భారీ సిక్స్ కు క్యాచ్ పట్టబోయిన అభిమాని తల పగిలింది

Update: 2021-12-15 03:12 GMT
సరదాగా కూర్చొని క్రికెట్ మ్యాచ్ చూస్తున్న అభిమాని ఊహించని పరిణామాన్ని ఎదుర్కొన్నారు. గ్రౌండ్లో ఉన్న బ్యాట్స్ మెన్ ఒకరు భారీ సిక్సును కొడితే.. తనవైపునకు దూసుకొస్తున్న బంతిని లాఘవంగా క్యాచ్ పట్టాలన్న ఒక అభిమాని ప్రయత్నం.. అంచనా తప్పి అనుకోని రీతిలో పెద్ద దెబ్బ తగిలిన వైనం షాకింగ్ గా మారింది.

దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది. వాస్తవానికి క్యాచ్ పట్టబోయిన అభిమాని.. తనకు దెబ్బ తగిలిన విషయాన్ని కాస్త ఆలస్యంగా గుర్తించాడు. అసలేం జరిగిందంటే..

బిగ్ బాష్ లీగ్ 2021 మ్యాచ్ ఒకటి తాజాగా పెర్త్ లో జరిగింది. హోబర్ట్ హరికేన్స్ ఇన్నింగ్స్ 8వ ఓవర్లో ఆండ్రూ టై బౌలింగ్ లో బ్యాట్స్ మెన్ బెన్ మెక్ డెర్మోట్ భారీ సిక్స కొట్టారు. గాల్లో లేచిన బంతి.. నేరుగా ప్రేక్షకులు కూర్చున్న స్టాండ్స్ వైపునకు వెళ్లింది. అక్కడ కూర్చున్న అభిమాని ఒకరు.. ఆ బంతిని క్యాచ్ పట్టే ప్రయత్నం చేశారు.

అనూహ్యంగా ఆ బంతి చేతుల్లోకి చిక్కుకుండా.. నుదిటి మీద బలంగా తాకింది. దీంతో.. కింద పడిన అతడు.. ఆ వెంటనే.. తన తల నుంచి కారిన రక్తాన్ని చూసి షాక్ తిన్నాడు. అతడి పక్కనే ఉన్న వారు.. అతడి తల నుంచి రక్తం కారుతున్న వైనాన్ని గుర్తించి.. వెంటనే సర్జన్ రూమ్ కు తరలించారు. ప్రస్తుతం అతగాడి పరిస్థితి బాగానే ఉందని.. స్టేడియం నిర్వాహకులు ప్రకటించారు. అనూహ్యంగా చోటు చేసుకున్న ఈ ఉదంతానికి సంబంధించిన చిట్టి వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.


Tags:    

Similar News