తెలంగాణలో కోవిడ్ టీకా ప్లాన్ ఏమిటో చెప్పిన ఈటెల

Update: 2021-01-03 04:53 GMT
కోవిడ్ వ్యాక్సిన్ కు సంబంధించి కీలక ప్రకటన చేశారు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఈటెల రాజేందర్. అత్యవసర వినియోగానికి నిపుణుల కమిటీ అనుమతులు లభించటం.. మరో వారంలో ఇతర అనుమతులు లభిస్తున్న నేపథ్యంలో వారం రోజుల్లో ప్రజలకు టీకాను అందుబాటులోకి తెస్తానమి ప్రకటించారు. వ్యాక్సిన్లు రాష్ట్రానికి వచ్చిన వెంటనే పంపిణీ మొదలు పెడతామన్నారు.  

టీకా నిల్వ.. పంపిణీ.. వ్యాక్సినేషన్ పై ఇప్పటికే పది వేల మందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లుగా పేర్కొన్న ఆయన.. రోజుకు పది లక్షల మందికి టీకా వేసే సామర్థ్యం వైద్య శాఖకు ఉందన్నారు. తొలి విడతలో ఐదు లక్షలు.. తర్వాత పది లక్షలు.. మూడో విడతలో కోటి డోసులు ఇస్తామని కేంద్రం సంకేతాలు ఇచ్చినట్లుగా పేర్కొన్నారు.

టీకా అందుబాటులోకి వచ్చిన వెంటనే వైద్య ఆరోగ్య శాఖలో ఉన్న 3 లక్షల సిబ్బందికి తొలుత టీకా ఇవ్వనున్నారు. ఆ తర్వాత హోం.. మున్సిపల్ సిబ్బందికి.. పెద్ద వయస్కులకు టీకా ఇస్తామన్నారు. అనంతరం బస్తీల్లో ఉండే పేదవారికి ప్రాధాన్యం ఇస్తామన్నారు. కరోనా నుంచి కోలుకున్న వారు వ్యాక్సిన్ వేయించుకోవాల్సిన అవసరం లేదన్నారు. వారిలో ఇప్పటికే యాంటీబాడీస్ ఉత్పత్తి అయి ఉంటాయని స్పష్టం చేశారు. సో.. వారంలో కోవిడ్ టీకా తెలంగాణలోకి రానుందన్న మాట.


Tags:    

Similar News