సీబీఐ జేడీ అంటే వారికి లెక్క లేదా?

Update: 2022-09-06 07:30 GMT
మాజీ ఐపీఎస్ అధికారి, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తెలియ‌న‌వారు ఉండ‌రంటే అతిశ‌యోక్తి కాదు. వైఎస్సార్సీపీ అధినేత, ప్ర‌స్తుతం ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ అక్ర‌మాస్తుల కేసును సీబీఐ త‌ర‌ఫున విచారించింది ల‌క్ష్మీనారాయ‌ణే కావ‌డం గ‌మ‌నార్హం. హైద‌రాబాద్ కేంద్రంగా జ‌గ‌న్‌ను విచారించ‌డం ద్వారా ల‌క్ష్మీనారాయ‌ణ నిఖార్సైన‌, నిజాయ‌తీప‌రుడైన అధికారిగా ఖ్యాతికెక్కారు. ఆ త‌ర్వాత ఆయ‌న స్వ‌చ్ఛంధ ప‌ద‌వీ విర‌మ‌ణ తీసుకుని రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. జ‌న‌సేన పార్టీలో చేరి విశాఖ‌ప‌ట్నం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే 2,88,000కు పైగా ఓట్లు సాధించారు.

ఆ త‌ర్వాత ప‌వ‌న్ క‌ల్యాణ్ పార్టీని పట్టించుకోకుండా సినిమాల్లో న‌టిస్తున్నారంటూ ల‌క్ష్మీనారాయ‌ణ జ‌నసేన‌కు గుడ్‌బై చెప్పారు. బీజేపీ, టీడీపీ ఇలా వివిధ పార్టీల్లో చేర‌తార‌ని వార్త‌లు వ‌చ్చినా అవి నిజం కాలేదు. ప్ర‌స్తుతం ఆయ‌న ఏ పార్టీలోనూ చేర‌లేదు. ఇటీవ‌ల జ‌న‌సేన‌కు అనుకూలంగా వ్యాఖ్య‌లు చేయ‌డంతో మ‌రోమారు జ‌నసేన పార్టీలోనే చేర‌తార‌ని అంటున్నారు.

కాగా వ్య‌వ‌సాయ‌మంటే మ‌క్కువ ఉన్న ల‌క్ష్మీనారాయ‌ణ కాకినాడ జిల్లా ప్ర‌త్తిపాడు మండ‌లంలోని ధ‌ర్మ‌వ‌రం, రాచ‌ప‌ల్లి గ్రామాల ప‌రిధిలో దాదాపు 12 ఎక‌రాల భూమిని కౌలుకు తీసుకున్నారు. ఆ 12 ఎక‌రాల్లో ఆయ‌న సేంద్రియ పంట‌ల‌ను పండిస్తున్నారు.

ఇటీవ‌లే సేంద్రియ ప‌ద్ధ‌తిలో వ‌రి సాగు చేస్తున్న ఫొటోలు వైర‌ల్ అయ్యాయి. అలాగే తన వ్య‌వ‌సాయ క్షేత్రంలో సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నట్లుగా ఒక ఫ్లెక్సీని సైతం ల‌క్ష్మీనారాయ‌ణ‌ ఏర్పాటు చేశారు. ఈ నేప‌థ్యంలో తన పొలంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ క‌నిపించ‌డం లేదంటూ ఆయ‌న పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. ఈ మేర‌కు ల‌క్ష్మీనారాయ‌ణ పొలానికి కాప‌లాగా ఉంటున్న‌ దొరబాబు ప్రత్తిపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు మేర‌కు సెప్టెంబ‌ర్ 1 రాత్రి నుంచి తన పంట పొలంలో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీ కనబడటం లేదని లక్ష్మీనారాయణ పోలీసుల‌కు తెలిపారు. దొర‌బాబుతోపాటు ఆయ‌న కూడా ఈ మేర‌కు పోలీసుల‌ను క‌లిశారు. సీసీ కెమెరాల‌ ఫుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తామని ప్రత్తిపాడు పోలీసులు ఆయ‌న‌కు వివ‌రించారు.

ల‌క్ష్మీనారాయణ మాత్రం ఇది ఎవరో కుట్రపూరితంగా చేశారనే అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ల‌క్ష్మీనారాయ‌ణ‌ పొలంలో ఫ్లెక్సీ ఎందుకు మాయం అయ్యింది.. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఎత్తుకుపోయారా.. ఆకతాయిలు ఎవరైనా ఫ్లెక్సీ తొల‌గించారా అనే విష‌యం విచార‌ణ‌లో తేలాల్సి ఉంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు
Tags:    

Similar News