అన్నా'ఢీ'ఎంకే...గ‌వ‌ర్న‌ర్ ముందు నాలుగే ఆప్ష‌న్లు

Update: 2017-02-09 06:03 GMT
దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌లలిత రాజ‌కీయ వార‌స‌త్వం కోసం అన్నాఢీఎంకేలో నెలకొన్న అంతర్గత పోరు నేపథ్యంలో గవర్నర్ ఏం చర్యలు తీసుకుంటారనేది సర్వత్రా ఆసక్తిగా మారింది. మ‌హారాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ గా పూర్తి బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్న చెన్న‌మ‌నేని విద్యాసాగ‌ర్ రావు త‌మిళ‌నాడుకు ఇంచార్జీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఈ నాలుగు రకాల నిర్ణయాల్లో గవర్నర్ ఏదో ఒకటి తీసుకోవచ్చని అంచనా వేస్తున్నారు.

1. శశికళకే అవకాశం

అన్నాడీఎంకే త‌ర‌ఫున 134 మంది ఎమ్మెల్యేలున్నారు. ప్ర‌స్తుత ప‌రిణామాల ప్ర‌కారం వీరిలో 130 మంది ఎమ్మెల్యేలు శశికళకు మద్దతు ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా శశికళను గవర్నర్ కోరవ‌చ్చు. నిర్దిష్ట సమయంలో అసెంబ్లీలో బలపరీక్షను ఎదుర్కొవాలని సూచిస్తారు.

-అవకాశాలు: అధికం

2. పన్నీర్‌ సెల్వాన్ని కొనసాగించడం

అన్నాడీఎంకేలో నెల‌కొన్న రాజ‌కీయ అనిశ్చితిలో స్పష్టత వచ్చేదాకా పన్నీర్ సెల్వంను సీఎంగా కొనసాగించ‌డం. శశికళపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడేంత వరకూ వేచి చూస్తారు. నిర్దోషిగా తేలితే ఆమెకు మార్గం సుగమం అవుతుంది. దోషిగా తేలితే ఎలాగూ రాజ్యాంగపరమైన పదవులు చేపట్టే అవకాశం ఉండబోదు. అప్పుడు పన్నీర్‌సెల్వాన్ని నేతలు అంగీకరించని పక్షంలో కొత్త నేతను అన్నాడీఎంకే ఎన్నుకోవాల్సి ఉంటుంది.

-అవకాశాలు: అధికం

3. రాష్ట్రపతి పాలనకు సిఫారసు

రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్ సిఫారసు చేస్తారు. దానితో ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది. అన్నాడీఎంకే తన ఇంటిని చక్కదిద్దుకుంటే ఎన్నికలకు వెళ్లకుండానే మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం కలుగుతుంది. ప్రస్తుత అసెంబ్లీకి ఇంకా నాలుగేళ్లు గడువు ఉంది. ఈ పరిస్థితుల్లో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలెవరూ తాజా ఎన్నికలకు సిద్ధంగా లేరు.

-అవకాశాలు: మధ్యస్తం/తక్కువ

4. మెజారిటీ నిరూపణకు సెల్వానికి చాన్స్

పన్నీర్‌సెల్వాన్ని ముఖ్యమంత్రిగా కొనసాగాలని, సభలో మెజారిటీ నిరూపించుకోవాలని గవర్నర్ ఆదేశించ‌వ‌చ్చు. తనకు చాలా మంది మద్దతు ఉందని చెప్తున్న పన్నీర్‌సెల్వం  కొన్నిరోజులాగితే మరింత మంది తన పక్షాన చేరుతారని అంటారు. కానీ.. పార్టీని చీల్చాలంటే ప్రస్తుతం ఉన్న 133 మంది పార్టీ ఎమ్మెల్యేల్లో కనీసం 90 మంది ఆయనకు అవసరం.

అవకాశాలు: చాలా తక్కువ

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News