కమలం గూటికి చేరుకున్న యామిని

Update: 2020-01-04 11:48 GMT
తాను ఒక్కసారి ఫిక్స్ అయితే చాలు.. వెనుకా ముందు చూసుకోకుండా తాను నమ్మిన విషయం మీద అదే పనిగా రచ్చ చేసే నేతలు కొందరు ఉంటారు. అయితే.. ఇలాంటి తీరు ప్రదర్శించే మహిళా నేతలు తక్కువ. ఆ కొరతను తీరుస్తూ వివిధ పార్టీలో ఉండే మహిళా నేతల్లో సాదినేని యామిని ఒకరు. టీడీపీలో సుదీర్ఘకాలం కొనసాగిన ఆమె ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేయటం తెలిసిందే.

ఎన్నికలకు ముందు టీడీపీ విజయం మీద ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించిన ఆమె.. ఎన్నికల్లో దారుణమైన ఓటమి తర్వాత పార్టీ నుంచి వెళ్లిపోయారు. పార్టీలో కొన్ని అంతర్గత విభేదాలు ఉన్నాయని.. ఇబ్బందులు ఉన్నప్పటికీ చంద్రబాబు తనకు ఇచ్చిన తోడ్పాటును మర్చిపోలేనని చెబుతూనే.. పార్టీకి రాజీనామా చేశారు.

టీడీపీ నుంచి బయటకు వచ్చేసిన సాదినేని యామిని.. తర్వాతి అడుగులు బీజేపీ వైపే పడతాయన్న వాదన వినిపించింది. దీనికి బలం చేకూర్చేలా తాజాగా ఆమె నిర్ణయం తీసుకున్నారు. గత ఏడాది నవంబరులో టీడీపీకి రాజీనామా చేసిన ఆమె.. అప్పటి నుంచి వేరే పార్టీలో చేరకుండా ఉండిపోయారు. తాజాగా కడప జిల్లా పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సమక్షంలో యామిని బీజేపీలోకి చేరారు.

ఎన్నికల్లో ఓటమి తర్వాత టీడీపీకి చెందిన బలమైన.. ప్రజాకర్షణ కలిగిన నేతలంతా ఒక్కొక్కరుగా బీజేపీలోకి చేరటం ఒక విశేషమైతే..తాజాగా వారి బాటలోనే సాగుతూ యామిని కూడా కమలం గూటికి వెళ్లటం ఆసక్తికరంగా మారింది. దేశ..రాష్ట్ర రాజకీయ పరిస్థితుల నేపథ్యంలోనే తాను బీజేపీలో చేరుతున్నట్లు యామిని పేర్కొన్నారు. కమలం తీర్థం పుచ్చుకునే సమయంలో యామిని వెంట మాజీ మంత్రి ఆదినారాయణ.. రాజ్యసభ సభ్యులు సీఎం రమేశ్.. మరో రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరితో పాటు.. పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు. బీజేపీ తరఫున వకల్తా పుచ్చుకొని మాట్లాడే మహిళ నేతల జాబితాలో ఈ రోజు నుంచి యామిని పేరును కూడా చేర్చుకోవాలన్న మాట.

    

Tags:    

Similar News