మాజీ మిస్ తెలంగాణ.. మరోసారి సూసైడ్ యత్నం

Update: 2021-10-30 04:32 GMT
కలకలం రేపిన మాజీ మిస్ తెలంగాణ హాసిని ఆత్మహత్యాయత్నం గురించి మర్చిపోక ముందే ఆమె మరోసారి షాకిచ్చింది. నిన్న తాను ఉంటున్న ఫ్లాట్ లో ఉరి వేసుకునే ప్రయత్నం చేసి.. పోలీసులు సకాలంలో స్పందించటంతో బతికి బయటపడ్డ ఆమె.. జీవితం మీద విరక్తితో మరోసారి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈసారి ఏకంగా బ్రిడ్జి మీద నుంచి నదిలోకి దూకి ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నించింది. అయితే.. ఆమె ఆత్మహత్య చేసుకునే వైనాన్ని గుర్తించిన స్థానికులు నదిలోకి దూకి.. ఆమెను సేవ్ చేశారు.

రెండు రోజుల వ్యవధిలో రెండుసార్లు సూసైడ్ అటెంప్టు చేయటం.. రెండు సార్లు విఫలం చెందటం గమనార్హం. క్రిష్ణా జిల్లా వీరులపాడు మండలం బుధవాడ గ్రామానికి చెందిన భవాని అలియాస్ 21 ఏళ్ల హాసిని హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ లోని ఒక అపార్ట్ మెంట్లో ఒంటరిగా ఉంటోంది. ఒకవైపు వేధింపులు.. మరోవైపు ఆర్థిక సమస్యలతో జీవితం మీద విరక్తి చెందిన ఆమె.. ప్రాణాలు తీసుకోవాలని బలంగా నిర్ణయించుకుంది.

ఇందులో భాగంగా ఇన్ స్టాలో వీడియో కాల్ చేసిన ఆమె.. తల్లిదండ్రులు.. స్నేహితులతో మాట్లాడుతూ.. తాను చెప్పాల్సిన విషయాన్ని చెప్పేసి.. మిగిలిన వారు చెబుతున్న మాటల్ని వినకుండా చున్నీని మెడకు బిగించుకొని ప్రాణాలు తీసుకునే ప్రయత్నం చేసింది. దీన్ని గుర్తించిన ఆమె స్నేహితుడు ఒకరు వెంటనే డయల్ 100కు ఫోన్ చేయటం.. వాయువేగంతో వారు స్పందించి.. ఆమె ఉండే ఫ్లాట్ తలుపులు బద్ధలు కొట్టి లోపలకు ప్రవేశించారు.

లక్కీగా ఆమె ఉరి వేసుకునే ప్రయత్నం చేసిన చున్నీ ముడి వీడిపోవటంతో ఆమె బతికిపోయింది. పోలీసులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లటం.. వారు ప్రథమచికిత్స చేయటంతో ప్రాణాపాయం తప్పింది. ఆమె తల్లిదండ్రులు హైదరాబాద్ కు వచ్చి తమతో పాటు హాసినిని తీసుకెళ్లారు. కథ సుఖాంతమవుతుందని భావిస్తే.. అనూహ్యంగా ఆమె మరోసారి ఆత్మహత్యకు ప్రయత్నించటం షాకింగ్ గా మారింది. హైదరాబాద్ నుంచి సొంతూరుకు వెళ్లిన ఆమె.. ఇంట్లోని వారి కళ్లు ఎలా కప్పారో కానీ.. స్కూటీ తీసుకొని కీసర బ్రిడ్జి వద్దకు వచ్చారు.

బ్రిడ్జి మీద స్కూటీని నిలిపిన ఆమె బ్రిడ్జి మీద నుంచి మున్నేరు కాల్వలోకి దూకేసి.. ప్రాణాలు తీసుకునే ప్రయత్నం చేశారు. అయితే.. ఆమె ఆత్మహత్యాయత్నాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే కాల్వలోకి దూకి ఆమెను రక్షించారు. ఆమెను నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇలా ఎందుకు చేస్తున్నదన్న విషయం అర్థం కావట్లేదంటున్నారు. ఈ ఉదంతం మీద కంచికర్ల పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఆత్మహత్యకు ప్రయత్నించిన అమ్మాయిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన బాధ్యత కుటుంబ సభ్యుల మీద ఉంది కదా? అన్న మాట వినిపిస్తోంది. ఎందుకిలా చేస్తుందన్నది అర్థం కావట్లేదని ఆమె సన్నిహితులు వ్యాఖ్యానిస్తున్నారు.
Tags:    

Similar News