ఆ విషయంలో 'కూటమి' తలోదారి ..!
మరీ ముఖ్యంగా ఇప్పుడు జరుగు తున్న ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో పార్టీల మధ్యే తేడా కొడుతోంది. ఎవరికి వారు గా వ్యవహరిస్తున్నారు.
రాష్ట్రంలో కూటమి పార్టీల మధ్య సఖ్యత ఎలా ఉందంటే.. పైస్థాయిలో బాగానే ఉన్నా.. క్షేత్రస్థాయిలో మా త్రం నాయకుల మధ్య కలివిడి లేకుండాపోయిందనే టాక్ వినిపిస్తోంది. మరీ ముఖ్యంగా ఇప్పుడు జరుగు తున్న ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో పార్టీల మధ్యే తేడా కొడుతోంది. ఎవరికి వారు గా వ్యవహరిస్తున్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల విషయాన్ని పక్కన పెడితే.. ఉత్తరాంధ్రలో జరుగుతున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో కూటమి పార్టీలు తలోదారిని ఎంచుకున్నాయి.
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలకు కలిపి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతోంది. ఇక్కడ నుంచి పోటీ చేస్తున్న వారిలో రఘువర్మకు టీడీపీ మద్దతు ప్రకటించింది. ఈ విషయంపై విశాఖ ఎంపీ శ్రీభరత్‌తో కమిటీ వేసిన సీఎం చంద్రబాబు.. చివరకు కమిటీ ఇచ్చిన రిపోర్టు ప్రకారం.. వర్మకు జై కొట్టారు. దీంతో టీడీపీ నాయకులు, ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు.. ఆయన పక్షాన కనీసం నాలుగు రోజులుప్రచారం చేయాలని నిర్ణయించారు. అంటే.. ఒకరకంగా.. కూటమి తరఫునే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా భావించాలి.
కానీ, ఈవిషయంలో బీజేపీ విభేదిస్తోంది. కమిటీ ఏర్పాటు విషయం కానీ.. కమిటీ నిర్నయం కానీ.. తమకు చెప్పలేదని బీజేపీ నాయకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో స్థానికంగా తమ ఇష్టం వచ్చిన వారికి మద్దతు ఇస్తామని చెబుతున్న కమల నాథులు అన్నంత పనీ చేశారు. ఈ క్రమంలో బీజేపీ నాయకులు మాజీ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసుల నాయుడికి మద్దతు ప్రకటించారు. ఆయన తరఫున ప్రచారం చేస్తామని క్షేత్రస్థాయి కమలం నాయకులు చెబుతున్నారు. ఇక, దీనిపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం మౌనంగా ఉంది.
అంటే.. రాష్ట్ర స్థాయిలోనూ నాయకులు.. వీరి ప్రతిపాదనకు అంగీకరించినట్టే కనిపిస్తోంది. దీంతో టీడీపీ ఒకరికి, బీజేపీ మరొకరికి మద్దతు ఇచ్చినట్టు అయింది. ఇదిలావుంటే.. కూటమిలోని మరోపార్టీ జనసేన అసలు ఇప్పటి వరకు ఉత్తరాంధ్రలో ఎవరికి మద్దతు ఇవ్వాలన్న విషయంపై తేల్చలేదు. ఉత్తరాంధ్రలో నూ జనసేనకు పట్టున్న విషయం తెలిసిందే. అయితే.. టీడీపీ మద్దతు ఇచ్చిన రఘువర్మకు అనుకూలంగా వ్యవహరించాలో.. లేక బీజేపీ వెంట నడవాలో ఆ పార్టీ నాయకులు నిర్ణయించకపోవడం గమనార్హం. కాగా.. మరోఆరు రోజుల్లోనే ఎన్నికల పోలింగ్ జరగనుంది.