నమ్మరు నిజం: వరద బాధితులకు ఫైవ్ స్టార్ హోటల్ లో ఆశ్రయం

Update: 2022-08-01 09:06 GMT
వినేవారుంటే చెప్పేటోళ్లు చెలరేగిపోతారని అనుకోవచ్చు. కానీ.. మేం ఇప్పుడు చెబుతున్నది నిజంగా నిజం. నమ్మలేని వాస్తవం. అగ్రరాజ్యం సైతం విపత్తు వేళ.. చేయలేనిది దుబాయ్ లో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది.

ఇటీవల కాలంలో ఎప్పుడూ లేని రీతిలో దుబాయ్.. షార్జాలలో భారీ వర్షాలు కురిసి.. వరద పోటెత్తటం తెలిసిందే. గడిచిన మూడు దశాబ్దాల్లో ఎప్పుడూ లేనంత భారీగా వరద కారణంగా ఏడుగురు ప్రాణాలు కోల్పోయితే.. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం వాటిల్లింది.

వరద కారణంగా అక్కడి షాపులతో పాటు.. పలు ఇళ్లు దెబ్బ తిన్నాయి. ఇలాంటి విపత్తులు చోటు చేసుకుంటే మన దేశంలో బాధితుల్ని.. నిరాశ్రయుల్ని అంగన్ వాడీ కేంద్రాలు.. దగ్గర్లోని స్కూళ్లకు తరలించటం తెలిసిందే. అయితే.. దుబాయ్ ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నమైన నిర్ణయాల్ని తీసుకుంది. వరద బాధితుల్ని యుద్ధ ప్రాతిపదికన అక్కడి ప్రభుత్వం పలు ఫైవ్ స్టార్ హోటళ్లకు తరలించి.. వారికి అక్కడ ఆశ్రయాన్ని కల్పించింది.

వరదల కారణంగా జరిగిన నష్టంపై ప్రభుత్వ యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన స్పందించింది. ఇక.. పుజిరో యువరాజు షేక్ మహమ్మద్ అల్ షర్ఖీ అయితే గ్రౌండ్ జీరోకు వెళ్లి.. అక్కడి పరిస్థితుల్ని పర్యవేక్షిస్తూ.. సహాయక చర్యలు చేపడుతున్నారు.

అంతేకాదు.. అక్కడి పరిస్థితుల్ని మార్చేందుకు అవసరమైన చర్యల్ని తీసుకుంటున్నారు. ఈ వరదల కారణంగా వందలాది కార్లు కొట్టుకుపోవటం.. ఆస్తులకు నష్టం వాటిల్లింది.

వరదల కారణంగా షార్జాలోని ఖోర్ ఫకాన్.. రాస్ అల్ ఖైమాలలో చిక్కుకున్న బాధితుల్ని కాపాడేందుకు భద్రతా దళాలు రంగంలోకి దిగాయి. వరద బాధితుల్ని ఫైవ్ స్టార్ హోటళ్లకు తరలించి.. వారికి అక్కడ బస ఏర్పాట్లు చూడటం ద్వారా.. ప్రపంచంలోని మిగిలిన దేశాలకు తాము ఎంత భిన్నమైన విషయాన్ని దుబాయ్ లోని రాజ కుటుంబం చెప్పకనే చెప్పేసిందని చెప్పాలి.
Tags:    

Similar News