జెండాను మోసినందుకు.. శవాన్ని మూటగట్టి ఇంటికి పంపారే

Update: 2022-04-09 17:30 GMT
ఏపీ అధికారపక్షం వైసీపీలో చోటు చేసుకుంటున్న అంతర్గత పంచాయితీలు పార్టీకి చెందిన కిందిస్థాయి నేతలు ఆత్మహత్య చేసుకునే వరకు వెళ్లటం విస్తుపోయేలా చేస్తోంది. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం పరిధిలోని కుప్పం తిరుపతి గంగమ్మ ఆలయ మాజీ ఛైర్మన్.. వైసీపీ నేత పార్థసారధి ఆత్మహత్య పెను సంచలనంగా మారటమే కాదు.. పార్టీ అంతర్గత లోపాల్ని ఎత్తి చూపింది. చిన్నపాటి పదవి కోసం లక్షల లెక్కన నేతలకు లంచాలు ఇవ్వాల్సి రావటం.. పార్టీ కోసం పెద్ద ఎత్తున అప్పులు చేసి.. వడ్డీ కట్టలేక అవస్థలు పడుతున్న వైనం ఒకవైపు.. నెల రోజులు పదవిని కొనసాగించాలని వేడుకున్నా కాదని తీసేసిన తీరుతో మనస్తాపానికి గురైన పార్థసారథి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవటం తెలిసిందే.

తొలుత ఈ మరణాన్ని అనుమానాస్పద మరణంగా భావించినా.. అతడి సెల్ఫీ వీడియో బయటకు రావటం.. అందులో తన ఆవేదన మొత్తాన్ని షేర్ చేసుకోవటం.. గంగమ్మ దేవాలయ ఛైర్మన్ పదవి కోసం లక్షలాది రూపాయిలు ఖర్చు చేయాల్సి వచ్చిందని సెల్ఫీ వీడియోలో పేర్కొన్న పార్థసారధి.. కరోనా కారణంగా రెండేళ్ల పాటుజాతర నిర్వహించలేదని.. ఈసారి కాస్తంత సమయం ఇస్తే.. జాతరను నిర్వహించి పదవిని వదులుకుంటానని చెప్పినా.. వినకుండా పదవి నుంచి తప్పించిన వైనం అతడ్ని తీవ్ర మనస్తాపానికి గురయ్యేలా చేసింది.

పార్థసారథి ఆత్మహత్య వేళ.. ఆయన కుటుంబ సభ్యుల్ని పరామర్శించేందుకు వైసీపీ నేతలు పలువురు అతడి ఇంటికి వెళ్లారు. చిత్తూరు ఎంపీ రెడ్డప్ప.. ఎమ్మెల్సీ భరత్ లు పార్థసారధి ఇంటికి వెళితే.. శవాన్ని తాకేందుకు వీల్లేదని అతడి కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

పార్టీ జెండా ఎత్తే అవకాశమే లేని చోట.. ఏళ్ల తరబడి పార్టీ జెండాను మోసినందుకు శవాన్ని మూట కట్టి ఇస్తారా? అంటూ పార్థసారధి సతీమణి రోదనలు పలువురిని కంటతడి పెట్టేలా చేశాయి. జాతర నిర్వహించేందుకు మరో నెల రోజులు పదవిలో ఉండేలా చేసి ఉంటే బతికేవాడంటూ పార్థసారథి సతీమణి వాపోయారు.

పార్టీ జెండానే ఏడేళ్లు మోసి.. సొంత డబ్బులు ఖర్చు చేసి పార్టీకి అండగా నిలిస్తే.. చివరకు డబ్బులు తీసుకొని ఛైర్మన్ పదవి ఇవ్వటాన్ని పలువురు తప్పు పట్టారు. ఇదిలా ఉంటే.. పార్థ సారధి ఇంటికి వచ్చిన ఎంపీ.. ఎమ్మెల్సీలు.. తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. పార్టీ కోసం ఉన్న రెండు ఇళ్లను తాకట్టు పెట్టి ఆలయ బాధ్యతలు చేపట్టారని.. రెండేళ్లుగా వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారన్నారు. పార్థసారథి మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

ఈ ఉదంతంపై పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్పందించి ఉంటే బాగుండేదన్న మాట వినిపిస్తోంది. పార్టీ అంతర్గత విచారణ జరిపి.. పార్థసారధి ఆత్మహత్యకు కారణమైన వారిని గుర్తించటం.. అదే సమయంలో అతడ్ని ఆదుకునేందుకు వీలుగా ప్రకటన చేసి ఉంటే బాగుండేంటున్నారు. ఇదేమీ జరగనట్లుగా మాట వరసకు కూడా సంతాప ప్రకటనను విడుదల చేయకపోవటాన్ని పలువురు తప్పు పడుతుండటం గమనార్హం.
Tags:    

Similar News