తగ్గేదే లే.. విమాన ఛార్జీలకు రెక్కలు..!

Update: 2021-11-15 00:30 GMT
కరోనా పుణ్యమా... అని విమానాలకు కాదు వాటి ఛార్జీలకు రెక్కలు వచ్చాయి. విదేశీ ప్రయాణం చేయాలనుకువారికి చుక్కలు చూపిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా వెళ్లాలనుకునే ప్రయాణికులకు ఛార్జీల మోత మోగుతోంది. కరోనా మహమ్మారి కారణంగా మునుపెన్నడూ లేని విధంగా అంతర్జాతీయ ప్రమాణాలపై ఆంక్షలు వచ్చాయి. వైరస్ ముప్పు నుంచి తప్పించుకోవడానికి ఇతర దేశస్థులను అనుమతించడానికి చాలా దేశాలు నిరాకరించాయి. ఇటీవలె వైరస్ ఉద్ధృతి కాస్త తగ్గుముఖం పట్టింది. పైగా వ్యాక్సినేషన్ తీసుకున్న వారి సంఖ్య క్రమంగా పెరిగింది. ఈ నేపథ్యంలో వివిధ దేశాలను అంతర్జాతీయ ప్రయాణ ఆంక్షలను ఎత్తివేశారు. అమెరికా ప్రభుత్వం కూడా ఇతర దేశస్థులను అనుమతిస్తోంది. టీకా రెండు డోసులు తీసుకున్నవారిని అనుమతిస్తామని ప్రకటించింది. నవంబర్ 8 నుంచి ఆంక్షలను సడలించింది.

దాదాపు ఏడాదిన్నర కాలంగా అమెరికా వెళ్లేందుకు ఎదురు చూస్తున్న ప్రయాణికులకు కాస్త ఊరట లభించింది. ఇకపోతే వెంటనే విమానం ఎక్కి ఆ దేశంలో వాలిపోవాలని చూస్తున్నారు. అందుకే ఇలా ప్రకటించడమే ఆలస్యం... చకాచకా టికెట్లు బుక్ చేస్తున్నారు. ఇదే అదునుగా భావించిన విమాన సంస్థలు ఛార్జీలను పైపైకి తీసుకెళ్తున్నారు. ఫలితంగా విమానాలకు కాదు వాటి ఛార్జీలకు రెక్కలు వచ్చాయా? అన్న చందంగా ఒక్కసారిగా పెరిగాయని ప్రయాణికులు చెబుతున్నారు. ఇదివరకు అమెరికా వెళ్లాలనుకునే వారికి సింగిల్ జర్నీ టికెట్ ధర రూ.87 నుంచి రూ.1.2 లక్షలు ఉండేది. ప్రస్తుతం ఆ ఛార్జీలు రూ.1.5లక్షలకు పైగా పలుకుతున్నాయని ట్రావెల్ ఇండస్ట్రీ వర్గాలు వెల్లడించాయి. ఇక ఎక్కవ మంది వెళ్లే వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్, షికాగో వంటి నగరాలకు ఛార్జీలైతే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీటి ధర ఏకంగా రూ.3 లక్షల దాకా ఉందని తెలుస్తోంది. ఇకపోతే బిజినెస్ క్లాస్ టికెట్ ధర మునుపు రూ.3.5 లక్షలు ఉండగా ప్రస్తుతం ఆ రేటు ఆకాశాన్ని తాకేలా మారిందని చెబుతున్నారు. బిజినెస్ క్లాస్ టికెట్ ధర ఇప్పుడు రూ.6 లక్షలకు పైగా ఉంటుందని తెలిపారు.

అమెరికా ఆంక్షలు సడలిస్తున్నట్లు ప్రకటించగానే టికెట్ బుకింగ్స్ ఒక్కసారిగా ఊపందుకున్నాయి. ఈ క్రమంలోనే టికెట్ ధరలకు రెక్కలు వచ్చాయి. అయినా కూడా బుకింగ్స్ ఏమాత్రం తగ్గడం లేదని ట్రావెల్ ఇండస్ట్రీ వర్గాల వారు చెబుతున్నారు. పైగా కరోనా మూడో వేవ్ అంటున్నారు కాబట్టి... ఆ దేశానికి వెళ్లాలనుకునేవారు ఆలస్యం చేయకుండా టికెట్లు బుక్ చేసుకుంటున్నారని చెబుతున్నారు. ఛార్జీల ధరలు ఒక్కసారిగా పెరిగినా... ఎక్కువ రద్దీ ఉన్నా కూడా ప్రయాణం చేయడానికే మొగ్గుచూపుతున్నారని పేర్కొన్నారు. ప్రయాణికులకు కరోనా థర్డ్ వేవ్ భయాన్నే విమాన సంస్థలు క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని అభిప్రాపడుతున్నారు.

ఇటీవల దేశంలో ఇంధన ధరలు భారీగా పెరిగిన విషయం తెల్సిందే. చమురు ధరలను అమాంతం పెంచిన కేంద్రం... కాస్త తగ్గించింది కూడా. ఫలితంగా తెలంగాణలో ఆర్టీసీ బస్ ఛార్జీలు సైతం పెరిగాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో టికెట్ ధర పెంచుతూ టీఎస్ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. దాదాపు ఏడాదిన్నర తర్వాత గిరాకీ వచ్చిన విమాన సంస్థలు మాత్రం ఎందుకు ఊరుకుంటాయి. ప్రయాణికుల అవసరమే వారికి అదును. అందుకే విమాన ప్రయాణ ధరలను అమాంతంగా పైపైకి తీసుకెళ్లారని విశ్లేషకులు అంటున్నారు. 
Tags:    

Similar News