మండ‌లి సీటుకు `దాడి` ప‌ట్టు.. పోటీ ప‌డుతున్న తండ్రీ త‌న‌యుడు!

Update: 2021-07-07 11:37 GMT
ఏపీ పొలిటిక‌ల్ చ‌రిత్ర‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌త‌ను సృష్టించిన నాయ‌కుడు.. సీనియ‌ర్ నేత‌, దాడి వీర‌భ‌ద్ర‌రావు.  తాజాగా దాడి కుటుంబం గురించి ఆస‌క్తిక‌ర విష‌యం వెలుగు చూసింది. గ‌తంలో టీడీపీ త‌ర‌ఫున నాయ‌కుడిగా గుర్తింపు సాధించిన దాడి.. అనేక ప‌ద‌వులు కూడా ద‌క్కించుకున్నారు. విశాఖ‌ప‌ట్నానికి చెందిన దాడికి రాజ‌కీయంగా మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే 2014 ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న దాడి.. అప్ప‌ట్లో వైసీపీ అధినేత జ‌గ‌న్ సీఎం అయిపోతున్నార‌నే ప్ర‌చారానికి ఫిదా అయ్యారు. ఇంకేముంది.. జ‌గ‌న్ సీఎం అవుతున్నార‌ని సంబ‌ర‌ప‌డ్డారు.

ఇదే స‌మ‌యంలో 2013లో త‌న ఎమ్మెల్సీ ప‌ద‌వి కాలం ముగుస్తున్న నేప‌థ్యంలో మ‌రోసారి పొడిగించాల‌ని చంద్ర‌బాబును ఆయ‌న కోరారు. అయితే.. దీనికి బాబు నిరాక‌రించారు. ఫ‌లితంగా.. త‌న కుమారుడు ర‌త్నాక‌ర్ భ‌విత‌వ్యాన్ని దృష్టిలో పెట్టుకుని.. వైసీపీ గూటికి చేరిపోయారు. ఈ నేప‌థ్యంలోనే చంద్ర‌బాబు పై తీవ్ర విమ‌ర్శ‌లు కూడా చేశారు. 2014 ఎన్నిక‌ల్లో విశాఖ నార్త్  సీటు నుంచి త‌న కుమారుడికి వైసీపీ టికెట్ ఇప్పించుకున్నారు. అయితే.. ఆ ఎన్నిక‌ల్లో ర‌త్నాక‌ర్ ఓడిపోయారు. అయిన‌ప్ప‌టికీ.. వైసీపీలోనే కాన‌సాగుతున్న దాడి కుటుంబం .. ఇప్పుడు మ‌రో విష‌యంలో చ‌ర్చ‌నీయాంశం అయింది.

పార్టీని న‌మ్ముకుని ఉన్న త‌మ‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆయ‌న వైసీపీ అధిష్టానంపై ఒకింత ఆగ్రహంతో ఉన్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. పార్టీ అధికారంలోకి వ‌చ్చి రెండేళ్లు పూర్త‌యినా.. ఇప్ప‌టి వ‌ర‌కు తండ్రీ కుమారుడికి పార్టీ నేత‌ల నుంచి ఎలాంటి ఆద‌ర‌ణ లేకుండా పోయింది. ఈ క్ర‌మంలోనే ఇప్ప‌టికైనా త‌మ‌ను గుర్తించాల‌ని దాడి ఫ్యామిలీ కోరుతోంది. ఈ క్ర‌మంలో జ‌గ‌న్ ఈ విష‌యంపై ప్ర‌త్యేకంగాదృష్టి పెట్టి.. దాడి కుటుంబానికి న్యాయం చేయాల‌ని భావిస్తున్న‌ట్టు స‌మాచారం.

ఈ క్ర‌మంలోనే దాడి మండ‌లికి పంపాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే.. ఈ ప‌ద‌వి ఇంకా ఖ‌రారు కాక‌పోయినా.. దాడి కుటుంబంలో మాత్రం చిచ్చుకు దారితీసింద‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. జ‌గ‌న్ ఇవ్వ‌నున్న ఎమ్మెల్సీ ప‌ద‌విని నాకు కావాలంటే.. నాకు కావాల‌ని వీర‌భ‌ద్ర‌రావు.. ఆయ‌న కుమారుడు ర‌త్నాక‌ర్‌లు ప‌ట్టుబ‌డుతున్నార‌ట‌. త‌ను వ‌యోవృద్ధుణ్ని అయిపోయాయ‌న‌ని,  జీవిత చ‌ర‌మాంకంలో ఈ ఒక్క ఛాన్స్ ఇవ్వాల‌ని .. వీర‌భ‌ద్ర‌రావు కోరుతున్న‌ట్టు తెలుస్తోంది.

అయితే.. 2019 ఎన్నిక‌ల‌తోపాటు.. ఇటీవ‌ల జ‌రిగిన స్థానిక స‌మ‌రంలోనూ తాను వీరోచితంగా పార్టీ కోసం శ్ర‌మించాన‌ని.. సో.. త‌న‌కు ఇవ్వాల‌ని ర‌త్నాక‌ర్ డిమాండ్ చేస్తున్నారు. పోనీ .. ఇది కాక‌పోయినా.. విశాఖ డీసీసీబీ చైర్మ‌న్ ప‌ద‌వి అయినా ఇవ్వాల‌నేది ర‌త్నాక‌ర్ డిమాండ్‌గా క‌నిపిస్తోంది. అయితే జ‌గ‌న్ దాడి కుటుంబానికి ఇప్పుడు ఉన్న ప‌రిస్థితుల్లో రెండు ప‌ద‌వులు ఇచ్చే ఛాన్సే లేదు. మ‌రి దాడి కుటుంబానికి ప‌ద‌వి ఇస్తే ?  అది తండ్రి, కొడుకుల్లో ఎవ‌రికి ద‌క్కుతుందో ?  చూడాలి.
Tags:    

Similar News