ఈటల ఎపిసోడ్ లో గంగుల.. ట్రాక్ మార్చటం కోసమేనా?

Update: 2021-05-19 03:18 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్లానింగ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే ఉండదు. ఆయనతో గొడవ పడినోళ్లు కానీ ఆయనతో పెట్టుకున్న వారు కానీ ఒక్కరు కూడా లైమ్ లైట్ లో ఉన్నట్లు కనిపించరు. కాలం కేసీఆర్ పక్కనే ఉన్నట్లుగా పరిణామాలు చోటు చేసుకుంటుంటాయి. అలాంటి కేసీఆర్ కు దశాబ్దాల తరబడి నమ్మకంగా ఉన్న ఈటల మీద గులాబీ బీస్ కు మనసు విరిగిపోవటం.. ఆయన్ను పక్కన పెట్టేసే కార్యక్రమం ఈ మధ్యన పెద్ద ఎత్తున షురూ కావటం తెలిసిందే.

కేసీఆర్ తో పెట్టుకోవటం అంత సిన్న విషయం కాదన్నది ఈటలకు తెలియంది కాదు. అందుకే ఆయన ఆచితూచి అన్నట్లుగా అడుగులు వేస్తున్నారు. పెద్ద సారు మీద మాట అనేందుకు సవాలచ్చ ఆలోచిస్తూ ఒకట్రెండు మాటల్ని మాత్రమే అనగలిగారు. అంతకు మించి అంటే.. ఎక్కడ తేడా కొడుతుందో అన్నట్లుగా ఆయన జంకుతున్నారు. ఇలా ఈటల మొహమాటపడుతుంటే.. కేసీఆర్ మాత్రం నిర్మోహమాటంగా ఈటల సంగతి చూసే పనిని మంత్రి గంగులకు అప్పజెప్పినట్లుగా కనిపిస్తోంది.

టీఆర్ఎస్ లో బోలెడంతమంది ఉన్నప్పటికీ.. మరెవరికీ పట్టనట్లుగా ఈటలను టార్గెట్ చేస్తున్నట్లుగా గంగుల అదే పనిగా టార్గెట్ చేయటం తెలిసిందే. తాజాగా మరో అడుగు ముందుకు వేసి.. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజీనామా చేసిన తర్వాత ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామని సవాలు విసిరిన వైనం ఆసక్తికరంగా మారింది.

పదవుల కోసం పెదవులు మూయనని చెప్పిన ఈటల.. మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసినా పదవి పట్టుకొని ఊగుతున్నారన్న ఆయన.. ‘ఇది ఆత్మ గౌరవమా? ఆత్మ వంచనా? అనేది ఆత్మవిమర్శ చేసుకోవాలి. ప్రజలంతా నీ వెంటే ఉన్నప్పుడు రాజీనామా ఎందుకు చేయటం లేదు?’’ అని ప్రశ్నించారు. ఈటల మీద గంగుల అదే పనిగా ఎందుకు విరుచుకుపడుతున్నారు? అన్నదిప్పుడు ప్రశ్న. మామూలుగా అయితే ఈటలను దెబ్బ తీసింది గులాబీ బాస్. అంటే.. ఆయన ఫోకస్ కేసీఆర్ మీద ఉండాలి. మరి.. అధినేత మీద ఈటల ఫోకస్ ఉంటే.. ఆట అంతా ఇద్దరి మధ్యే ఉంటుంది.

చదరంగంలో రాజు ఎప్పుడు నేరుగా యుద్ధం చేయడు కదా? తన అస్త్రశస్త్రాల్ని తెలివిగా ఉపయోగిస్తూ ప్రత్యర్థిని దెబ్బ తీస్తాడు. గులాబీ బాస్ లెక్క కూడా ఇదే. ఈటల తనతో నేరుగా యుద్ధం చేస్తే ముఖాముఖి అవుతుంది. ఈటల స్టేచర్ పెరుగుతుంది. అందుకు భిన్నంగా మధ్యలో గంగుల చేత ఎంట్రీ ఇప్పిస్తే? ఫోకస్ మొత్తం మారుతుంది. అప్పుడు ఈటల వర్సెస్ గంగుల అన్నట్లుగా మారుతుంది. కేసీఆర్ కు కావాల్సింది కూడా ఇదే. తనను టార్గెట్ చేయాలనుకున్న ఈటలకు.. గంగులను దాటి రావటమే కష్టంగా మారాలి. అతడి లక్ష్యం గంగుల కావాలి. దాంతో ఇష్యూ డైవర్ట్ కావటమే కాదు.. గుంగుల లాంటి వారు మరికొందరు సీన్లోకి వస్తారు. అలా ఈటలను సైడ్ ట్రాక్ పట్టించటంతో కోసమే గంగుల ఎపిసోడ్ అన్న మాట వినిపిస్తోంది. మరి.. ఈ ఎత్తుగడను ఈటల ఎలా ఎదుర్కొంటారో చూడాలి.
Tags:    

Similar News