సంక్రాంతి పండుగను పురస్కరరించుకొని ఓ ఎమ్మెల్యే తన సొంత నియోజకవర్గానికి వస్తుంటాడు.....ఆ విషయం తెలుసుకున్న గ్రామస్థులు దారికాసి ఆయన వాహనాలను అడ్డుకుంటారు......రైతులను శాంతపరుద్దామని ఆ ఎమ్మెల్యే వారి దగ్గరకు వెళతాడు....ఆ రైతులందరితో మాటామంతీ జరపాలని భావిస్తాడు.....అయితే, అనూహ్యంగా ఆ రైతులు....తమ సమస్యలను సర్కారు నిర్లక్ష్యం చేస్తోందంటూ....సదరు ఎమ్మెల్యేను నిలదీస్తారు.....ఆ ఎమ్మెల్యేను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తారు......దీంతో - ఆ ఎమ్మెల్యే అతికష్టం మీద అక్కడనుండి పలాయనం చిత్తగిస్తాడు.....ఇదంతా ఓ సినిమాలో జరిగిన సన్నివేశం అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే! వినడానికి ఆశ్చర్యకరంగా ఉన్నా......ఈ ఏడాది సంక్రాంతి రోజున పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి ఎదురైన ఈ చేదు అనుభవం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి....సంక్రాంతినాడు తన నియోజకవర్గానికి వస్తున్నారన్న సమాచారం కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని గంగవరం గ్రామ రైతులకు తెలిసిందే. ఎమ్మెల్యేను నిలదీయాలని నిర్ణయించుకున్న గ్రామస్థులు దారికాశారు. వారిని చూసిన ఎమ్మెల్యే....కారు దిగి వారిని శాంతపరిచే ప్రయత్నం చేశారు. పొలాలకు ఎస్సారెస్పీ నుంచి నీరు విడుదల చేయడంలో జాప్యం జరుగుతోందని ఆగ్రహంతో ఉన్న రైతులు మనోహర్ రెడ్డిని నిలదీశారు. ప్రభుత్వం నీరందిస్తామని చెప్పడంతో పంటలు వేశామని....సకాలంలో నీరు విడుదల చేయకపోవడంతో వందల ఎకరాల్లో పంటలు ఎండిపోయి నాశనమయ్యాయని మండిపడ్డారు. ఈ హఠాత్పరిణామానికి ఖంగుతిన్న ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు. అయితే, ఆగ్రహంతో ఉన్న గ్రామస్థులు ఆయనను వెంబడించారు. పోలీసులు...ఎమ్మెల్యేను కారులో ఎక్కించి సురక్షితంగా గ్రామం దాటించారు. ఈ ఘటనపై ఇరిగేషన్ శాఖ మంత్రి హరీశ్ రావు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయం పై ఆయన అధికారికంగా స్పందించలేదు. ఓ వైపు సీఎం కేసీఆర్...ప్రజలందరికీ 24 గంటలు విద్యుత్ - నీరు సరఫరా చేస్తున్నామని ప్రగడ్భాలు పలుకుతున్న సందర్భంలో ఈ ఘటన జరగడంపై సర్కార్ కూడా సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, సర్కార్ పై తెలంగాణ ప్రజల వ్యతిరేకత ఈ స్థాయిలో ఉండడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది.