రాజధాని శంకుస్థాపన రోడ్డును తవ్వేసిన రైతు

Update: 2022-09-02 04:30 GMT
ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కోసం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. నాటి ప్రభుత్వం వేసిన రోడ్డును తాజాగా ఒక రైతు తవ్వేసిన వైనం షాకింగ్ గా మారింది.

శంకుస్థాపన కోసం కంకరతో వేసిన రోడ్డును తవ్వేయటంపై పోలీసులకు.. రెవెన్యూ అధికారులు కంప్లైంట్ ఇచ్చారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో రాజధాని శంకుస్థాపన ప్రదేశానికి కంకర చిప్స్ తో రోడ్డు వేశారు.

అయితే.. ఆగస్టు 31న (వినాయచవితి పండుగ రోజున) పెనుమాకకు చెందిన గోవిందరెడ్డి అనే రైతు ఆ మార్గాన్ని తన ట్రాక్టర్ తో తవ్వేసి.. గ్రావెల్ ను ఊళ్లోకి తరలించిన వైనం షాకింగ్ గా మారింది.

ఈ ఉదంతం హాట్ టాపిక్ గా మారింది. సదరు రైతు ఇలా ఎందుకు చేసినట్లు? అంటూ పోలీసులు అతడ్ని ప్రశ్నించారు.  దీనికి బదులిచ్చిన అతడు.. షాకింగ్ సమాధానాన్ని ఇచ్చాడు.

రోడ్డు వేసి ఉన్న స్థలాన్ని తాను ఇటీవల కొనుగోలు చేశానని.. తన పొలాన్ని చదును చేసేందుకు వీలుగా ఆ భూమిని తవ్వినట్లుగా పేర్కొన్నారు. రోడ్డును తవ్వగా వచ్చిన కంకరను గ్రామంలోని ప్రజావసరాలకు వినియోగించినట్లుగా వెల్లడించారు.

రైతు ఇచ్చిన సమాధానంతో పోలీసులు.. రెవెన్యూ అధికారులు ఏం చేయాలన్న దానిపై రికార్డుల్ని తనిఖీ చేసే పనిలో పడ్డారు. రైతు ఇచ్చిన వివరణను తీసుకున్న అధికారులు ఉన్నతాధికారులకు పంపుతున్నట్లు చెప్పుకొచ్చారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News