రైతులారా.... బాబు బ్రదర్ మోదీ

Update: 2018-10-02 16:52 GMT
పార్టీలే వేరు. నాయకుల తీరు మాత్రం ఒకటే అని నిరూపిస్తున్నారు మన నాయకులు. దీనికి తాజా ఉదాహరణే ఢిల్లీలో రైతులపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యవహరించిన తీరు అని అంటున్నారు. గతంలో సమైక్య ఆంధ్రప్రదేశ్‌ కు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన నారా చంద్రబాబు నాయుడు కూడా రైతులపై వ్యవహరించిన తీరు ఇప్పటికి వివాదాస్పదం అవుతోంది. సేమ్ టు సేమ్ రైతులపై ఉక్కుపాదం మోపిన చంద్రబాబు నాయుడ్ని తలపించారు ప్రధాని నరేంద్ర మోదీ. రుణమాఫీతో పాటు అనేక డిమాండ్ల పరిష్కారం కోసం ఉత్తరప్రదేశ్ కు చెందిన వేలాది మంది రైతులు ఛలో ఢిల్లీ కార్యక్రమంలో భాగంగా రాజధాని చేరుకున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్ధలో తమ నిరసనను తెలియజేసేందుకు కూడా వీలు లేకుండా చేస్తున్న నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతులు ఢిల్లీ వీధుల్లోకి రాకుండా అన్ని దారులు మూసేశారు. ఒక విధంగా చెప్పాలంటే దేశ రాజధాని ఢిల్లీని అష్టదిగ్బంధనం చేసేశారు. అయినా వీటిని లెక్క చేయని ఉత్తర్ ప్రదేశ్ రైతులు అలా అలా ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ వీధుల్లో ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి రైతులను నగర ప్రవేశం చేయకుండా అడ్డుకున్నారు. అయితే నిరసనే లక్ష్యంగా రైతులు ఎక్కడికక్కడ బారికేడ్లను తొలగించుకుంటూ నగరంలోకి ప్రవేశించారు. గతంలో సమైక్య ఆంధ్రప్రదేశ్‌ లో కూడా ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతులను ఇలాగే అడ్డుకున్నారు.పశ్చిమ గోదావని జిల్లా కాల్దారి లో లక్షల సంఖ్యలో వచ్చిన రైతులపై ఆనాటి చంద్రబాబు నాయుడి ప్రభుత్వం కాల్పులు కూడా జరిపింది.

గాంధీ జయంతి సందర్భంగా ఉత్తర్‌ప్రదేశ్ రైతులు శాంతియుతంగా జరుప తలపెట్టిన శాంతియుత ధర్నాను హింసతో ఎదుర్కొంది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజధానిలో ప్రవేశించిన రైతులపై బాష్పవాయువు ప్రయోగించారు. రైతులను చెదరగొట్టేందుకు వాటర్ కానన్‌లను ప్రయోగించారు. శాంతియుత నిరసన తెలిపేందుకు వచ్చిన రైతుల్లో ఎక్కువ మంది వయసు మీరిన వారు ఉండడం - పోలీసుల వ్యవహరించిన తీరుతో వారిలో చాలా మంది సొమ్మసిల్లపడిపోవడం విమర్శలకు దారితీస్తోంది. సెప్టెంబర్ 23 వ తేదిన హరిద్వార్ లో ప్రారంభమైన ఈ రైతు కిసాన్ క్రాంతియాత్రలో ఉత్తర్‌ ప్రదేశ్‌ లోని రైతులంతా జత కలిసారు.రైతులు వారంతట వారే పాదయాత్రగానూ - బస్సుల్లోనూ - ట్రాక్టర్లపైనా వచ్చారు. ఇది నరేంద్రమోదీ  ప్రభుత్వానికి కంటగింపుగా మారడంతో  రైతులపై లాఠీఛార్జి చేశారు. ఇంతకు ముందు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు వ్యవహరించిన సమయంలో విద్యుత్ ఛార్జీలతో పాటు రైతుల సమస్యలపై ఉద్యమించినప్పుడు కూడా రైతులపై ఇలాంటి దారుణ చర్యలకే పాల్పడ్డారు. ఇది చంద్రబాబు నాయడు గద్దె దిగిపోయేలా చేసింది. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ఈ రైతు వ్యతిరేక చర్య కూడా ఆయనకు చంద్రబాబు నాయుడికి పట్టిన గతే తీసుకువస్తుందని ప్రతిపక్షాలు - రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
Tags:    

Similar News