మంత్రుల రాజీనామాలకు ముందు కేబినెట్ తీసుకున్నచివరి నిర్ణయాలు ఏవంటే?

Update: 2022-04-08 04:49 GMT
దేశంలోని ఇన్ని రాష్ట్రాలు.. రాష్ట్ర ప్రభుత్వాలు.. ముఖ్యమంత్రులు ఉన్నా ఎవరూ చేయని సరికొత్త ప్రయోగానికి తెర తీశారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తమ ప్రభుత్వ పదవీ కాలం సగం పూర్తి అయిన తర్వాత.. తనతో జర్నీ చేసే మంత్రులకు ఉద్వాసన పలికి.. పూర్తిగా సరికొత్త టీంను ఏర్పాటు చేసుకునే సాహసోపేత నిర్ణయాన్ని తీసుకోవటమే కాదు అమలు చేయటం తెలిసిందే. ఇలాంటి సందర్భాల్లో మంత్రుల్ని నేరుగా కలిసేందుకు సీఎం ఇబ్బంది పడతారేమో అన్న భావనను దరి చేరనివ్వకుండా.. అందరిని తన వద్దకు పిలవటమే కాదు.. వారందరికి కేబినెట్ భేటీని నిర్వహించిన సీఎం.. వారందరికి భారీ విందును ఏర్పాటు చేసి ఘనంగా వీడ్కోలు పలకటం మాత్రం నభూతో నభవిష్యతిగా మారిందని చెప్పాలి.

కేబినెట్ భేటీలో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ అంశాన్ని ప్రస్తావిస్తూ.. టీంలోని కొందరు కొత్త కేబినెట్ లో కూడా కంటిన్యూ అవుతారని.. మంత్రి పదవులు లేని వారికి గౌరవ మర్యాదల విషయంలో ఎలాంటి లోటు ఉండదని స్పష్టం చేస్తూనే.. వారికి కొత్త పదవులు ఇచ్చే అంశాన్ని ప్రస్తావించారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. చివరి మంత్రిమండలి భేటీలో పలు అంశాలపై చర్చ జరిపి.. ఆమోద ముద్ర వేయటం జగన్ కే చెల్లింది. అన్నింటికి మించిన వివిధ సంస్థలకు ప్రభుత్వ భూమినిపెద్ద ఎత్తున కేటాయించేందుకు వీలుగా పెద్ద ఎత్తున నిర్ణయాలు తీసుకోవటం గమనార్హం. దీనికి సంబందించిన పలు నిర్ణయాల్ని తీసుకున్నారు. అవేమంటే..

-  రాష్ట్రంలో కొత్త రెవిన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తూ గతంలో ఇచ్చిన నోటిఫికేషన్‌కు చేసిన స్వల్ప సవరణలకు ఆమోదం

-  కొత్తగా కొత్తపేట, పులివెందుల రెవిన్యూ డివిజన్‌ల ఏర్పాటుకు ఓకే

-  8 మండలాల (చక్రాయపేట, వేంపల్లె, సింహాద్రిపురం, లింగాల, పులివెందుల, వేముల, తొండూరు, వీరపునాయనిపల్లె) తో పులివెందుల రెవెన్యూ డివిజన్.

- విభజన తర్వాత వైఎస్సార్ కడప జిల్లాలో 36 మండలాల నేపథ్యంలో కొత్తగా పులివెందుల డివిజన్‌.

-  7 మండలాల (ఆత్రేయపురం, ఆలమూరు, రావులపాలెం, కొత్తపేట, పి.గన్నవరం, అంబాజీపేట, అయినవిల్లి)తో కొత్తపేట రెవిన్యూ డివిజన్‌ ఏర్పాటు

-  12 పోలీసు సబ్‌డివిజన్లు, 16 పోలీస్‌ సర్కిళ్ల ఏర్పాటుకు ఓకే

-  పంచాయతీరాజ్‌ చట్టానికి సంబంధించిన ఆర్డినెన్స్‌

-  జిల్లాల పునర్విభజన ప్రక్రియను ప్లానింగ్‌ సెక్రటరీ విజయకుమార్‌ సహా, అధికారులందరూ సమర్ధవంతంగా నిర్వహించారని ప్రశంస.అధికారులను అభినందిస్తూ తీర్మానానికి ఓకే

-  2021–22 ఆర్ధిక సంవత్సరానికి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అర్హులైన స్వయం సహాయక సంఘాలకు  వైయస్సార్‌ సున్నావడ్డీ పథకం అమలు.

-  పంచాయతీరాజ్‌ చట్టానికి సంబంధించిన ఆర్డినెన్స్‌కు కేబినెట్‌ ఆమోదం. జిల్లాల విభజన నేపథ్యంలో ఇప్పుడున్న జిల్లా పరిషత్‌లను మిగిలిన కాలానికి కొనసాగిస్తూ ఆర్డినెన్స్‌.


-  చిత్తూరు జిల్లా పుంగనూరు మండలంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న అగ్రికల్చరల్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలో 12 పోస్టుల భర్తీకి ఆమోదం.

-  చిరుధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన మిల్లెట్‌ మిషన్‌ (2022–23  నుంచి 2026-27 వరకు ఆమోద ముద్ర

-  ప్రభుత్వ వైద్యుల ప్రైవేటు ప్రాక్టీస్‌పై నిషేధం విధించే తీర్మానానికి కేబినెట్‌ ఆమోదం.

-  ఐచ్ఛికంగా వచ్చిన ఎయిడెడ్‌ డిగ్రీ కాలేజీల సిబ్బందికి ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో పోస్టులు. దాదాపు 253 పోస్టులు (23 ప్రిన్సిపల్, 31 టీచింగ్, 199 నాన్‌టీచింగ్‌ పోస్టులకు కేబినెట్‌ ఆమోదం.  ప్రకాశంజిల్లా దర్శిలో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 24 టీచింగ్‌ పోస్టులు, 10 నాన్‌టీచింగ్‌ పోస్టుల మంజూరు.  శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస తొగరాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 24 టీచింగ్, 10 నాన్‌ టీచింగ్‌ పోస్టులకు ఓకే.

-  రాష్ట్రంలో హెల్త్‌ హబ్స్‌ ఏర్పాటుకు సంబంధించి కీలక నిర్ణయాలు. ఆరోగ్యరంగాన్ని బలోపేతం చేసే దిశగా జిల్లాకేంద్రాలు, కార్పొరేషన్లలో అత్యాధునిక వైద్యసేవలు అందించే ఆస్పత్రులకు భూముల కేటాయింపు. దీన్లో భాగంగా.. కాకినాడ అర్బన్‌ మండలం సూర్యారావుపేటలో మల్టీ/సూపర్‌ స్పెషాల్టీ ఆస్పత్రి ఏర్పాటు చేసేందుకు 5 ఎకరాల భూమి కేటాయింపు. కర్నూలు జిల్లా కల్లూరులో అత్యాధునిక ఆస్పత్రి కోసం 5 ఎకరాలు, విజయనగరం మండలం సంతపేటలో 4.5 ఎకరాల భూమి హెల్త్‌ హబ్‌ కింద భూమి కేటాయింపు. అనంతపురం రూరల్‌ గ్రామంలో 4 ఎకరాలు, శ్రీకాకుళం మండలం పాత్రుని వలసలో 4.32 ఎకరాల కేటాయింపు

-  పీఆర్సీకి సంబంధించి ఆర్థికశాఖ జారీ చేసిన ఉత్తర్వులకు ఆమోదం.

-  సర్వే సెటిల్‌మెంట్స్‌ అండ్ ల్యాండ్‌ రికార్డుల డిపార్ట్‌మెంట్‌ను మరింత బలోపేతం చేయటానికి  పునర్‌వ్యవస్థీకరణ ప్రతిపాదనలకు పచ్చజెండా

-  ఏపీ టూరిజం డిపార్ట్‌మెంట్‌కు హోటల్‌ మరియు కన్వెన్షన్‌ సెంటర్‌ కోసం రాజమండ్రి అర్భన్‌ లో 6 ఎకరాల భూమి కేటాయింపు. కర్నూలు జిల్లా బేతంచర్లలో ఎంఎస్‌ఎంఈ పార్కు కోసం ఏపీఐఐసీకి 100 ఎకరాలు. కొయ్యూరు మండలం బలరాం గ్రామంలో ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ ఏర్పాటుకు 15.31 ఎకరాలు. ప్రభుత్వ ఐటీఐని ఏర్పాటుకు   హుకుంపేట మండలం గడుగుపల్లిలో 5.10 ఎకరాల భూమి కేటాయింపు. అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం కడమలకుంట, రాగులపాడుల్లో 15 ఎకరాల భూమి ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌కు ఇచ్చేందుకు ఓకే.

ఇక్కడ విండ్‌ టర్బైన్‌ జనరేటర్లను ఏర్పాటు చేయనున్నారు. కర్నూలు జిల్లా డోన్‌ మండలం ఉడుములపాడులో ఆగ్రోకెమికల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ విస్తరణకు 10.06 ఎకరాలతో పాటు కాకినాడ జిల్లా జగ్గంపేటలో బస్‌స్టేషన్‌ నిర్మాణానికి 1.57 ఎకరాలు, రంపచోడవరం మండలం పెద గడ్డాడలో ఏకలవ్య మోడల్‌ స్కూల్‌ నిర్మాణానికి 15 ఎకరాలు, నిజాం పట్నం మండలం దిండిలో పరిసవారి పాలెంలో 280 ఎకరాలను ఏపీ మత్స్యశాఖకు కేటాయింపునకు ఓకే.

-  కర్నూలు జిల్లా కొలిమిగుండ్లలో ఏపీఐఐసీ ఇండస్ట్రియల్‌ పార్కు ఏర్పాటుకు 82.34 ఎకరాలు,  ముత్తుకూరు మండలం ఈపూరు సమీపంలో ఇండస్ట్రియల్‌ పార్కు నిర్మాణానికి ఏపీఐఐసీకి 84.29 ఎకరాలు, గూడూరులో ప్రభుత్వ ఆస్పత్రిక విస్తరణ కోసం 0.89 ఎకరాలు, నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కాన్పూరులో 5.05 ఎకరాల భూమిని సెంట్రల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియన్‌ లాంగ్వేజెస్ (మైసూర్) కు ఇచ్చేందుకు ఆమోదముద్ర.
Tags:    

Similar News