కరోనా దెబ్బకు గాంధీ భవన్ వెలవెల!!

Update: 2020-07-17 07:30 GMT
కరోనా కాటేస్తోంది. హైదరాబాద్ లో విస్తృతంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ నేతలు చాలా మందికి సోకింది. బడా లీడర్లు అయిన వీహెచ్ నుంచి చోటా గాంధీ భవన్ కార్యదర్శుల వరకు అందరికీ సోకింది.  దీంతో కాంగ్రెస్ నేతల్లో కరోనా గుబులు మొదలైంది.

వరుసగా తెలంగాణ కాంగ్రెస్ నేతలకు కరోనా సోకుతుండడంతో గాంధీ భవన్ వైపు రావడానికే కాంగ్రెస్ నేతలు జంకుతున్నారట. తాజాగా కొందరు కిందిస్థాయి నేతలు కరోనాతో చనిపోవడం.. వారు గాంధీభవన్ కు వచ్చివెళ్లడంతో ఇప్పుడు ఇటు రావడానికే భయపడిపోతున్నారనే టాక్ వినిపిస్తోంది.  

కాంగ్రెస్ మైనార్టీ సెల్ మాజీ చైర్మన్ సిరాజుద్దీన్ తోపాటు తాజాగా గ్రేటర్ హైదరాబాద్ నాయకుడు నాగేందర్ యాదవ్ లు కరోనాతో మృతిచెందారు. అంతకుముందు వీహెచ్ దంపతులు.. ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు బాలమూరు వెంకట్ తోపాటు పలువురు నేతలు కూడా కరోనా బారిన పడి కోలుకున్నారు.

గ్రేటర్ హైదరాబాద్ నాయకుడు నాగేందర్ యాదవ్ తో కాంగ్రెస్ నాయకులు అలెర్ట్ అయ్యారు. ఆందోళనలు, నిరసనలు, కార్యక్రమాలు తగ్గించేసి అవసరమైతే తప్ప గాంధీభవన్ కు రావడం లేదు. పీసీసీ అధ్యక్షుడికి ఇప్పటికే స్పష్టం చేశారట.. చాలా మంది కాంగ్రెస్ నేతల వయసు 60 ఏళ్లు దాటడంతో కొన్నాళ్ల పాటు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటామని.. కరోనా తగ్గే వరకు కాంగ్రెస్ కార్యక్రమాల్లో పాల్గొనమని విన్నవిస్తున్నారట.. దీంతో గాంధీ భవన్ లో సందడి లేక వెలవెలబోతోందని కాంగ్రెస్ వర్గాలు నిట్టూరుస్తున్నాయి.
Tags:    

Similar News