ఆ మంచి నిర్ణయం ఏపీకి శాపంగా.. తెలంగాణకు వరంగా మారిందా?

Update: 2019-12-17 05:25 GMT
ఎంత చక్కటి నిర్ణయమని సంబరపడిపోవచ్చు. కానీ.. అలాంటి నిర్ణయాల కారణంగా ఆర్థిక వ్యవస్థకు జరిగే నష్టం గురించి చాలామంది ఆలోచించరు. ఆలోచనలకు.. రియాల్టీకి మధ్య ఉండే తేడా ఎలా ఉంటుందో ఇప్పుడు చాలామందికి అర్థమవుతుందని చెప్పాలి. ఎవరేం చెప్పినా.. సంక్షేమ పథకాల మీద ప్రభుత్వాలు అంతకంతకూ ఆధారపడిపోతున్న వేళ.. అందుకు తగ్గ నిధుల్ని సమకూర్చుకోవటం ప్రభుత్వాలకు తలకు మించిన భారంగా మారుతున్నాయి.

ఆదాయాన్ని పక్కన పెట్టేసి.. ఆదర్శాలకు పెద్దపీట వేసేలా ప్రభుత్వ విధానాల్ని రూపొందించటానికి ఏ సర్కారు ధైర్యం చేయటం లేదు. అందుకు భిన్నంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం వ్యవహరిస్తున్నారు. ఏపీలో పాక్షిక మద్య నిషేధాన్ని అమలు చేస్తున్నారు. మద్యనిషేధాన్ని దశల వారీగా అమలు చేయటం ఎంత ఖరీదైన వ్యవహారమో తాజా లెక్కల్ని చూస్తే ఇట్టే అర్థం కాక మానదు. 

ఏపీలో అమలు చేస్తున్న కొత్త ఎక్సైజ్ పాలసీ.. రాష్ట్ర టూరిజాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. గతంలో శీతాకాలం వచ్చిందంటే చాలు.. పాపికొండలు.. విశాఖతో పాటు ఏపీలోని పలు ప్రదేశాలకు పర్యాటకులు పోటెత్తేవారు. ఇప్పుడు అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. పాపికొండల్లో చోటు చేసుకున్న పడవ ప్రమాదం.. అక్కడి టూరిజాన్ని ఒక రకంగా దెబ్బ తీస్తే.. కొత్త ఎక్సైజ్ పాలసీ మరోలా దెబ్బ తీస్తోంది.

ఫైర్ స్టార్.. ఫోర్.. త్రీ.. స్టార్లు ఏవైనా.. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఏపీకి వచ్చే పర్యాటకుల సంఖ్య దారుణంగా పడిపోతోంది. సరదాగా ఏదైనా ప్రాంతానికి వెళ్లినప్పుడు ఎంజాయ్ మెంట్ లో భాగంగా మద్యం సేవించటం ఇప్పుడో అలవాటుగా మారింది. ఏపీలో అమలు చేస్తున్న నూతన ఎక్సైజ్ పాలసీ ప్రకారం.. స్టార్ హోటళ్లలో మద్యాన్ని సర్వ్ చేయటం లేదు. దీంతో పర్యాటకుల సంఖ్య తగ్గిపోతోంది.

గతంలో మాదిరి ఎంజాయ్ చేయాలనుకునే వారు అయితే తెలంగాణకు లేదంటే ఒడిశాకు వెళుతున్నారే కానీ ఏపీకి రావటం లేదు. ఈ కారణంతోనే ఒకప్పుడు నిత్యం బిజీగా ఉండే విశాఖలోని హోటల్ గదులు ఇప్పుడు 1800 వరకూ ఖాళీగా ఉన్నాయంటే కారణం పాక్షిక మద్యపాన నిషేధంగా చెబుతున్నారు. ఈ కారణంగా ఏపీ ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం పడిపోతుందన్న ఆందోళన ఎక్కువ అవుతోంది. ఈ లోటును భర్తీ చేసేలా ప్రత్యేక కార్యక్రమాలు.. ఈవెంట్లను పెద్ద ఎత్తున నిర్వహిస్తే.. ఈ లోటును తగ్గించుకునే వీలుందంటున్నారు. లేనిపక్షంలో టూరిజం.. దాని సంబంధిత రంగాలతో వచ్చే ఆదాయం భారీగా తగ్గే ప్రమాదం ఉందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News