ఎల‌క్ష‌న్ ఎఫెక్ట్‌: ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో సంచ‌ల‌నాలు

Update: 2022-01-16 13:30 GMT
అతి పెద్ద రాష్ట్రం యూపీలో ఎన్నిక‌లు జర‌గ‌నున్నాయి. అయితే.. ఈ ఎన్నిక‌ల ముంగిట‌.. కొన్ని పార్టీల్లో చిత్ర విచిత్రాలు జ‌రిగితే.. మ‌రికొన్ని కీల‌క పార్టీల్లో సంచ‌ల‌నాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో రాష్ట్ర రాజ‌కీయాల్లో న‌రాలు తెగేంత ఉత్కంఠ నెల‌కొంది. ఉత్తర్ప్రదేశ్లో 'బికినీ గర్ల్' వ్యవహారం రాజకీయంగా దుమారం రేపుతోంది. ప్రముఖ మోడల్, నటి అర్చనా గౌతమ్కు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడాన్ని బీజేపీ స‌హా ప‌లు పార్టీలు తప్పుబట్టాయి.  మానసికంగా దివాలా తీసిన పార్టీ గొప్ప పనులను ఆశించలేమని అఖిల భారత హిందూ మహాసభ, సంత్ మహాసభ అధ్యక్షుడు స్వామి చక్రపాణి వ్యాఖ్యానించారు.

ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ ఎంతకైనా దిగజారుతుందని మ‌రికొంద‌రు వ్యాఖ్యానించారు. అయిన‌ప్ప‌టికీ.. కాంగ్రెస్ ఎక్క‌డా వెన‌క్కి త‌గ్గేదేలే.. అనేస్తోంది. మ‌రోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లభించలేదని సమాజ్వాదీ పార్టీ నేత ఆత్మహత్యకు ప్రయత్నించారు. పార్టీ కార్యాలయం ముందు ఒంటిపై పెట్రోల్ పోసుకున్నారు. అయితే, దగ్గర్లోనే ఉన్న పోలీసులు ఆయన్ను అడ్డుకున్నారు. పార్టీ అభ్యర్థిత్వం కోసం ఐదేళ్లుగా ఎదురుచూస్తున్నానని, అప్పటి నుంచి అన్ని ఏర్పాట్లు చేసుకున్నానని ఠాకూర్ చెప్పుకొచ్చారు. ఐదేళ్లుగా ప్రజల మధ్యే ఉంటూ, సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేశానని తెలిపారు. ప్ర‌స్తుతం ఈ ఘ‌ట‌న పార్టీలో తీవ్ర సంచ‌ల‌నంగా మారింది.

ఇవ‌న్నీ ఇలా ఉంటే.. మ‌రో కీల‌క ఘ‌ట‌న‌.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం అఖిలేష్ నేతృత్వంలోని స‌మాజ్ వాదీ పార్టీని కుదిపేస్తోంది. సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ చిన్నకోడలు, అఖిలేష్ సోద‌రుడి భార్య బీజేపీలోకి చేర‌నున్నారు.  అఖిలేష్ సోద‌రుడు ప్రతీక్ యాదవ్ భార్య అప‌ర్ణా సింగ్ యాద‌వ్‌  కమలం తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ మేర‌కు అన్నీ సిద్ధ‌మ‌య్యాయి. దాదాపు ఆమె పోటీ చేసే స్థానం కూడా బీజేపీ నేత‌లు ఖ‌రారు చేశారు. ఇదే జరిగితే సమాజ్వాదీ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉందని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు. గత కొద్దిరోజులుగా కీలకమైన బీసీ నేతలు పార్టీ నుంచి బయటకు వెళ్లిన నేపథ్యంలో.. అపర్ణా యాదవ్ చేరిక.. బీజేపీకి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చే అవకాశం ఉంది. అది కూడా.. ఎస్పీకి నాయకత్వం వహిస్తున్న కుటుంబంలోని వ్యక్తి రావడం.. బీజేపీకి లాభించనుందని విశ్లేషకులు చెబుతున్నారు.

ఇక‌, మ‌రోవైపు.. ఇంకో సంచ‌ల‌నం కూడా తెర‌మీదికి వ‌చ్చింది. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీని గద్దెదించి మరోసారి అధికారంలోకి రావాలని భావిస్తున్న సమాజ్‌వాదీ పార్టీకి  రాష్ట్రీయ లోక్‌దళ్‌ కూటమికి భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేత జాతీయ అధ్యక్షుడు నరేశ్ టికాయిత్ మద్దతు ప్రకటించారు. ఉత్తర్ప్రదేశ్‌ ప్రజలు ఈ కూటమికి మద్దతు తెలుపుతారని ఆశిస్తున్నట్లు తెలిపారు. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ రాకేశ్ టికాయిత్‌ నేతృత్వంలో రైతు సంఘాలు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌ సరిహద్దుల్లో ఏడాది పాటు ఆందోళన చేశాయి. ఈ ఆందోళనల్లో యూపీ నుంచి విచ్చేసిన రైతులు కూడా భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పుడువీరంతా.. ఎస్పీకి మ‌ద్ద‌తిస్తున్నారు. దీంతో బీజేపీలో టెన్ష‌న్ నెల‌కొంది. మొత్తానికి నిన్న మొన్న‌టి వ‌ర‌కు చిత్రాలు క‌నిపిస్తే.. ఇప్పుడు యూపీ ఎన్నిక‌ల్లో సంచ‌ల‌నాలు న‌మోద‌వుతుండ‌డం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News