సాయం చేసేందుకు చేతులు రావు కానీ.. జెలెన్ స్కీకి స్టాండింగ్ ఒవేషన్?

Update: 2022-03-02 07:30 GMT
కొన్ని దేశాల తీరు మహా సిత్రంగా ఉంటాయి. ఒక పక్క ఇల్లు కాలి ఏడ్చేస్తుంటే.. మరోవైపు సదరు దేశంలో చెలరేగిన యుద్ధం మంటల్ని ఆర్పే ప్రయత్నం చేయాలి. అందుకు భిన్నంగా ఎవరికి వారు తమదైన శైలిలో.. తెలివితేటల్ని ప్రదర్శిస్తున్న వైనం ఇప్పుడు చూస్తున్నాం. ఉక్రెయిన్ పై సైనిక చర్యను షురూ చేసిన రష్యాకు గట్టి షాకిచ్చే ప్రయత్నాలు జరగని వైనం తెలిసిందే. రష్యాను కెలికితే ఏం జరుగుతుందో అందరికి తెలిసిందే.

అందుకే ఎవరికి వారు ఆచితూచి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి వేళ.. ఒక అరుదైన ఉదంతం చోటు చేసుకుంది. ఉక్రెయిన్ ను యుద్దం పడగ నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు అంతంత మాత్రమే జరుగుతున్న వేళ.. అందుకు భిన్నంగా యూరోపియన్ యూనియన్ పార్లమెంటులో మాత్రం ఉక్రెయిన్ అధ్యక్షుడికి స్టాండింగ్ ఒవేషన్ లభించింది.

తమ దేశంలో తాజాగా నెలకొన్న పరిస్థితుల గురించి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఆన్ లైన్ ద్వారా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన తన ప్రసంగంలో.. తమ మాతృభూమి కోసం.. స్వేచ్ఛ కోసం పోరాడుతున్నామని.. తాము ఉక్రెయిన్లమని.. శక్తివంతులమని.. తమను ఎవరూ విడదీయలేరంటూ భావోద్వేగ ప్రసంగాన్ని చేశారు.

ఆయన ప్రసంగం పూర్తి అయిన తర్వాత ఈయూ పార్లమెంటు సభ్యులంతా గౌరవపూర్వకంగా లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. చాలా అరుదుగా మాత్రమే ఇలాంటివి జరుగుతాయని చెబుతున్నారు. ఇదంతా బాగానే ఉంది కానీ.. ఉక్రెయిన్ కు ఇప్పుడు కావాల్సింది ఈయూ నుంచి స్టాండింగ్ ఒవేషనా? లేక.. యుద్ధాన్ని ఆపేలా రష్యా మీద ఒత్తిడి తీసుకురావటమా? అన్న దాని మీద ఎప్పుడు ఆలోచిస్తారో?
Tags:    

Similar News