బండి సంజ‌య్ కు ప‌క్కరాష్ట్రాల నుంచి ఫుల్ స‌పోర్ట్!

Update: 2021-09-14 11:52 GMT
తెలంగాణ బీజేపీ విభాగం అధ్య‌క్షుడు బండి సంజ‌య్ కు సొంత రాష్ట్రం బీజేపీ నుంచి ఎంత స‌పోర్ట్ ఉందో పూర్తిగా బ‌య‌ట‌ప‌డ‌టం లేదు కానీ, ప‌క్క రాష్ట్రాల నుంచి మాత్రం ఫుల్ స‌పోర్ట్ ద‌క్కుతోంది. ఆయ‌న చేప‌ట్టిన పాద‌యాత్ర‌లో బీజేపీ తెలంగాణేత‌ర నేత‌లు క‌నిపిస్తున్నారు. వారంతా బండి సంజ‌య్ ను ప్ర‌శంస‌ల్లో ముంచెత్తుతున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ పై విమ‌ర్శ‌ల వాన కురిపిస్తున్నారు.  కేసీఆర్ ది కుటుంబ పాల‌న అని, నిజాం పాల‌న అని, కేసీఆర్ ప‌ని ప‌డ‌తామంటూ ప‌క్క రాష్ట్రాల బీజేపీ నేత‌లు హోరున ప్ర‌సంగాల‌ను సాగిస్తున్నారు బండి సంజ‌య్ పాద‌యాత్ర‌లో. త‌మ త‌మ రాష్ట్రాల్లో ప్ర‌జ‌ల చేత తిర‌స్క‌రించ‌బ‌డిన వారు, అవినీతి ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న నేత‌లు కూడా ఇక్క‌డ పూన‌కం వ‌చ్చిన‌ట్టుగా ఊగిపోతూ ఉండ‌టం గ‌మ‌నార్హం!

తాజాగా బండి సంజ‌య్ పాద‌యాత్ర‌లో పాల్గొని మ‌ద్ద‌తు ప‌లికారు చ‌త్తీస్ గ‌డ్ మాజీ సీఎం ర‌మ‌ణ్ సింగ్, క‌ర్ణాట‌క ఎంపీ శోభాక‌రంద్లాజే. వీరిలో ర‌మ‌ణ్ సింగ్ మాట్లాడుతూ కేసీఆర్ పై తీవ్రంగా విరుచుకుప‌డ్డారు. ప్ర‌స్తుతం తెలంగాణ చీక‌ట్లో ఉందంటున్నారు. త్వ‌ర‌లోనే సూర్యుడు ఉద‌యిస్తాడ‌ని,  తెలంగాణ‌లో క‌మ‌లం విక‌సిస్తుంద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. ఇక శోభా కరంద్లాజే కూడా అదే రేంజ్ లో స్పందించారు. తాము అధికారంలోకి రాగానే.. కేసీఆర్ అవినీతి పై చ‌ర్య‌లు ఉంటాయంటూ ఆమె చెప్పుకొచ్చారు!

అయితే క‌ర్ణాట‌క బీజేపీ అవినీతి కంపు కొట్టింది. దీంతోనే య‌డియూర‌ప్ప‌ను త‌ప్పించార‌నే టాక్ ఉంది. అలాంటి య‌డియూర‌ప్ప‌కు స‌న్నిహితురాలుగా పేరు పొందిన శోభ తెలంగాణ‌కు వ‌చ్చి అవినీతిపై చ‌ర్య‌లు అన‌డం విడ్డూర‌మే. ఇక ర‌మ‌ణ్ సింగ్ ను ప్ర‌జ‌లు ఓడించారు.

అయినా తెలంగాణ క‌న్నా చాలా వెనుక‌బ‌డి ఉన్న ఛ‌త్తీస్ గ‌డ్ నుంచి అక్క‌డి మాజీ సీఎం వ‌చ్చి.. తెలంగాణ చీక‌ట్లో ఉంద‌న‌డం కూడా కామెడీనే. ఆయ‌న సొంత రాష్ట్రంలోనే బీజేపీ అధికారానికి దూర‌మైంది. అలాంటి వ్య‌క్తి వ‌చ్చి తెలంగాణ బీజేపీ అధికారంలోకి వ‌స్తుంద‌న‌డం మ‌రో ప్ర‌హ‌స‌నం లాగుంది. ప‌క్క రాష్ట్రాల నేత‌ల‌తో త‌న పాద‌యాత్ర‌కు జోష్ తీసుకురావాల‌ని బండి సంజ‌య్ అనుకోవ‌చ్చేమో కానీ,  వాళ్ల ట్రాక్ రికార్డులు మాత్రం ఈయ‌న‌కు ప్ల‌స్ కావ‌డం క‌న్నా మైన‌స్ అయ్యేలా ఉన్నాయి!
Tags:    

Similar News