2 కిలోమీట‌ర్లు ఈదుకుంటూ మావ‌టిని కాపాడిన గ‌జ‌రాజు.. వీడియో వైర‌ల్!

Update: 2022-07-13 15:19 GMT
ప్ర‌స్తుతం నైరుతి రుతుప‌వ‌నాల సీజ‌న్ తో దేశ‌మంతా విస్తారంగా వ‌ర్షాలు కురుస్తున్నాయి. వాగులు, కొండ వాగులు, వంక‌లు న‌దులు పొంగుతున్నాయి. ఇక న‌దులు, ఉప నదులు అయితే వ‌ర‌ద‌ల‌తో భీభ‌త్సం సృష్టిస్తున్నాయి. ఈ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల‌తో అటు మూగ జీవులు, మ‌నుషులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ ప‌రిస్థితుల్లో మూగ జీవుల‌ను ఆదుకోవ‌డానికి మాన‌వ‌త్వం క‌లిగిన మ‌నుషులు ముందుకొస్తుంటే.. తాము సైతం త‌క్కువేమీ తిన‌లేద‌ని మూగ‌జీవులు సైతం మ‌నుషుల ప్రాణాలు కాపాడుతున్నాయి. తాజాగా ఇలాంటి ఘ‌ట‌నే బిహార్ లోని పాట్నాలో జ‌రిగింది. ఒక ఏనుగు మావ‌టిని ఉధృతంగా ప్ర‌వ‌హిస్తున్న గంగాన‌దిలో దాదాపు రెండు కిలోమీట‌ర్లు ఈది త‌న ప్రాణాల‌తో పాటు అత‌డి ప్రాణాల‌ను కాపాడింది. ఈ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

బిహార్ రాజ‌ధాని పాట్నా సమీపం లోని రాఘవాపూర్‌ దగ్గర గంగానదిలో ఏనుగుతో సహా చిక్కుకుపోయాడు ఒక మావటి. ఏనుగును నది దాటించాలంటే ఏనుగు బ‌రువును త‌ట్టుకోగ‌ల‌ పెద్ద‌ పడవ అవసరం. అయితే అంత డబ్బు లేకపోవడంతో ఏనుగుతో నదిని దాటాల‌ని చూశాడు . అయితే ఆకస్మాత్తుగా నదిలో వ‌ర‌ద‌ ప్రవాహం పెరిగింది. ఓ చెట్టుకు పట్టుకొని ఏనుగు మీద కూర్చున్నాడు.

ఓ వైపు న‌దిలో మునిగిపోతున్నా ఏనుగు మాత్రం అలాగే దాదాపు రెండు కిలోమీట‌ర్లు మావ‌టిని త‌న మీద కూర్చోపెట్టుకుని ఒడ్డుకు చేర్చింది. ఈ క్ర‌మంలో చాలాసార్లు ఏనుగు నీటిలో మునిగిపోవడం వీడియోలో కనిపిస్తోంది.

వాస్త‌వానికి రాఘోపూర్ నుంచి ఏనుగుతో మావటి పాట్నాకు బయలుదేరాడు. రుస్తంపూర్ వద్ద నది ఘాట్ నుంచి పాట్నా వైపు వెళ్లాలి. రుస్తంపూర్ ఘాట్ వద్దకు రాగానే పైపా బ్యారేజీ గేట్లు తెరిచినట్లు మావ‌టి గుర్తించాడు. అయితే అప్ప‌టికే ఒక్క‌సారిగా వ‌ర‌ద నీరు ఏనుగును, మావ‌టిని చుట్టుముట్టింది. దీంతో ఇద్దరూ నదిలో చిక్కుకుపోయారు.

భారీగా గంగా నదిలో వరద ప్రవాహం పెరగడంతో మధ్య ఏనుగు దాదాపు 3 కిలోమీటర్ల మేర ఈదుకుంటూ వచ్చింది. ఏనుగు నదిని దాటుతుండగా పడవలో వెళ్తున్న వ్యక్తులు వీడియో తీశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పడవలో నది దాటుతున్న ప్రజలు కూడా ఈ దృశ్యాన్ని చూసి భయపడ్డారు.


Full View
Tags:    

Similar News