టీఆర్ఎస్ కు షాక్.. కాంగ్రెస్ గూటికి మాజీ ఎమ్మెల్యే తాటి!

Update: 2022-06-24 08:30 GMT
ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి గ‌ట్టి షాక్ త‌గ‌ల‌నుంది. టీఎర్ఎస్ కు చెందిన‌ మాజీ ఎమ్మెల్యే తాటి వెంక‌టేశ్వ‌ర్లు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవ‌డానికి సిద్ధ‌మ‌య్యార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో భారీ సంఖ్యలో కార్యకర్తలతో సహా తాటి వెంకటేశ్వర్లు కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోనున్నార‌ని తెలుస్తోంది.

భద్రాద్రి కొత్తగూడెంకు జిల్లాలో టీఆర్ఎస్ నేత తాటి వెంకటేశ్వర్లు 1999లో బూర్గంపాడు నుంచి టీడీపీ అభ్య‌ర్థిగా గెలుపొందారు. ఆ త‌ర్వాత 2014లో వైఎస్సార్సీపీ త‌ర‌ఫున అశ్వారావుపేట నుంచి గెలిచారు. విజ‌యం సాధించిన కొద్ది కాలానికే అధికార టీఆర్ఎస్ లో చేరిపోయారు. 2014లో ఖ‌మ్మం జిల్లాలోని మొత్తం ప‌ది స్థానాల్లో వైఎస్సార్సీపీ మూడు చోట్ల గెలుపొంద‌గా అందులో అశ్వారావుపేట ఒక‌టి. అయితే 2018 ఎన్నికలలో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.. తాటి వెంక‌టేశ్వ‌ర్లు. అప్ప‌టి నుంచి ఆ నియోజ‌క‌వ‌ర్గ టీఆర్ఎస్ ఇన్చార్జిగా కొన‌సాగుతున్నారు.

అయితే టీడీపీ నుంచి అశ్వారావుపేట నుంచి గెలిచిన మెచ్చా నాగేశ్వరరావు ఇటీవల టీఆర్ఎస్ లో చేరారు. అప్ప‌టి నుంచి మెచ్చా నాగేశ్వ‌ర‌రావుకే ప్రాధాన్యత ల‌భిస్తోంద‌ని.. త‌న‌ను పార్టీ అధిష్టానం ప‌ట్టించుకోవ‌డం లేదంటూ తాటి వెంకటేశ్వ‌ర్లు ఆవేద‌న చెందుతున్నారు.

మ‌రోవైపు ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో టీఆర్ఎస్ కీల‌క నేత‌గా ఉన్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం త‌న‌ను రాజకీయంగా ఇబ్బందులు పెడుతున్నారంటూ తాటి వెంక‌టేశ్వ‌ర్లు ఆరోపిస్తున్నారు.

తాజాగా మీడియా స‌మావేశం ఏర్పాటు చేసిన తాటి వెంక‌టేశ్వ‌ర్లు గుర్తింపు పార్టీలో కొన‌సాగ‌డం త‌న‌కు ఇష్టం లేద‌ని తెల‌ప‌డం గ‌మ‌నార్హం. టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అందర్ని కలుపుకుని పోవాల‌ని చెబుతుంటే కొంత‌మంది నేత‌లు మాజీ ఎమ్మెల్యేల‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని అంటున్నారు.

ఈ నేప‌థ్యంలోనే తాటి వెంకటేశ్వ‌ర్లు త‌న అనుచ‌రులు, ఇత‌ర టీఆర్ఎస్ నాయ‌కుల‌తో భారీ సంఖ్య‌లో తెలంగాణ కాంగ్రెస్ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి స‌మ‌క్షంలో కాంగ్రెస్ లో చేర‌తార‌ని తెలుస్తోంది. ఈ మేర‌కు రేవంత్ రెడ్డిని అశ్వారావుపేట‌కు ఆహ్వానించి భారీ బ‌హిరంగ స‌భ‌ను నిర్వ‌హిస్తార‌ని చెబుతున్నారు. ఆ స‌భ‌లో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుని టీఆర్ఎస్ కు షాక్ ఇస్తార‌ని అంటున్నారు.
Tags:    

Similar News