కెనడా మరో చీప్ ట్రిక్... హాస్యాస్పదం అంటున్న భారత్!
ఇందులో నేరుగా భారత ప్రధాని నరేంద్ర మోడీ పేరు ప్రస్తావించి మరీ కవ్వింపు చర్యలకు పాల్పడింది. దీనిపై భారత్ గట్టిగా తగులుకుంది.
అవకాశం వచ్చినప్పుడల్లా భారత్ పై బురదజల్లేందుకు తెగ ఉత్సాహం చూపిస్తున్న కెనడా.. మరోసారి తప్పుడు ప్రయత్నం చేసింది! ఈ మేరకు కెనడా మీడియాలో ఓ సంచలన కథనం ప్రచురితమైంది. ఇందులో నేరుగా భారత ప్రధాని నరేంద్ర మోడీ పేరు ప్రస్తావించి మరీ కవ్వింపు చర్యలకు పాల్పడింది. దీనిపై భారత్ గట్టిగా తగులుకుంది.
అవును... గత కొంతకాలంగా భారత్ - కెనడాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు గతంలో ఎన్నడూ లేనంత పతన స్థితికి చేరుకున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా.. ఖలీస్థానీ ఉగ్రవాది హర్ దీప్ సింగ్ నిజ్జర్ హత్య ఘటన నేపథ్యంలో... కెనడా ప్రధాని జాస్టిన్ ట్రూడో.. భారత్ పై విరుచుకుపడుతున్నారు.
దీనిపై స్పందించిన భారత్... కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోణంలోనే ఆలోచిస్తూ, భారత్ పై నిరాధార ఆరోపణలు చేస్తున్నారంటూ కెనడా ప్రధానిపై నిప్పులు చెరుగుతుంది. ఈ సమయంలో.. కెనడాకు చెందిన "ది గ్లోబ్ అండ్ మెయిల్" వార్తాపత్రికలో ఇటీవల నిజ్జర్ హత్య గురించి ఓ కథనం ప్రచురితమైంది.
ఈ కథనంలో... నిజ్జర్ హత్యకు కుట్రలో భారత జాతీయ భద్రతా సలహాదారు, విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా భాగమైనట్లు తమకు తెలిసిందని.. కెనడా సీనియర్ జాతీయ భద్రతా అధికారి ఒకరు చెప్పారని పేర్కొంది. ఇదే సమయంలో... భారత ప్రధాని నరేంద్ర మోడీ పేరును కూడా ఈ కథనంలో ప్రస్థావించింది.
దీనిపై స్పందించిన భారత్... తాము సాధారణంగా మీడియా కథనాలపై స్పందించబోమని.. కానీ, కెనడా ప్రభుత్వ వర్గాలను ఉద్దేశించి వెలువడిన ఈ హాస్యాస్పద వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపింది. ఇలాంటి దుష్ప్రచారాలు ఇప్పటికే దెబ్బతిన్న ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత దిగజారుస్తాయని కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ ప్రకటన విడుదల చేశారు.
కాగా... గత కొంతకాలంగా భారత్ పై కెనడా పలుమార్లు చిల్లర ఆరోపణలు చేస్తున్న పనులకు పాల్పడుతూనే ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. కెనడాలోని ఖలిస్థానీ సానుభూతిపరులపై దాడుల వెనుక భారత పాత్ర ఉందంటూ ఆ దేశ ఆర్థిక మంత్రి ఒకరు.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పై అసంబద్ధ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.