క‌ర్నూలుకు బాబు వ‌రాలు.. వన్ బై వ‌న్ కాదు.. ఒక్క‌సారే!

వెనుక‌బ‌డిన జిల్లాగా ఉన్న క‌ర్నూలును అభివృద్ధి చేసే బాద్య‌త‌ను కూట‌మి స‌ర్కారు తీసుకుంటుంద‌ని తెలిపారు.

Update: 2024-11-21 19:30 GMT

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. క‌ర్నూలు జిల్లాపై వ‌రాల వ‌ర్షం కురిపించారు. తాజాగా అసెంబ్లీలో మాట్లాడిన చంద్ర‌బాబు క‌ర్నూలు న‌గ‌రం స‌హా ఉమ్మ‌డి జిల్లా అభివృద్ధికి క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని తెలిపారు. ఈ క్ర‌మం లోనే ఆయ‌న పలు అభివృద్ధి ప్రాజెక్టుల‌ను ప్ర‌క‌టించారు. వెనుక‌బ‌డిన జిల్లాగా ఉన్న క‌ర్నూలును అభివృద్ధి చేసే బాద్య‌త‌ను కూట‌మి స‌ర్కారు తీసుకుంటుంద‌ని తెలిపారు.

త్వ‌ర‌లోనే క‌ర్నూలు జిల్లాలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. దీనికి సంబంధించి కార్యాచ‌ర‌ణ మొత్తం పూర్త‌యింద‌ని తెలిపారు. హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి అనుమ‌తి తీసుకుని.. కేంద్ర‌న్యాయ శాఖ‌కు పంపిస్తామ‌ని.. ఆ వెంట‌నే సుప్రీంకోర్టు, రాష్ట్ర‌ప‌తి నిర్ణ‌యాల మేర‌కు క‌ర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామ‌న్నారు.

అదేవిధంగా గ‌త వైసీపీ ప్ర‌భుత్వంలో ఏర్పాటైన లోకాయుక్త‌, మానవ హ‌క్కుల క‌మిష‌న్ కార్యాల‌యాల‌ను క‌ర్నూలులోనే కొన‌సాగించ‌నున్న‌ట్టు చంద్ర‌బాబు తెలిపారు. ``మేం రాజ‌కీయ క‌క్ష సాధింపుల‌కు పోం. గ‌త ప్ర‌భుత్వం ఏర్పాటు చేసింద‌న్న క‌క్ష‌తో మేం వ్య‌వ‌హ‌రించం. క‌ర్నూలులో ఏర్పాటు చేసిన మాన‌వ హ‌క్కుల‌క‌మిష‌న్ కార్యాల‌యాన్ని, లోకాయుక్త కార్యాల‌యాన్ని అక్క‌డే కొన‌సాగిస్తాం. మ‌రింత మేలైన సౌక‌ర్యాలు కూడా క‌ల్పిస్తాం`` అని చంద్ర‌బాబు వివ‌రించారు.

అదేవిధంగా క‌ర్నూలుకు మ‌రిన్ని ప్రాజ‌క్టులు తీసుకువ‌చ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌న్నారు. ఓర్వ‌కల్లును డ్రోన్ కు రాజ‌ధానిగా మారుస్తామ‌ని చంద్ర‌బాబు తెలిపారు. అదేవిధంగా కొప్ప‌ర్తిలోనూ ఐటీని ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు తెలిపారు. నదుల అనుసంధానంతో రాయలసీమకు తాగు, సాగునీటి సమస్య లేకుండా చేస్తామ‌న్నారు. కొప్పర్తి, ఓర్వకల్లు క్లస్టర్ల కోసం 5 వేల కోట్ల రూపాయ‌ల‌ను కూడా కేటాయించామ‌ని సీఎం తెలిపారు. కాగా, క‌ర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు అసెంబ్లీ ఏక‌గ్రీవంగా ఆమోదం తెల‌ప‌డం గ‌మ‌నార్హం. అనంత‌రం.. దీనిని మండ‌లికి పంపించ‌నున్నారు.

Tags:    

Similar News