ఈవీఎంపై ఫిర్యాదు.. మాజీ డీజీపీ వెనక్కితగ్గాడు

Update: 2019-04-24 10:12 GMT
ప్రభుత్వ వ్యవస్థలను ప్రశ్నించడం సులువు.కానీ దాని పర్యవసనాలను ఎదుర్కోవడం చాలా కష్టమని నిరూపితమైంది. ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చింది మామూలు వ్యక్తులకు కాదు.. ఏకంగా ఓ రాష్ట్రానికి డీజీపీగా చేసిన వ్యక్తే..  అసోం మాజీ డీజీపీ హరికృష్ణ దేక ఇటీవల సంచలనం సృష్టించాడు. తాను అసోంలోని లచిత్ నగర్ లోని ఎల్ పీ స్కూల్లో పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటేశానని.. కానీ వీవీ ప్యాట్ లో తన ఓటు వేరే అభ్యర్థికి పడిందని ఆరోపించాడు. అంతటితో ఆగకుండా దీనిపై ఫిర్యాదు చేద్దామని వెళ్లారు. కానీ ఇక్కడే ట్విస్ట్ నెలకొంది..

తన ఓటు వేరే వ్యక్తికి పడిందని ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయగా.. వారి నుంచి దిమ్మదిరిగే సమాధానం మాజీ డీజీపీకి ఎదురైంది. రూ.2 చెల్లిస్తే ఓటు వేరే వాళ్లకు పడిందని రసీదు ఇచ్చి ఫిర్యాదు నమోదు చేసి తనిఖీ చేస్తామని అధికారులు వివరించారు. ఇక్కడే మరో ట్విస్ట్ పెట్టారు. ఒకవేళ మీ ఫిర్యాదు తప్పని తేలితే మాత్రం ఆరు నెలల జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుందని నిబంధనలు ఉన్నాయని ఎన్నికల అధికారులు మాజీ డీజీపీకి హెచ్చరించారు. ఫిర్యాదు చేస్తారా లేదా చెప్పాలని కోరారు.

దీంతో షాక్ కు గురైన డీజీపీ ఫిర్యాదు చేసి అది నిరూపణ కాకపోతే కోరి కష్టాలు తెచ్చుకోవడం ఇష్టం లేక తన ఫిర్యాదును వాపస్ తీసుకున్నారట.. ఈవీఎంలలో తప్పును దర్యాప్తులో నిర్ధారించలేమని.. అందుకే తాను ఫిర్యాదు చేయలేదని మాజీ డీజీపీ వివరణ ఇచ్చారు.

ఇలా ఓ రాష్ట్రానికి డీజీపీగా చేసిన వ్యక్తే ఈవీఎంలలో దొర్లిన తప్పును నిరూపించలేని దుస్థితిలో చట్టాలు ఉండడం విస్మయం కలిగిస్తోంది. ఫిర్యాదు చేయడానికి కూడా వెనుకాడుతుండడంతో ఈవీఎంల అక్రమాలపై ప్రశ్నించే గొంతే లేకుండా పోతోంది.
    

Tags:    

Similar News