఏమంటే.. 200 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్న రాజ‌స్థాన్ లో నిర్వ‌హించిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓట్లు వేసిన వారి లెక్క తేల్చ‌టానికి 24 గంట‌ల కంటే త‌క్కువ స‌మ‌యంలోనే పూర్తి చేస్తే.. కేవ‌లం 119 స్థానాలు ఉన్న తెలంగాణ‌లో మాత్రం 28 గంట‌ల స‌మ‌యం తీసుకోవ‌టం గ‌మ‌నార్హం.

ఇప్ప‌టికే ల‌క్ష‌లాది ఓట్ల గ‌ల్లంతు విష‌యమై ఎన్నిక‌ల సంఘం ఏర్పాట్ల‌పై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్న వేళ‌.. పోలింగ్ ఫైన‌ల్ లెక్క‌ల్ని గంట‌ల కొద్దీ సాగ‌దీసిన తీరుపై ప‌లువురు ఆశ్చ‌ర్యాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.

శుక్ర‌వారం ఉద‌యం 7 గంట‌ల నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు (ఒక‌వేళ పోలింగ్ స్టేష‌న్ల‌లో ఐదింటి వేళ‌కు ఎంత‌మంది ఓట‌ర్లు ఉంటే అంత‌మంది ఓటు వేసే వ‌ర‌కూ పోలింగ్ కేంద్రాన్ని నిర్వ‌హించారు) ఓట్లు వేసే అవ‌కాశం ఉంది. ఒక‌వేళ మ‌రో గంట అద‌నంగా పోలింగ్ జ‌రిగి.. లెక్క‌లు చూసుకోవ‌టానికి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కూ టైం ప‌ట్టింద‌నుకున్నా.. నియోజ‌క‌వ‌ర్గాల వారీగా లెక్క‌లు తేల్చ‌టానికి.. వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయ‌టానికి నాలుగైదు గంట‌ల కంటే ఎక్కువ టైం ప‌ట్ట‌దు.

ఇందుకు భిన్నంగా శుక్ర‌వారం ముగిసిన పోలింగ్ వివ‌రాల్ని శ‌నివారం రాత్రి తొమ్మిది దాటిన త‌ర్వాత విడుద‌ల చేయాల్సి రావ‌టం ఏమిట‌న్న‌ది ఇప్పుడు పెద్ద ప్ర‌శ్న‌గా మారింది. తెలంగాణ వ్యాప్తంగా జ‌రిగిన పోలింగ్ ఎంత‌?  మొత్తం ఓట్ల‌లో ఎన్ని ఓట్లు పోల్ అయ్యాయి?  ఓటుహ‌క్కును వినియోగించుకున్న పురుషులు ఎంత‌మంది?  మ‌హిళ‌లు ఎంత‌మంది?  నియోజ‌క‌వ‌ర్గాల వారీగా లెక్క‌లు.. శాతాల లెక్క తేల్చ‌టానికి గంట‌ల కొద్దీ టైం తీసుకోవ‌టంపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. సిబ్బంది ప‌నితీరు స‌రిగా లేక‌పోవ‌టం.. ఉన్న‌తాధికారుల నిర్వ‌హ‌ణ లోపాలు కూడా పోలింగ్ ఫైన‌ల్ లెక్క‌లు తేల్చ‌టానికి 28 గంట‌ల స‌మ‌యం ప‌ట్టేలా చేశాయ‌న్న మాట వినిపిస్తోంది. ఏమైనా.. ఇన్నేసి గంట‌లు పోలింగ్ లెక్క‌లు తేల్చ‌టానికి టైం తీసుకోవ‌టం ఏ మాత్రం బాగోలేద‌న్న అభిప్రాయం స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. ఏది ఏమైనా.. తెలంగాణ‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ విష‌యంలో ర‌జ‌త్ బ్యాచ్ ఫెయిల్ అయింద‌న్న అప‌ప్ర‌ద‌ను మూట‌గ‌ట్టుకున్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.


Tags:    

Similar News