మోడీ బిల్లు సెగ వరంగ‌ల్ బ్యాంకుల్ని తాకింది

Update: 2017-12-22 05:00 GMT
చ‌ట్టం త‌ర్వాత సంగ‌తి.. ముందు బిల్లుగా కూడా ఓకే కానీ ఒక అంశానికి సంబంధించిన భ‌యాందోళ‌న‌లు నెమ్మ‌దినెమ్మ‌దిగా గ్రామాల స్థాయికి వెళుతున్నాయి. చ‌ట్ట‌స‌భ‌ల్లోకి బిల్లుగా వ‌చ్చి.. చ‌ర్చ జ‌రిగి.. ఆమోదం పొందిన త‌ర్వాత కానీ చ‌ట్టంగా మారుతుంది. అయితే.. అంత ప్రాసెస్ మీద అవ‌గాహ‌న లేక‌పోవ‌టం.. మోడీ తీసుకునే సంచ‌ల‌నాల మీద ప్ర‌జ‌ల‌కు ఉన్న న‌మ్మ‌కం ఇప్పుడు బ్యాంకుల‌కు కొత్త త‌ల‌నొప్పిని తెచ్చి పెడుతోంది.

మోడీ స‌ర్కారు ప్ర‌తిపాదిస్తున్న ఫైనాన్షియ‌ల్ రిజ‌ల్యూష‌న్ అండ్ డిపాజిట్ ఇన్సురెన్స్ బిల్లు 2017 మీద సందేహాలు.. అనుమానాలు వ‌రంగ‌ల్ లాంటి ప‌ట్ట‌ణాన్ని తాకాయి. బ్యాంకు ఖాతాల్లో ఉన్న వినియోగ‌దారుల డ‌బ్బుల్ని ప్ర‌భుత్వ‌మే వాడేసుకుంటుంద‌న్న అనుమానాల మ‌ధ్య బ్యాంకుల ఎదుట మోడీ క్యూలు మొద‌ల‌య్యాయి.

త‌మ డ‌బ్బుల్ని ప్ర‌భుత్వం తీసేసుకుంటుంద‌న్న సందేహంతో ఎవ‌రికి వారు త‌మ ఖాతాల్లో ఉన్న డ‌బ్బుల్ని విత్ డ్రా చేసుకునేందుకు ఆస‌క్తిని ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఇలా వ‌స్తున్న ఖాతాదారుల‌కు బ్యాంకులు న‌చ్చ చెబుతున్నా.. ప‌లువురు విన‌టం లేదు. ముందు అయితే.. మా డ‌బ్బులు మాకివ్వండి.. త‌ర్వాత చూసుకుందామంటూ వ‌రంగ‌ల్‌.. ఖాజీపేట‌.. హ‌న్మ‌కొండ ప్రాంతాల్లోని బ్యాంకుల ద‌గ్గ‌ర ఇలాంటి ప‌రిస్థితి నెల‌కొంది.

వరంగ‌ల్ ప‌ట్ట‌ణంలోని మండి బ‌జార్‌ లో ఉన్న ఒక జాతీయ బ్యాంకు నుంచి వారం వ్య‌వ‌ధిలో దాదాపు రూ.3 కోట్ల విత్ డ్రా జ‌రిగిన‌ట్లుగా చెబుతున్నారు.  వ‌రంగ‌ల్‌ లోని మ‌రో బ్యాంకులో కూడా ఇదేస్థాయిలో  విత్ డ్రా చేసుకున్నారు. ఈ విష‌యం బ‌య‌ట‌కు పొక్కితే.. డిపాజిట్ దారులు బ్యాంకులకు క్యూ క‌డ‌తార‌ని.. లేనిపోని త‌ల‌నొప్పులు తెచ్చి పెడ‌తాయ‌న్న ఉద్దేశంతో బ్యాంకు అధ‌కారులు నోరు విప్పేందుకు ఇష్ట‌ప‌డ‌టం లేదు.

విత్ డ్రా చేసుకుంటున్న వారంతా మ‌ధ్య‌త‌ర‌గ‌తి.. ఎగువ మ‌ధ్య‌త‌ర‌గ‌తికి చెందిన వారిగా చెబుతున్నారు.  సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకోవ‌టంలో ముందు ఉండే మోడీ స‌ర్కారు తీరుపై సందేహాలు ఉన్న వారు బ్యాంకుల వ‌ద్ద‌కు వెళుతున్నారు. దీంతో.. మోడీ క్యూలు ప్ర‌తి బ్యాంకులోనూ క‌నిపిస్తున్న‌ట్లు చెబుతున్నారు.

సోష‌ల్ మీడియా ద్వారా సాగుతున్న ప్ర‌చారాన్ని న‌మ్మొద్దంటూ బ్యాంకు అధికారులు స్ప‌ష్టం చేస్తున్నారు. ప్ర‌చారంలో ఉన్న‌వ‌న్నీ అనుమానాలు.. ఉత్త భ‌యాలే అంటూ బ్యాంకు అధికారులు స్ప‌ష్టం చేస్తున్నారు. బ్యాంకులో దాచుకున్న మొత్తానికి ఎలాంటి ఇబ్బంది లేద‌ని.. తాము భ‌రోసా ఇస్తున్న‌ట్లుగా బ్యాంకు అధికారులు పేర్కొంటున్నారు. అయిన‌ప్ప‌టికి కొంద‌రు అందుకు స‌సేమిరా అన‌టం క‌నిపిస్తోంది.

అయితే.. డిపాజిట్లు వెన‌క్కి తీసుకుంటున్న వారికి బ్యాంకు అధికారులు న‌చ్చ చెప్పే ప్ర‌య‌త్నంలో కిందామీదా ప‌డుతున్నారు. త‌మ‌కిప్పుడు మ‌రో కొత్త స‌మ‌స్య వ‌చ్చింద‌ని వారు వాపోతున్నారు. డ‌బ్బుల విష‌యం కావ‌టంతో త‌మ మాట‌ల‌కు క‌న్వీన్స్ అయిన‌ట్లే క‌నిపిస్తున్న‌ప్ప‌టికీ.. ఏదో అవ‌స‌రం పేరు చెప్పి డ‌బ్బులు వెన‌క్కి తీసుకునే వారి సంఖ్య పెరుగుతుందంటున్నారు. ఈ వ్య‌వ‌హారంపై కేంద్రం క‌ల్పించుకోవాల‌ని.. విస్ప‌ష్ట ప్ర‌క‌ట‌న చేయాల‌ని.. లేకుంటే బ్యాంకుల ద‌గ్గ‌ర మోడీ క్యూలు భారీగా పెరిగిపోవ‌టం ఖాయ‌మంటున్నారు.


Tags:    

Similar News