కేసీఆర్ సన్నిహితుడికే జలక్..

Update: 2018-07-31 16:42 GMT
 రోజులు దగ్గరపడుతున్నాయి. ఇంకో ఏడాదే ఎన్నికలు.. అప్పుడే అధికారం కోసం టీఆర్ ఎస్ లో యావ మొదలైంది. నాలుగేళ్లుగా అందాయో లేదో.. ఈ చివరాఖరున సంపాదించుకుందామని టీఆర్ ఎస్ ప్రజాప్రతినిధులు కట్టుతప్పుతున్నారు. ఇప్పుడు ఇదే ఆ పార్టీ అధినేత కేసీఆర్ ను - మంత్రులను ఇరుకున పెడుతోంది. స్వయంగా కేసీఆర్ సన్నిహితుడికే జలక్ ఇచ్చినా.. అక్కడే ఉన్న ఈటల రాజేందర్ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోవడం హాట్ టాపిక్ గా మారింది..

అధికార పార్టీలో పరిణామాలు చూసి ఇప్పుడు టీఆర్ ఎస్ మంత్రులు కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో పడిపోయారు. ఇంకో ఏడాది మాత్రమే అధికారం మిగిలిపోవడంతో అసంతృప్తి జ్వాలలు టీఆర్ ఎస్ లో పెచ్చరిల్లుతున్నాయి. తాజాగా రాష్ట్ర ఆర్థిక - పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ కు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత నియోజకవర్గం  కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో ఘోర అవమానం ఎదురైంది. స్వయంగా ఆయన ఆదేశించినా టీఆర్ ఎస్ కింది స్థాయి ప్రజాప్రతినిధులు పెడచెవిన పెట్టడం హాట్ టాపిక్ గా మారింది.

తాజాగా ముఖ్యమంత్రికి బాగా సన్నిహితుడు - రాజ్యసభ ఎంపీ కెప్టెన్ లక్ష్మీ కాంతారావు కు టీఆర్ ఎస్ శ్రేణులు గట్టి షాకే ఇచ్చారు. లక్ష్మీకాంతరావు భార్య - హుజూరా బాద్ ఎంపీపీ సరోజనీ దేవి పై టీఆర్ ఎస్ సభ్యులు ఏకంగా ప్రతిపక్ష కాంగ్రెస్ - టీడీపీ ఇండిపెండెంట్ లతో కలిసి సోమవారం అవిశ్వాసం నోటీసు ఇచ్చారు. ఈ విషయమై స్వయంగా ఈటెల రాజేందర్ తోపాటు కేసీఆర్ నుంచి ఆదేశాలు వెళ్లినా కానీ మెజార్టీ ఉన్న టీఆర్ ఎస్ ప్రజాప్రతినిధులు వినకపోవడం సంచలనంగా మారింది. నాలుగేళ్లుగా సహించి ఓపిక పట్టిన టీఆర్ ఎస్ నేతలు ఇప్పుడు ఎంత పెద్ద నేత చెప్పిన స్వ ప్రయోజనాలు - ఆర్థిక భరోసా కోసం ఎంతకైనా తెగించడం టీఆర్ ఎస్ లో మారుతున్న రాజకీయాలకు నిదర్శనంగా కనిపిస్తోంది.
Tags:    

Similar News