సముద్రంలో ధర్నా చేసి సెగ పుట్టించారు

Update: 2016-02-18 04:51 GMT
ఇప్పటివరకు రాస్తారోకో.. రైల్ రోకో లాంటివి వినటం కామన్. కానీ.. జలరోకో మాత్రం కాస్త కొత్త అంశమే. పశ్చిమగోదావరి జిల్లాలోని నరసాపురం మండలంలోని చినమైనవాని లంకకు చెందిన గ్రామస్తులు సముద్రం మధ్యలో చేపట్టిన ధర్నా ఇప్పుడు సంచలనంగా మారింది. ముందస్తు సమాచారం ఇవ్వకుండా సముద్రంలో చేప్టటిన సర్వేపై నిరసన పెల్లుబికింది.

చమురు నిక్షేపాలు గుర్తించేందుకు ఒఎన్జీసీ అధికారులు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా గ్రామంలోని తీరానికి పది కిలోమీటర్ల దూరంలో సర్వే నిర్వహించటం షురూ చేశారు. దీనిపై నిరసన వ్యక్తం చేసిన స్థానికులు పడవల్లో వెళ్లి ఓఎన్జీసీ చేపట్టిన సర్వేకు అడ్డుగా నిలవటమే కాదు.. వారిని కదలనీయకుండా చేశారు.

గడిచిన రెండు రోజులుగా సముద్రంలోని చేపల వేటకు రావద్దని చెప్పటంతో పాటు.. బాంబులు పేలుస్తున్నారని.. దీంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపించిన 400 మంది జాలర్లు.. 40 బోట్లలో వెళ్లి నిరసన చేపట్టటం ఓఎన్జీసీ ఉన్నతాధికారులకు ముచ్చెమటలు పట్టేలా చేసింది. ఓఎన్జీసీకి చెందిన ఓడలకు అడ్డుగా తమ పడవల్ని పెట్టి.. కదలనీయకుండా చేసిన తీరుకు దిగి వచ్చిన అధికారులు.. రెండు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వటంతో ఈ ఇష్యూ తాత్కాలికంగా సమిసింది. జలరోకో అంటూ సముద్రం మధ్యలో చేపట్టిన జాలర్ల సముద్రదీక్ష స్థానికంగా సంచలనం సృష్టించింది.
Tags:    

Similar News